ఎలిజిబెత్ ఆస్తులు జీరోకి పడిపోయాయట

2 Jun, 2016 16:19 IST|Sakshi
ఎలిజిబెత్ ఆస్తులు జీరోకి పడిపోయాయట

హెల్త్ టెక్నాలజీ కంపెనీ థెరానోస్ ఇంక్ వ్యవస్థాపకురాలు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలిజిబెత్ నికర ఆస్తులు ఒక్కసారిగా జీరోకి పడిపోయాయట. గతేడాది రూ.30వేల కోట్లగా ఉన్న ఎలిజిబిత్ నికర ఆస్తులు ఈ ఏడాది జీరోగా ఉన్నాయని ఫోర్బ్స్ నివేదించింది. హోమ్స్ ..బ్లడ్ టెస్టింగ్ కంపెనీ నిర్వర్తించే రక్త పరీక్షల్లో నాణ్యత లేవని, కచ్చితమైన ఫలితాలు చూపించడం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ కంపెనీపై గత వారం కేసు కూడా నమోదైంది. ఈ కేసుపై వివిధ ఫెడరల్ అండ్ స్టేట్ ఏజెన్సీలు విచారణ కొనసాగిస్తున్నాయి.

ప్రైవేట్ పెట్టుబడిదారులు థెరానోస్ లో దాదాపు 900 కోట్ల డాలర్ల వాల్యుయేషన్ మేర స్టాక్స్ కొనుగోలు చేశారని, అయితే ఇప్పుడు అవి 8000 లక్షల డాలర్లకు పడిపోయాయని ఫోర్బ్స్ నివేదించింది. కంపెనీ వాల్యుయేషన్ పడిపోవడంతో, హోమ్స్ స్టాక్ కు ఎలాంటి విలువ లేదని ఫోర్బ్స్ తెలిపింది. అయితే ఫోర్బ్స్ నివేదించిన ఈ రిపోర్టును థెరానోస్ అధికార ప్రతినిధి బ్రూక్ బుకానన్ ఖండించారు. రహస్యపూర్వకమైన ఆర్థిక సమాచారాన్ని ఫోర్బ్స్ కు సమర్పించకపోవడం వల్లే, ఈ తప్పుడు రిపోర్టు నివేదించిందని పేర్కొన్నారు. ఈ రిపోర్టు కేవలం ఊహించి రాసిన మాదిరిగా ఉందని, వాస్తవ రిపోర్టు కాదని తెలిపారు. 2015 అమెరికాలో స్వశక్తితో ఎదిగిన అత్యంత ధనికురాలిగా పేర్కొన్న ఫోర్బ్స్ నివేదిక, మరి ఈ రిపోర్టులో ఎందుకు హోమ్స్ విలువను అంత తగ్గించిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఫోర్బ్స్ నివేదికపై హోమ్స్ ఇంకా స్పందించలేదు.

ప్రజలకు ఏదైనా సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో,  2003లో హోమ్స్  థెరానోస్ ను స్థాపించారు. సులభపద్ధతిలో బ్లడ్ శాంపుల్స్ ను సేకరించి, బ్లడ్ టెస్టు నిర్వర్తించే పరికరాల ఆమె తీసుకొచ్చారు. వన్ డ్రాప్ బ్లడ్ తోనే వివిధ రకాల రక్త పరీక్ష ఫలితాలు హోమ్స్ బ్లడ్ టెస్టింగ్ కంపెనీ అందిస్తుంటోంది. అయితే ఈ ఫలితాలు పారదర్శకతతో లేవని, తప్పుడు ఫలితాలు చూపుతున్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టులు నివేదించాయి. అప్పటినుంచి అమెరికా సెక్యురిటీ ఎక్సేంజ్ కమిషన్, స్టేట్ హెల్త్ డిపార్ట్ మెంట్స్, మెడికేర్, మెడికైడ్ సెంటర్లు, యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ లు  హోమ్స్ కంపెనీపై విచారణ కొనసాగిస్తున్నాయి.

మరిన్ని వార్తలు