ఎగుమతి రంగాలపై ప్రత్యేక దృష్టి

14 Feb, 2020 04:44 IST|Sakshi

కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడి 

న్యూఢిల్లీ: ఎగుమతులకు సంబంధించి భారత్‌కు అనుకూల పరిస్థితులు ఉన్న 12–13 రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ వెల్లడించారు. టెక్స్‌టైల్స్‌ తదితర రంగాలు వీటిలో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రస్తుతం 37 బిలియన్‌ డాలర్లుగా ఉన్న టెక్స్‌టైల్స్‌ రంగం ఎగుమతులు వచ్చే 10 సంవత్సరాల్లో 100 బిలియన్‌ డాలర్లకు చేరగలవని గోయల్‌ పేర్కొన్నారు.

సేవల రంగం ఎగుమతులు కూడా మెరుగైన వృద్ధి రేట్లు సాధిస్తున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో మిగతా రంగాలతో పోలిస్తే అధిక స్థాయిలో ఎగుమతులకు ఆస్కారమున్న రంగాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నామని ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్‌ చెప్పారు. 2019–20 ఏప్రిల్‌– డిసెంబర్‌ మధ్య కాలంలో ఎగుమతులు సుమారు 2 శాతం, దిగుమతులు దాదాపు 9 శాతం క్షీణించిన నేపథ్యంలో గోయల్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అసంబద్ధ పోటీ నుంచి దేశీ పరిశ్రమలను కాపాడేందుకు భారత్‌ కొన్ని రక్షణాత్మక విధానాలు పాటించడం తప్పనిసరిగా మారిందని చెప్పారు.  

ఈ–కామర్స్‌ సంస్థలకు వేల కోట్ల నష్టాలా.. ఎలా...
బిలియన్ల డాలర్ల పెట్టుబడులతో భారత్‌నేమీ ఉద్ధరించడం లేదంటూ అమెజాన్‌ను గతంలో ఆక్షేపించిన గోయల్‌ తాజాగా ఈ–కామర్స్‌ కంపెనీల నష్టాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ–కామర్స్‌ కంపెనీలు వేల కోట్ల నష్టాలు ప్రకటిస్తుండటంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. రూ. 5,000 కోట్ల టర్నోవరుపై ఏకంగా రూ. 6,000 కోట్ల నష్టాలు ప్రకటించిందంటే నమ్మశక్యంగా అనిపించదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఈ–కామర్స్‌ సంస్థలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని గోయల్‌ స్పష్టం చేశారు. అలాంటి సంస్థలను ఎప్పుడూ స్వాగతిస్తామని చెప్పారు. అమెజాన్‌పై గతంలో చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ మంత్రి తాజా వివరణనిచ్చారు. ‘ఈ–కామర్స్‌తో ఇంత మందికి ప్రయోజనం చేకూరుతుందన్న హామీలు వినడానికి ఆకర్షణీయంగానే ఉంటాయి. కానీ చట్టరీత్యా ఆమోదయోగ్యం కాని విధానాల వల్ల పది రెట్లు మంది ప్రయోజనాలు దెబ్బతినకూడదు’ అని గోయల్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు