మేడిన్ ఇండియా సాఫ్ట్‌వేర్‌పై కేంద్రం దృష్టి

1 Jul, 2014 01:32 IST|Sakshi
మేడిన్ ఇండియా సాఫ్ట్‌వేర్‌పై కేంద్రం దృష్టి

నేడు బెంగళూరులో ఐటీ పంచాయత్

న్యూఢిల్లీ: భారత్‌ను సాఫ్ట్‌వేర్ తయారీ కేంద్రంగా మలచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దేశీయ ఐటీ సేవల పరిశ్రమ పదివేల కోట్ల డాలర్లకు మించిపోయింది. పలు ఐటీ కంపెనీలు మేడిన్ ఇండియా సాఫ్ట్‌వేర్ తయారీపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నేడు(మంగళవారం) బెంగళూరులో ఐటీ పంచాయత్ జరుగుతోంది. నాస్కామ్ ఇతర కొన్ని కీలకమైన సంఘాల భాగస్వామ్యంతో జరుగుతోన్న ఈ ఐటీ పంచాయత్‌లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొననున్నారు.
 
ఈ సమావేశంలోనే ఆయన మేడిన్ ఇండియా  సాఫ్ట్‌వేర్ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించనున్నారని ఐటీ, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. వచ్చే వారంలో బడ్జెట్ రానున్న సందర్భంగా జరుగుతున్న  ఈ సమావేశం సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన అవకాశాలు, అడ్డంకులు తదితర అంశాలపై దృష్టి సారిస్తుందని తెలిపారు. దేశీయ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో ఐటీ వినియోగం అంశంపై కూడా చర్చ జరుగుతుందని తెలిపారు.
 
కాగా 2012-13 ఆర్థిక సంవత్సరంలో ఐటీ, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్(ఐటీ-బీపీఎం) పరిశ్రమ 10,900 డాలర్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. మరోవైపు ఐటీ ఉత్పత్తుల ఆదాయం 220 కోట్ల డాలర్లుగానే ఉంది. ఈ ఆదాయాన్ని 2020 కల్లా 1,000 డాలర్లకు పెంచాలని నాస్కామ్ లక్ష్యంగా నిర్దేశించింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లలో వాడే ఆపరేటింగ్ సిస్టమ్‌లను మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థలు తయారు చేస్తున్నాయి. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌లను దేశీయంగా తయారు చేయాలనేది ప్రభుత్వం సంకల్పం.

మరిన్ని వార్తలు