రికార్డ్ స్థాయికి ఫారెక్స్ నిల్వలు

24 Jan, 2015 00:41 IST|Sakshi
రికార్డ్ స్థాయికి ఫారెక్స్ నిల్వలు

ముంబై: భారత్ విదేశీ మారక ద్రవ్య(ఫారెక్స్) నిల్వలు దాదాపు నాలుగేళ్ల తర్వాత రికార్డ్ స్థాయికి చేరాయి. ఈ నెల 16తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 32,213 కోట్ల డాలర్లకు పెరిగాయని ఆర్‌బీఐ గణాంకాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీ పతనం వల్ల దిగుమతుల బిల్లు తగ్గడం, మరోవైపు విదేశీ నిధుల ప్రవాహం జోరుగా ఉండడం, ఎగుమతిదారులు డాలర్లను విక్రయించడం, ఆర్‌బీఐ డాలర్లను కొనుగోలు చేయడం... ఈ కారణాల వల్ల మన విదేశీ మారక ద్రవ్య నిల్వలు రికార్డ్ స్థాయికి చేరాయని ఫస్ట్‌ర్యాండ్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ హరిహర్ కృష్ణమూర్తి వివరించారు.

ఈ నెల 16తో ముగిసిన వారానికి ఈ నిల్వలు 266 కోట్ల డాలర్లు పెరిగాయని ఆర్‌బీఐ పేర్కొంది. 2011, సెప్టెంబర్2తో ముగిసిన వారానికి విదేశీ మారక ద్య్ర నిల్వలు తొలిసారిగా 32,000 కోట్ల డాలర్ల మార్క్‌ను అధిగమించాయి. ఈ నెలలో ఇప్పటివరకూ భారత మార్కట్లలో విదేశీ ఇన్వెస్టర్లు 344 కోట్ల డాలర్ల నిధులు కుమ్మరించారు.  ఈసీబీ ప్యాకేజీ కారణంగా 2,500 కోట్ల డాలర్ల విదేశీ నిధులు భారత్‌లోకి వస్తాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా-మెరిల్ లించ్ శుక్రవారం ఒక నివేదికలో పేర్కొంది.
 

>
మరిన్ని వార్తలు