సింగ్‌ సోదరులను అరెస్ట్‌ చేయండి 

26 Feb, 2019 00:34 IST|Sakshi

మాజీ ప్రమోటర్లపై సెబీకి ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ వినతి 

రూ. 472 కోట్ల రికవరీ కోసం  చర్యలకు విజ్ఞప్తి 

న్యూఢిల్లీ: ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ మాజీ ప్రమోటర్లయిన మల్వీందర్‌ సింగ్, శివీందర్‌ సింగ్‌ సమస్యలు వెన్నాడుతూనే ఉన్నాయి. మోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగ్‌ సోదరులిద్దరు నిర్ణీత గడువులోగా రూ. 472 కోట్లు చెల్లించడంలో విఫలమైన నేపథ్యంలో వారి అరెస్టుకు చర్యలు తీసుకోవాలని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ సంస్థ కోరింది. చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని, అలాగే ఈ విషయంలో వ్యక్తిగతంగా తమ వాదనలు వినిపించేందుకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేసింది. సెబీ చట్టంలోని సెక్ష న్‌ 28ఎ ని ప్రయోగించడం ద్వారా  సింగ్‌ సోదరులతో పాటు ఆర్‌హెచ్‌సీ హోల్డింగ్స్, శివి హోల్డింగ్స్, మాలవ్‌ హోల్డింగ్స్, రెలిగేర్‌ ఫిన్‌వెస్ట్, బెస్ట్‌ హెల్త్‌కేర్, ఫెర్న్‌ హెల్త్‌కేర్, మోడ్‌ల్యాండ్‌ వేర్స్‌ నుంచి నిధులను రికవర్‌ చేయాలని కోరింది. ‘గతేడాది అక్టోబర్, డిసెంబర్‌లలో సెబీ ఆదేశాల మేరకు డబ్బు రికవరీ కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. తొమ్మిది పార్టీలకు నోటీసులు పంపించాం. సింగ్‌ సోదరుల అవకతవకలపై లూథ్రా అండ్‌ లూథ్రా లా ఏజెన్సీ నివేదిక ప్రాతిపదికగా డబ్బును రాబట్టుకునేందుకు, వాటాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు నియంత్రణ సంస్థలను ఆశ్రయిస్తున్నాం. ఇప్పటికే సెబీ, సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఆఫీస్‌ (ఎస్‌ఎఫ్‌ఐస్‌కు దరఖాస్తు చేసుకోవడంతో పాటు నివేదిక కాపీలు కూడా ఇచ్చాం. ఫెర్న్, మోడ్‌ల్యాండ్, బెస్ట్‌ సంస్థలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించాం‘ అని ఫోర్టిస్‌ హెల్త్‌కేర్‌ చైర్మన్‌ రవి రాజగోపాల్‌ తెలిపారు. ఫోర్టిస్‌ నుంచి మోసపూరితంగా నిధులు మళ్లించారని సింగ్‌ సోదరులు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తాన్ని వడ్డీతో పాటు మూడు నెలల్లోగా తిరిగి చెల్లించాలంటూ సింగ్‌ సోదరులను అక్టోబర్‌లో సెబీ ఆదేశించింది.
 
సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం ..  
సెక్షన్‌ 28ఎ అంశంపై శివీందర్‌ సింగ్‌ స్పందించారు. ఫోర్టిస్‌ సొంతంగా జరిపిన విచారణ నివేదిక కాపీలు తనకి ఇంత వరకూ అందజేయలేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో తన వాదన వినిపించే అవకాశాలు లేకుండా సెక్షన్‌ 28ఎ ని ప్రయోగించడమనేది అసమంజసమని, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం అవుతుందని ఆయన పేర్కొన్నారు. ‘2015 సెప్టెంబర్‌లో ఫోర్టిస్‌లోని అన్ని ఎగ్జిక్యూటివ్‌ బాధ్యతల నుంచి నేను తప్పుకున్నాను. అప్పట్నుంచీ మిగతా నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుల హోదాతోనే ఉన్నాను. వివాదాస్పద లావాదేవీల గురించి మిగతా బోర్డు సభ్యుల్లాగానే నాక్కూడా ఎటువంటి సమాచారం లేదు‘ అని ఒక ప్రకటనలో చెప్పారు. ఈ విషయం ఫోర్టిస్‌కు కూడా తెలుసని, మిగతావారు తీసుకున్న నిర్ణయాలకు తనను బాధ్యుణ్ని చేయడం సరికాదని శివీందర్‌ సింగ్‌ చెప్పారు. 

మరిన్ని వార్తలు