ఫోర్బ్స్ ఆసియా దాతల జాబితాలో ఏడుగురు భారతీయులు

28 Aug, 2015 00:35 IST|Sakshi
ఫోర్బ్స్ ఆసియా దాతల జాబితాలో ఏడుగురు భారతీయులు

వాషింగ్టన్: ఫోర్బ్స్ ఆసియా ప్రాంత దాతల జాబితాలో ఏడుగురు భారతీయులు స్థానం దక్కించుకున్నారు. వీరిలో కేరళకు చెందిన వ్యాపారవేత్త సన్నీ వార్కీ ఉన్నారు. ఆయన తన 2.25 బిలియన్ డాలర్ల సంపదలో సగ భాగాన్ని విరాళంగా ఇచ్చారు. ఆయన 14 దేశాల్లో 70 ప్రైవేట్ పాఠశాలలను నడిపిస్తున్నారు. అలాగే జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవ స్థాపకులు గోపాలకృష్ణన్, నందన్ నిలేకని, శిబులాల్, మోహన్‌దాస్ ఉన్నారు. వీరు ఆరోగ్య, విద్యా రంగాల్లో పేద విద్యార్థుల చదువుకు సాయం అందించడం, వైద్య పరిశోధనలు వంటి తదితర వాటికి ఆర్థిక చేయూత అందించారు.

వీరితోపాటు ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కూడా ఈ జాబితాలో ఉన్నారు. ప్రాచీన భారతీయ సాహిత్య కావ్యాలకు ప్రాచుర్యం కల్పించాలనే లక్ష్యంతో నారాయణ మూర్తి కుమారుడు రోహన్ 5.2 మిలియన్ డాలర్లను హార్వర్డ్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చారు. రోహ న్ ద్వారా నారాయణ మూర్తి ఈ జాబితాలో స్థానం పొందారు. ఈ జాబితాలో విట్‌కంబ్ అండ్ షాఫ్ట్స్‌బరీ టైలర్స్ వ్యవస్థాకులు సురేశ్, మహేశ్ రామకృష్ణన్ స్థానం సాధించారు. వీరు 3 మిలియన్ డాలర్లు వెచ్చించి భారత్‌లో 4 వేల మందికి పైగా టైలరింగ్ శిక్షణ ఇప్పించారు. ఫోర్బ్స్ ఆసియా దాతల జాబితాలో తొలిసారిగా నేపాల్‌కు చెందిన బినోద్ కే చౌదరీ స్థానం దక్కించుకున్నారు.

మరిన్ని వార్తలు