ఏకంగా ఫోర్డ్‌ ఎస్‌యూవీ రూ.3లక్షలు తగ్గింది!

3 Jul, 2017 15:00 IST|Sakshi
దిగొచ్చిన ఫోర్డ్‌ ఇండియా ధరలు
న్యూఢిల్లీ : జీఎస్టీ ఎఫెక్ట్‌తో కార్ల సంస్థలు, టూ-వీలర్‌ దిగ్గజాలు తమ వాహనాలపై భారీగా ధరలను తగ్గించేస్తున్నాయి. ఇప్పటికే మారుతీ సుజుకీ, జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌, టయోటా, బీఎండబ్ల్యూలు తమ వాహనాల రేట్లను తగ్గిస్తున్నట్టు ప్రకటించగా.. తాజాగా మరో ప్రముఖ ఆటో తయారీ సంస్థ ఫోర్డ్‌ ఇండియా కూడా రేట్ల కోతను చేపట్టింది. జీఎస్టీ ప్రయోజనాలను కస్టమర్లకు అందించే లక్ష్యంతో తక్షణమే తమ వాహనాలన్నింటిపైన ధరలను 4.5 శాతం వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ధరల తగ్గింపు రాష్ట్రం, రాష్ట్రానికి భిన్నంగా ఉంటుందని, ఎక్కువగా రేట్ల తగ్గింపు ముంబైలో ఉందని ఫోర్డ్‌ ఇండియా చెప్పింది. ఈ రేట్ల తగ్గింపుతో కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ ఏకంగా రూ.3లక్షల మేర తగ్గింపుతో చౌకగా అందుబాటులోకి వచ్చింది.
 
4.5 శాతం వరకు ప్రయోజనాలను కస్టమర్లకు తాము బదిలీ చేయనున్నామని ఫోర్డ్‌ ఇండియా అధికార ప్రతినిధి చెప్పారు. ఢిల్లీలో హ్యాచ్‌బ్యాక్‌ ఫిగో రూ.2000 తగ్గింది. అదేవిధంగా కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఎకోస్పోర్ట్‌ ధర కూడా రూ.8000 మేర తగ్గినట్టు కంపెనీ తెలిపింది. ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్‌ రూ.1.5 లక్షల వరకు కిందకి పడిపోయినట్టు పేర్కొంది. ముంబైలో అయితే ఫిగోపై రూ.28వేలు ధర తగ్గగా.. ఎస్‌యూవీ ఎండీవర్‌ రూ.3 లక్షల మేర తగ్గి, చౌకగా మారింది. కంపెనీ హ్యాచ్‌బ్యాక్‌ ఫిగో నుంచి ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్‌ వరకు ప్రారంభ ధరలు రూ.4.75 లక్షల నుంచి రూ.31.5 లక్షల(ఎక్స్‌షోరూం) మధ్యలో ఉన్నాయి. 
 
ఫోర్డ్‌ ఇండియాతో పాటు టీవీఎస్‌ మోటార్స్‌ కూడా నేడు ధరలను తగ్గించింది. ఈ కంపెనీ మార్కెట్లో విక్రయించే తమ అన్ని టూ-వీలర్స్‌ పైన రూ.4150 వరకు తగ్గింపును ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే టూ-వీలర్‌ వాహనాలను విక్రయించే మరో సంస్థ హీరో మోటోకార్ప్‌ కూడా జీఎస్టీ లాంచ్‌ అయిన వెంటనే రూ.1,800 వరకు ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. 
>
మరిన్ని వార్తలు