వేలానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులు

21 Feb, 2016 07:46 IST|Sakshi
వేలానికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఆస్తులు

ఏఆర్‌సీలతో చర్చిస్తున్న నాలుగు బ్యాంకులు
 న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన రుణాల్లో కొంతైనా రాబట్టుకునేందుకు.. ఆ సంస్థ ఆస్తులను అసెట్ రీకన్‌స్ట్రక్షన్ కంపెనీలకు (ఏఆర్‌సీ) వేలం వేసేందుకు దాదాపు నాలుగు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. మూడు-నాలుగు బ్యాంకులు ఇందుకోసం ఏఆర్‌సీలతో చర్చలు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ సారథ్యంలోని 17 బ్యాంకుల కన్సార్షియం.. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఇచ్చిన దాదాపు రూ. 6,963 కోట్లు పైగా రుణాలను రాబట్టుకునేందుకు తంటాలు పడుతున్న సంగతి తెలిసిందే.

ఎయిర్‌లైన్స్‌తో పాటు దాని ప్రమోటరు విజయ్ మాల్యా, యునెటైడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను ఉద్దేశపూర్వక ఎగవేతదారులుగా (విల్‌ఫుల్ డిఫాల్టర్లు) ఎస్‌బీఐ, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు ఇప్పటికే ప్రకటించాయి. రికవరీ ప్రక్రియలో భాగంగా ముంబైలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను వచ్చే నెల వేలం వేయాలని ఎస్‌బీఐ కన్సార్షియం నిర్ణయించింది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన అధికారాలున్న ఎస్‌బీఐ క్యాప్ ట్రస్టీ కంపెనీ .. ఈ-వేలాన్ని మార్చి 17న నిర్వహించనుంది. దీనికి రిజర్వు ధరను రూ. 150 కోట్లుగా నిర్ణయించింది. కన్సార్షియంలో అత్యధికంగా రూ. 1,600 కోట్ల మొత్తాన్ని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కి ఎస్‌బీఐ ఇచ్చింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంకులు చెరో రూ. 800 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 650 కోట్లు ఇచ్చాయి.

మరిన్ని వార్తలు