మరింత పెరిగిన ఫోర్టిస్‌ నష్టాలు

27 Jun, 2018 23:48 IST|Sakshi

రూ.38 కోట్ల నుంచి రూ.914 కోట్లకు నష్టాలు  

సింగ్‌ సోదరులు పొందిన రూ. 500 కోట్లు కక్కిస్తాం

ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వెల్లడి  

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ నికర నష్టాలు మరింతగా పెరిగాయి. 2016–17 ఆర్థి క సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో రూ.38 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలంలో  రూ.914 కోట్లకు పెరిగాయని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తెలిపింది. వివిధ సమస్యలు కొనసాగుతుండటం, వివిధ పద్దుల కింద రూ.580 కోట్ల మేర కేటాయింపులు జరపడం, ఇంపెయిర్‌మెంట్స్‌ కారణంగా నష్టాలు పెరిగాయని  ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్‌ రవి రాజగోపాల్‌ చెప్పారు.

మొత్తం ఆదాయం రూ.1,123 కోట్ల నుంచి రూ.1,086 కోట్లకు తగ్గిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2016–17లో రూ.479 కోట్లుగా ఉన్న నికర నష్టాలు గత ఆర్థిక  సంవత్సరంలో రూ.934 కోట్లకు పెరిగాయని, ఆదాయం రూ.4,574 కోట్ల నుంచి రూ.4,561 కోట్లకు తగ్గింది.   ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ షేర్‌ 0.9 శాతం లాభంతో రూ.136 వద్ద ముగిసింది.  

ఆ రూ. 500 కోట్లు రికవరీ చేస్తాం
కంపెనీ ప్రమోటర్లు మల్వీందర్‌ సింగ్, శివిందర్‌ సింగ్‌లు కంపెనీ నుంచి అక్రమంగా తరలించిన రూ.500 కోట్ల రికవరీ కోసం చట్ట ప్రకారం చర్యలు ప్రారంభించామని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ తెలిపింది. డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం లేకుండా, ష్యూరిటీలు లేకుండా ఈ మొత్తాన్ని సింగ్‌ సోదరులకు రుణాలుగా కంపెనీ ఇచ్చింది. దీన్ని రికవరీ చేస్తామని ఫోర్టిస్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు