విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) ఫేవరేట్ షేర్లే దూసుకెళ్లాయ్

15 Jul, 2013 04:31 IST|Sakshi
Investors

న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లకు(ఎఫ్‌ఐఐలు) ఫేవరేట్‌గా నిలిచిన 20 స్టాక్స్ లాభాలతో దూసుకెళ్లాయ్. మరోవైపు ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను తగ్గించుకున్న షేర్లు నీరసించాయి. మోర్గాన్ స్టాన్లీ తాజాగా రూపొం దించిన నివేదికలో ఈ విషయాలను పేర్కొంది. నివేదిక ప్రకారం గడిచిన ఐదేళ్ల కాలంలో ఫైనాన్షియల్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ, ఆటో దిగ్గజం ఎంఅండ్‌ఎంతోపాటు, ఇండస్‌ఇండ్ బ్యాంక్, లుపిన్ తదితరాలు భారీ లాభాలను అందించాయి.
 
ఈ స్టాక్స్‌లో ఎఫ్‌ఐఐలు పెట్టుబడులను పెంచుకుంటూ రావడం విశేషం! మార్కెట్ క్యాప్ రీత్యా టాప్-100 కంపెనీలలో ఎఫ్‌ఐఐలకు ఫేవరేట్లుగా నిలిచిన 20 షేర్లు గరిష్టంగా 7 రెట్ల రిటర్న్‌లను అందించాయి. మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం 20 ఫేవరేట్ షేర్లలో ఇండస్‌ఇండ్ 784% లాభపడగా, జీఎస్‌కే కన్జూమర్ 774%, లుపిన్ 523%, ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్ 429%, యస్ బ్యాంక్, మదర్‌సన్ సుమీ 317% చొప్పున రిటర్న్‌లను అందించాయి.
 
  ఇక మారికో, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, కాల్గేట్ పామోలివ్, ఆర్‌ఈసీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్, హెచ్‌డీఎఫ్‌సీ 107-280% మధ్య జంప్ చేశాయి. ఎఫ్‌ఐఐలు తమ వాటాలను తగ్గించుకున్న కంపెనీలలో జేపీ అసోసియేట్స్, బీహెచ్‌ఈఎల్, టాటా స్టీల్, ఆర్‌కామ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, రాన్‌బాక్సీ, ఏబీబీ 16-49% మధ్య విలువను కోల్పోయాయి.
 

మరిన్ని వార్తలు