మోసపోతే ‘రిఫండ్’ రాదు!!

29 Aug, 2016 00:16 IST|Sakshi
మోసపోతే ‘రిఫండ్’ రాదు!!

ట్యాక్స్ రిఫండ్ల పేరిట ఆన్‌లైన్ మోసాలు - ఫోన్లు చేసి కూడా వివరాల తస్కరణ
సాక్షి, బిజినెస్ విభాగం : సుధీర్‌కు ఓ మెయిలొచ్చింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డెరైక్ట్ ట్యాక్సెస్ నుంచి పంపిస్తున్నట్లుగా దాన్లో ఉంది. ‘’సీబీడీటీ మొదటి త్రైమాసిక పన్ను రిఫండ్లను ప్రాసెస్ చేయటం పూర్తయింది. మీరు రూ.22,046.23 రూపాయల పన్ను అధికంగా చెల్లించారు. దాన్ని రిఫండ్‌కు సంబంధించిన ప్రాసెస్ కూడా పూర్తయిపోయింది. మీ రిఫండ్ క్లెయిమ్ చేయాలంటే ఈ కింది లింకును క్లిక్ చేయండి’’ అనేది దాని సారాంశం. సుధీర్ అప్పటికే గత ఏడాది రిటర్ను ఫైల్ చేసి... నిజంగానే ఐటీ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో నిజమేననుకుని లింకు క్లిక్ చేశాడు. వెంటనే మరో పేజీ ఓపెనయింది.

ఇన్‌కమ్‌ట్యాక్స్ ఇండియా పేరిట ఓపెననైన ఆ పేజీలో... మీ బ్యాంకును సెలక్ట్ చేయండి... అనే పేజీ ఉంది. తనది ఎస్‌బీఐ కనక ఆప్షన్ ఎంచుకుని క్లిక్ చేశాడు. వెంటనే ఎస్‌బీఐ ఇంటర్నెట్ బ్యాంక్ హోమ్‌పేజీ ఓపెనైపోయింది. దాన్లో తన ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవుదామనుకుంటూనే... ఒక్క క్షణం ఆలోచించాడు. ‘‘రిఫండ్ రావాలంటే నేను నా ఇంటర్నెట్ బ్యాంకులో ఎందుకు లాగిన్ అవ్వాలి?’’ అని. ఆ ఆలోచనే సుధీర్‌ను కాపాడింది. అందులో గనక లాగిన్ అయి ఉంటే... సుధీర్ వివరాలన్నీ మోసగాళ్లకు చేరి... తన అకౌంట్ ఒక్క నిమిషంలో ఖాళీ అయిపోయేది. ఎందుకంటే ఆ పేజీ అచ్చం ఎస్‌బీఐ ఇంటర్నెట్ పేజీలానే ఉన్నా... అది మోసగాళ్లు పంపిన ఫిషింగ్ పేజీ.

మోసగాళ్లు ఎంతకు తెగబడుతున్నారనేందుకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఎందుకంటే ఇది రిఫండ్ల సీజన్. ఉద్యోగులంతా ఐటీ రిటర్నులు వేసే ఉంటారు. ఎంతో కొంత రిఫండ్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే ఈ రిఫండ్ల మోసాన్ని ఎంచుకున్నారు మాయగాళ్లు. అంతేకాదు!! ఇపుడు ఫోన్లు చేసి కూడా... మీకు రిఫండ్ రావాల్సి ఉంది... మీరు గనక ఎస్‌బీఐ కస్టమర్ అయితే 1 నొక్కండి. ఐసీఐసీఐ కస్టమర్ అయితే 2 నొక్కండి అంటూ ఐవీఆర్‌ఎస్ ద్వారా వినిపిస్తున్నారు. అలా నొక్కుతూ పోతే... మన వివరాలన్నీ మోసగాళ్ల చేతుల్లోకి వెళతాయన్న మాట.

ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండని చెప్పేదే ఈ కథనం. ఇన్‌కమ్ ట్యాక్స్ రిఫండ్ల విషయంలో ఒక్కటి గుర్తుంచుకోండి. మీరు మీ రిటర్ను వేసేటపుడే రిఫండ్ క్లెయిమ్ చేసి ఉంటారు. ఆ రిఫండ్ నేరుగా మీరిచ్చిన బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. ఒకవేళ ఖాతా ఇవ్వకుంటే... మీ చిరునామాకు చెక్కు వస్తుంది. అంతేతప్ప మళ్లీ మీరు ఆన్‌లైన్లో క్లెయిమ్ చెయ్యాల్సిన అవసరం ఉండదు. జాగ్రత్త మరి!!

మరిన్ని వార్తలు