ప్రధానికి లేఖ రాసిన కింగ్‌ఫిషర్‌ స్టాఫ్‌

20 Jun, 2018 20:03 IST|Sakshi
వేతనాల కోసం కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగుల పోరాటం

న్యూఢిల్లీ : గత ఆరు ఏళ్ల క్రితం అంటే 2012లో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తన దుకాణం మూసివేసింది. ఈ కంపెనీ ఉద్యోగులు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు. కానీ తాజాగా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తమకు చెల్లించాల్సి ఉన్న బకాయిలను ఇప్పించండి అంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మాల్యాకు వ్యతిరేకంగా తాజాగా ఛార్జ్‌షీటు నమోదు చేసిన వెంటనే కంపెనీ మాజీ ఉద్యోగులు తమ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్‌ చేశారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ 2012లో మూత పడింది. 

బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేసి, విదేశాలకు పారిపోయిన విజయ్‌మాల్యా, తమ వేతనం కానీ, గ్రాట్యుటీ, పరిహారాలు కానీ ఏమీ చెల్లించలేదని ప్రధానికి రాసిన లేఖలో ఉద్యోగులు పేర్కొన్నారు. లండన్‌, ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులకు మాత్రం మాల్యా అన్ని రకాల పేమెంట్లు జరిపారని తెలిపారు. లిక్విడేషన్‌ ప్రాసెస్‌తో తమ పీఎఫ్‌ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకోవడానికి కుదరడం లేదన్నారు. మాల్యా చేతుల్లో తాము రక్తం చిమ్మించి చేసిన పని ఉందని, అతన్ని వెనక్కి తీసుకొచ్చి, కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. మనీ లాండరింగ్‌ కేసులో మాల్యాకు వ్యతిరేకంగా ఈడీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన ఒక్క రోజు అనంతరమే కింగ్‌ఫిషర్‌ మాజీ ఉద్యోగులు ప్రధానికి లేఖ రాశారు.
 

మరిన్ని వార్తలు