టెక్నో పెయింట్స్‌ మరో తయారీ కేంద్రం

5 Jun, 2019 09:06 IST|Sakshi
అవార్డు అందుకుంటున్న ఆకూరి శ్రీనివాస రెడ్డి

రూ.2.5 కోట్లతో ఆర్‌అండ్‌డీ సెంటర్‌ కూడా..

హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో; 10న ఆరంభం

త్వరలో మార్కెట్లోకి గ్రానైట్, మార్బుల్‌ పెయింట్స్‌  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పెయింట్స్‌ రంగంలోని హైదరాబాదీ కంపెనీ ఫార్చూన్‌ పెయింట్స్‌ (టెక్నో పెయింట్స్‌) మరో తయారీ కేంద్రాన్ని ప్రారంభించనుంది. రూ.2.5 కోట్ల పెట్టుబడితో ప్లాంట్, ఆర్‌ అండ్‌ డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఫార్చూన్‌ గ్రూప్‌ ఎండీ ఆకూరి శ్రీనివాస రెడ్డి చెప్పారు. కూకట్‌పల్లి ప్రశాంత్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఈ నెల 10న ప్రారంభిస్తామని, ఇందులో 50 మంది ఉద్యోగులుంటారని తెలియజేశారు. ఏపీఎస్‌ రీసెర్చ్‌ అండ్‌ మీడియా ఇంటర్నేషనల్‌ సంస్థ 2019వ సంవత్సరానికి ఫార్చూన్‌ పెయింట్స్‌కు ప్రొడక్ట్‌ అండ్‌ సర్వీసెస్‌ విభాగంలో క్వాలిటీ మ్యానుఫాక్చరింగ్‌ అవార్డు ఇచ్చిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు.

20 వేల మెట్రిక్‌ టన్నులు..
ప్రస్తుతం సంస్థకు హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీలో రెండు, గుంటూరులోని నడికుడిలో మరో తయారీ కేంద్రం ఉన్నాయి. వీటి వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 20 వేల మెట్రిక్‌ టన్నులు. ‘‘ఇప్పటివరకు రూ.25 కోట్ల పెట్టుబడులు పెట్టాం. ఆస్ట్రేలియా, యూరప్‌ వంటి దేశాల నుంచి ముడి సరుకులను దిగుమతి చేసుకొని, పెయింట్స్, సొల్యూషన్స్‌ను తయారు చేస్తున్నాం. ప్రస్తుతం గ్రానైట్‌ టెక్స్చర్, మార్బుల్‌ ఫినిష్‌ పెయింటింగ్‌ల మీద పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిని మార్కెట్లోకి ప్రవేశపెడతాం’’ అని శ్రీనివాసరెడ్డి చెప్పారు.

రూ.100 కోట్ల టర్నోవర్‌..: ఫార్చూన్‌ గ్రూప్‌నకు ఫార్చూన్‌ పెయింట్స్, ఫినెట్రీ యూపీవీసీ, ఏఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్, టెక్నో ట్రేడర్స్‌ కంపెనీలున్నాయి. తమ గ్రూప్‌ గత ఆర్థిక సంవత్సరంలో రూ.100 కోట్ల టర్నోవర్‌ నమోదు చేసిందని, దీన్లో పెయింట్ల విభాగానిది రూ.70 కోట్లని శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ‘‘మా ఆదాయంలో 40 శాతం వాటా దక్షిణాది రాష్ట్రాల నుంచే ఉంటుంది. గత ఐదేళ్ల నుంచి 50 శాతం వృద్ధిని నమోదు చేస్తున్నాం. ఇప్పటివరకు 600కు పైగా ప్రాజెక్ట్‌లకు పెయింటింగ్‌ను పూర్తి చేశాం. మై హోమ్, అపర్ణా, శోభ, పూర్వాంకర వంటి ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలన్నీ మా క్లయింట్లే. ఇటీవలే అమరావతిలో కార్యాలయాన్ని ప్రారంభించాం’’ అని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

మరిన్ని వార్తలు