స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలపై కన్ను

17 Aug, 2017 00:42 IST|Sakshi
స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలపై కన్ను

డేటా భద్రత చర్యలు తెలపాలని కేంద్రం సూచన
న్యూఢిల్లీ: యూజర్ల డేటా దుర్వినియోగం కాకుండా భద్రపర్చేందుకు తీసుకుంటున్న చర్యలు, ప్రక్రియల గురించి తెలియజేయాలంటూ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలను కేంద్రం ఆదేశించింది. ఈ సంస్థల్లో ఎక్కువ భాగం చైనా కంపెనీలే ఉన్నాయి. డోక్లాం ప్రాంతంపై భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో.. చైనా నుంచి ఐటీ, టెలికం ఉత్పత్తుల దిగుమతులపైనా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆయా కంపెనీలు తమ వివరణ తెలియజేయడానికి ఆగస్టు 28 దాకా సమయం ఇచ్చినట్లు కేంద్ర ఐటీ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. మొబైల్‌ ఫోన్ల నుంచి డేటా లీకవుతోందంటూ అంతర్జాతీయ స్థాయిలో నివేదికలు వస్తున్న నేపథ్యంలో తొలి దశలో డివైజ్‌లను, వాటిల్లో ముందస్తుగానే లోడ్‌ చేసిన సాఫ్ట్‌వేర్, యాప్స్‌ను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని ఆయన వివరించారు.  డేటా భద్రతలో నిర్దేశిత ప్రమాణాలు పాటించడం లేదని తేలిన పక్షంలో ఐటీ చట్టంలోని 43 (ఎ) సెక్షన్‌ కింద జరిమానా విధించడం జరుగుతుందని అధికారి పేర్కొన్నారు.

ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగం (డైటీ) నోటీసులు పంపిన సంస్థల్లో చైనాకు చెందిన వివో, ఒపో, షవో మీ, జియోనీలతో పాటు మొత్తం 21 కంపెనీలు ఉన్నాయి. అలాగే, యాపిల్, శాంసంగ్, బ్లాక్‌బెర్రీ వంటి చైనాయేతర కంపెనీలతో పాటు పలు భారతీయ సంస్థలూ జాబితాలో ఉన్నట్లు కేంద్ర ఐటీ శాఖ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు