పారిశ్రామికోత్పత్తి డేటాపై దృష్టి

7 Sep, 2015 01:13 IST|Sakshi
పారిశ్రామికోత్పత్తి డేటాపై దృష్టి

విదేశీ ఇన్వెస్టర్ల ధోరణి,రూపాయి కదలికలు కూడా...
- భారీ క్షీణత నేపథ్యంలో బౌన్స్‌బ్యాక్‌కు అవకాశం
- ఈ వారం మార్కెట్‌పై నిపుణులు...
న్యూఢిల్లీ:
గత కొన్నాళ్లుగా భారీ నష్టాలతో గుబులు పుట్టిస్తున్న దేశీ స్టాక్ మార్కెట్లలో కొంత బౌన్స్‌బ్యాక్‌కు అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాం కాలు, డాలరుతో రూపాయి మారకం విలువ కదలికలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ధోరణి, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం మార్కెట్లకు దిశానిర్దేశం చేస్తాయని వారు పేర్కొన్నారు. ఈ నెల 11న ఐఐపీ డేటా విడుదల కానుంది. కాగా, గత వారం కూడా మార్కెట్ భారీ కుదుపులకు గురైన నేపథ్యంలో ఇన్వెస్టర్లు చాలా అప్రమత్తంగా వ్యవహరించే అవకాశం ఉందనేది విశ్లేషకుల అంచనా. ‘దేశీయంగా ఈ వారం ఒక్క ఐఐపీ డేటా తప్ప చెప్పుకోదగ్గ గణాంకాలు, పరిణామాలేవీ కనబడటం లేదు.

అయితే, పతనావస్థలో ఉన్న ఈక్విటీ మార్కెట్ స్థిరీకరణ కోసం ప్రభుత్వం, ఆర్‌బీఐ నుంచి ఆశ్చర్యకరమైన సానుకూల చర్యలేవైనా ఉంటాయన్న విశ్వాసం ఇన్వెస్టర్లలో నెలకొంది. మరోపక్క, చైనా, అమెరికా ఆర్థిక వ్యవస్థలకు సంబంధించిన పరిణామాలు, వార్తలను కూడా మార్కెట్ వర్గాలు నిశితంగా గమనిస్తుంటారు’ అని రెలిగేర్ సెక్యూరిటీస్ ప్రెసిడెంట్(రిటైల్ డిస్ట్రిబ్యూషన్) జయంత్ మాంగ్లిక్ పేర్కొన్నారు.
 
ఫెడ్ పాలసీ నేపథ్యంలో...
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇన్వెస్టర్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ పాలసీ నిర్ణయంపై ఉత్కంఠతో ఉన్నారు. ప్రధానంగా గత వారంలో వెలువడిన ఉద్యోగ గణాంకాలతో ఫెడ్ వడ్డీరేట్లు పెంచుతుందా లేదా అన్న ఆసక్తి మరింత పెరిగేలా చేసింది. ఆగస్టులో నిరుద్యోగం 5.1 శాతానికి దిగిరాగా, కొత్త ఉద్యోగాలు అంచనాల కంటే తక్కువగా నమోదవ్వడమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 16-17న పాలసీ సమీక్ష సందర్భంగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచకపోవచ్చని కొందరు.. పెంచుతుందని మరికొందరు నిపుణులు అంచనాలు వేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ రికవరీ మెరుగ్గా ఉండటాన్ని పెంపునకు కారణంగా చూపుతున్నారు.

స్వల్పకాలానికి ప్రపంచ మార్కెట్ల కదలికలన్నింటినీ ఫెడ్ పాలసీయే నిర్దేశించనుందని బొనాంజా పోర్ట్‌ఫోలియో తాజా నివేదికలో పేర్కొంది. రేట్ల పెంపునకు సంబంధించి ఎదో ఒక సంకేతం వెలువడేవరకూ తీవ్ర హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడింది. ‘ఫెడ్ పాలసీ రేట్ల పెంపు అంచనాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్స్ ఇతరత్రా రిస్కీ పెట్టుబడి సాధనాల నుంచి నిధులను ఉపసంహరించుకోవచ్చన్న ఆందోళనలతో వర్ధమాన దేశాల స్టాక్ మార్కెట్లు కుదుపులకు గురవుతున్నాయి. బేరిష్ సెంటిమెంట్ తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఈ వారం మార్కెట్ బౌన్స్‌బ్యాక్‌కు అవకాశాలు కనబడుతున్నాయి’ అని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ ఫౌండర్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు.
 
గత వారం మార్కెట్...

అమెరికా ఉద్యోగ గణాంకాలు... ఫెడ్ వడ్డీరేట్ల పెంపు భయాల ప్రభావంతో గతవారం దేశీ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. వారం మొత్తంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 1,190 పాయింట్లు(4.51%) క్షీణించి 25,202 వద్ద ముగిసింది. ఇక ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 347 పాయింట్లు(4.33%) దిగజారి 7,655 పాయింట్ల వద్ద స్థిరపడింది.
 
4 రోజుల్లో రూ.4,000 కోట్లు ఔట్!
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) భారత్ స్టాక్ మార్కెట్ల నుంచి వేగంగా నిధులను ఉపసంహరించుకుంటున్నారు. గత నాలుగు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా దాదాపు రూ.4,000 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. గత నెల(ఆగస్టు)లో రికార్డు స్థాయిలో రూ.17,428 కోట్ల పెట్టుబడులను నికరంగా స్టాక్స్ నుంచి వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ ఏడాది క్యూ1లో బలహీన జీడీపీ గణాంకాలు(వృద్ధి 7%), అంతర్జాతీయంగా ఆర్థిక మందగమనం, ఫెడ్ పాలసీ రేట్ల పెంపు భయాలు దీనికి కారణమని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మరిన్ని వార్తలు