కొత్తగా 500 శాఖల ఏర్పాటు

22 Jun, 2014 02:35 IST|Sakshi
కొత్తగా 500 శాఖల ఏర్పాటు
  • దేశీ విస్తరణపై దృష్టి
  • 15% వ్యాపారాభివృద్ధి లక్ష్యం
  • ఏడాది చివర్లో ఎఫ్‌పీఓ
  • కార్పొరేషన్ బ్యాంక్ సీఎండీ  ఎస్.ఆర్.బన్సల్
  • హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేషన్ బ్యాంక్ వ్యవసాయ, ఎమ్‌ఎస్‌ఎంఈ, రిటైల్ రుణాలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మూడు రంగాల్లో ఈ ఏడాది 30 శాతంపైగా వృద్ధిని నమోదు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కార్పొరేషన్ బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ ఎస్.ఆర్.బన్సల్ తెలిపారు. రెండు రోజుల నగర పర్యటన సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వ్యాపారంలో 15 శాతానికిపైగా వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను వ్యక్తం చేశారు.
     
    గత ఏడాది కార్పొరేషన్ వ్యాపార పరిమాణం రూ.3.30 లక్షల కోట్లు దాటింది.  ఈ ఏడాది దేశవ్యాప్తంగా 500 శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం శాఖల సంఖ్యను 2,500కి పెంచుకోనున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో కొత్తగా 50 శాఖలను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దుబాయ్, హాంకాంగ్‌లో ఉన్న రిప్రజెంటేటివ్ ఆఫీసులను పూర్తి శాఖలుగా మార్చడంతో పాటు మరో రెండు దేశాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేయడానికి వారం రోజుల్లో ఆర్‌బీఐని కలుస్తున్నట్లు బన్సల్ వివరించారు. ప్రస్తుతం వ్యాపార విస్తరణకు నిధులు అవసరం లేదని, మార్కెట్ పరిస్థితులు బాగుంటే ఏడాది చివర్లో మరోసారి పబ్లిక్ ఇష్యూకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.

మరిన్ని వార్తలు