విదేశీయులకు షాకిస్తున్న భారత్

26 Jun, 2017 09:14 IST|Sakshi
దెబ్బకు దెబ్బ: వీసాల ఫీజు పెంపు
వీసా ఫీజుల పెంపు, కఠినతరమైన నిబంధనల విషయంలో భారత్ సైతం ప్రపంచదేశాలకు అదేస్థాయిలో దీటుగా బదులివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు దెబ్బకు దెబ్బ సమాధానం కూడా ఇస్తోంది. భారత్ ను సందర్శించే విదేశీయులకు వివిధ కేటగిరీల్లో వీసా పీజులను 50 శాతం వరకు పెంచింది. తాత్కాలిక ఉద్యోగ విధులపై వచ్చే వారిపై కూడా ఈ ఫీజు పెంపును ప్రకటించింది. ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ వంటి దేశాలు ఇటీవల వీసాల విషయంలో కఠినతరమైన నిబంధనలు తీసుకొస్తూ భారతీయులకు షాకిస్తున్నాయి. వారికి దీటైన సమాధానం ఇవ్వడానికే భారత్ సైతం వీసా ఫీజులను పెంచేసింది. అమెరికా, కెనడా, యూకే, ఇజ్రాయిల్, ఇరాన్, యూఏఈ దేశస్తులకు వివిధ కేటగిరీల్లో భారత్ ఇప్పటికే ఫీజులు పెంచిన సంగతి తెలిసిందే.  
 
ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం ఏడాదికి వరకు ఇచ్చే పర్యాటక వీసాలకు ముందస్తు ఉన్న 100 డాలర్ల ఫీజును 153 డాలర్లకు పెంచింది. అంటే భారత కరెన్సీ లెక్కల ప్రకారం 6450 రూపాయల నుంచి 9868 రూపాయలకు పెరిగింది. ఏడాదికి పైగా, ఐదేళ్ల వరకు ఇచ్చే వీసాలపై కూడా 120 డాలర్లుగా ఉన్న ఫీజును 306 డాలర్లకు పెంచేసింది. అంటే ప్రస్తుతం ఈ వీసాలకు 19736 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ వీసా పెంపులో కూడా ప్రభుత్వం కొన్ని మినహాయింపులు ఇచ్చింది. యూకే దేశస్తులకు మాత్రమే ఏడాదిపాటు ఇచ్చే పర్యాటక వీసాలకు ప్రస్తుతమున్న 162 డాలర్లను 248 డాలర్లకు మాత్రమే పెంచుతున్నట్టు తెలిపింది. ఐదేళ్లకు ఇచ్చే వీసాలకు కూడా 484 డాలర్ల నుంచి 741 డాలర్లకు పెంచుతున్నట్టు చెప్పింది. కెనడా, ఐర్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, థాయ్ లాండ్ దేశస్తులు ఉద్యోగ వీసాలకు 300 డాలర్లకు బదులు ఇకనుంచి 459 డాలర్లు చెల్లించాలి.   
>
మరిన్ని వార్తలు