కస్టమైజ్డ్ వాహనాలకు డిమాండ్..

20 Jan, 2015 02:27 IST|Sakshi
కస్టమైజ్డ్ వాహనాలకు డిమాండ్..

- ఫోర్స్ మోటార్స్ ప్రెసిడెంట్ అశుతోష్ ఖోస్లా  
- హైదరాబాద్ మార్కెట్లోకి కొత్త మోడల్ బస్‌లు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వాహనాల డిజైన్‌ను కస్టమైజ్ చేస్తున్నట్టు ఫోర్స్ మోటార్స్ తెలిపింది. వాహన కంపెనీలకు ఈ-సెల్లింగ్ కొత్త వేదికైందని ఫోర్స్ మోటార్స్ వాణిజ్య వాహనాల విభాగం సేల్స్, మార్కెటింగ్ ప్రెసిడెంట్ అశుతోష్ ఖోస్లా తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో సోమవారం కొత్త బస్‌లను విడుదల చేసిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

ఫర్నిచర్, ఆహారోత్పత్తులు, ఎలక్ట్రానిక్స్ వంటి విక్రయాల్లో ఉన్న ఆన్‌లైన్ కంపెనీలకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు అవసరమవుతాయని చెప్పారు. కంపెనీ అమ్మకాల్లో ఈ విభాగం వాటా ప్రస్తుతం 5 శాతముందని, నూతన డిజైన్ల అభివృద్ధిపై దృష్టిసారించామని చెప్పారు. సైనిక దళాలకు అంబులెన్సులను కంపెనీ ఇప్పటికే సరఫరా చేస్తోంది. సైనికుల ప్రయాణానికి అనువైన వాహనాలనూ డిజైన్ చేయగలమన్నారు.
 
చైల్డ్ బస్ ట్రాకర్..
ఫోర్స్ మోటార్స్ 13 సీట్ల ట్రాక్స్ క్రూయిజర్ నుంచి 26 సీట్ల ట్రావెలర్-26 మోడల్స్ వరకు చైల్డ్ బస్ ట్రాకర్ ఫీచర్‌ను పొందుపరిచింది. విద్యార్థి స్కూల్ వాహనంలో ఎక్కింది మొదలు ఇంటికి చేరే వరకు ఈ వ్యవస్థ ట్రాక్ చేసి సమాచారాన్ని పాఠశాలకు, ఆపరేటర్‌కు, తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు చేరవేస్తుంది. నిర్దేశించినట్టు కాకుండా వేరే మార్గంలో బస్ వెళ్లినా అలర్ట్ చేస్తుంది. లైవ్ వీడియో చూసేందుకు కెమెరాలూ ఉంటాయి.

ఎక్స్ షోరూంలో వాహనాల ధర రూ.6.34 లక్షల నుంచి ప్రారంభం. కాగా, 9-20 సీట్ల విభాగం వాహనాలు 3 శాతం వృద్ధితో ఏటా దేశంలో 18,000 యూనిట్లు అమ్ముడవుతున్నాయి. 22 శాతం వృద్ధితో 61 శాతం వాటాను ఫోర్స్ దక్కించుకుంది. 26 సీట్ల వాహనాలు ఏటా 10 వేలు అమ్ముడవుతున్నాయి. కంపెనీ 61 శాతం వృద్ధితో 12 శాతం వాటా చేజిక్కించుకుంది. 2014-15లో మొత్తం 23,000 యూనిట్ల విక్రయాలు లక్ష్యంగా చేసుకుంది.

మరిన్ని వార్తలు