అమెరికాలో భారత నారీ భేరి

1 Dec, 2018 00:18 IST|Sakshi

నలుగురు భారతీయ వనితలకు చోటు

ఫోర్బ్స్‌ అమెరికా టాప్‌ 50  టెక్‌ దిగ్గజాల జాబితా  

న్యూయార్క్‌: అమెరికాలో భారత సంతతికి చెందిన మహిళలు కూడా టెక్నాలజీ రంగంలో విజయపతాకం ఎగురవేస్తున్నారు. ఫోర్బ్స్‌ సంస్థ 2018 సంవత్సరానికి సంబంధించి రూపొందించిన ‘అమెరికాలో అగ్ర స్థాయి 50 మంది టెక్నాలజీ ప్రముఖుల’ జాబితాలో భారత సంతతికి చెందిన నలుగురు మహిళలు చోటు దక్కించుకోవటమే దీనికి నిదర్శనం. సిస్కో మాజీ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ పద్మశ్రీ వారియర్, ఉబెర్‌ సీనియర్‌ డైరెక్టర్‌ కోమల్‌ మంగ్తాని, కన్‌ఫ్లూయంట్‌ సహ వ్యవస్థాపకురాలు నేహ నార్ఖడే, ఐడెంటిటీ మేనేజ్‌మెంట్‌ కంపెనీ అయిన ‘డ్రాబ్రిడ్జ్‌’ వ్యవస్థాపకురాలు, సీఈవో కామాక్షి శివరామకృష్ణన్‌ ఈ జాబితాలో నిలిచారు. ‘‘మహిళ భవిష్యత్తు కోసం వేచి చూడదు. 2018 టాప్‌ 50 టెక్నాలజీ మహిళల జాబితా... ముందుచూపుతో ఆలోచించే మూడు తరాల టెక్నాలజీ నిపుణులను గుర్తించడం జరిగింది’’ అని ఫోర్బ్స్‌ పేర్కొంది. ఐబీఎం సీఈవో గిన్ని రోమెట్టి, నెట్‌ఫ్లిక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అన్నే ఆరన్‌ వంటి టెక్నాలజీ దిగ్గజాలూ ఈ జాబితాలో ఉన్నారు. 

సిస్కో ఎదుగుదలలో వారియర్‌   
పద్మశ్రీ వారియర్‌ (58) మోటొరోలా, సిస్కో కంపెనీల్లో ఉన్నతస్థాయిల్లో పనిచేశారు. ప్రస్తుతం చైనీస్‌ ఎలక్ట్రిక్‌ స్టార్టప్‌ ఎన్‌ఐవోకు అమెరికా సీఈవోగా ఉన్నారు. 138 బిలియన్‌ డాలర్ల సిస్కో సిస్టమ్స్‌ కంపెనీ కొనుగోళ్ల ద్వారా మరింత ఎదగటంలో వారియర్‌ ముఖ్య పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్, స్పాటిఫై బోర్డుల్లోనూ భాగస్వామిగా ఉన్నారు. ‘‘టెక్నాలజీ రంగంలో ఇతర మహిళలకు మార్గదర్శిగా వ్యవహరించేందుకు వారియర్‌ ఇప్పటికీ వీలు చేసుకుంటున్నారు. ట్విట్టర్‌ ద్వారా 16 లక్షల మంది ఫాలోవర్లకు అందుబాటులో ఉంటున్నారు’’అని ఫోర్బ్స్‌ ప్రస్తుతించింది. గుజరాత్‌లోని ధర్మసిన్హ్‌ దేశాయ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ పూర్వ విద్యార్థి అయిన మంగ్తాని ప్రస్తుతం క్యాబ్‌ అగ్రిగేటర్‌ ఉబెర్‌లో బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ హెడ్‌. పలు స్వచ్ఛంద సంస్థలకూ సేవలందిస్తున్నారు. పుణే యూనివర్సిటీ పూర్వ విద్యార్థి నార్ఖెడె లింక్డెన్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసే సమయంలో అపాచేకఫ్‌కా అనే అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. ఇది రియల్‌టైమ్‌లో భారీ గా వచ్చే డేటాను ప్రాసెస్‌ చేస్తుంది. కన్‌ఫ్లూయెంట్‌ను కూడా ఆమె స్థాపించారు. ఈ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్, నెట్‌ఫ్లిక్స్, ఉబెర్‌కు సేవలందిస్తోంది. ‘‘ప్రజలు రోజువారీగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను విస్తృతంగా వినియోగిస్తున్నారు. అన్ని రకాల పరికరాల్లో ప్రకటనలను చూపించే మార్గం ప్రకటనదారులకు కావాలి. ఫేస్‌బుక్, గూగుల్‌ ప్రకటనదారులకు ఇప్పటికే ఈ సేవలందిస్తున్నాయి. డ్రాబ్రిడ్జ్‌ వ్యవస్థాపకురాలు కామాక్షి శివరామకృష్ణన్‌(43) రూపంలో వా టికిపుడు పోటీ ఎదురైంది’’ అని ఫోర్బ్స్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు