కరోనా కాటు: ఎఫ్‌పీఐల పెట్టుబడులు వెనక్కి

20 May, 2020 13:51 IST|Sakshi

దేశీ మార్కెట్ల నుంచి 16 బిలియన్‌ డాలర్లు 

ఆసియా దేశాల నుంచి 26 బిలియన్‌ డాలర్లు

మాంద్యంబారిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు 

క్యూ1లో యూఎస్‌, యూరోజోన్‌ జీడీపీల క్షీణత 

విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఆసియా దేశాల నుంచి ఇటీవల 26 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఉపసంహరించినట్లు కాంగ్రెషనల్‌ నివేదిక తాజాగా అంచనా వేసింది. ఈ బాటలో దేశీ కేపిటల్‌ మార్కెట్ల నుంచి 16 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మాంద్య పరిస్థితులు తలెత్తనున్న అంచనాలు దీనికి కారణమైనట్లు స్వతంత్ర కాంగ్రెషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌(సీఆర్‌ఎస్‌) పేర్కొంది. కోవిడ్‌-19 గ్లోబల్‌ ఆర్ధిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావంపై రూపొందించిన తాజా నివేదిక వివరాలను స్వతంత్ర సీఆర్‌ఎస్‌  వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం...

మాంద్యంలో
జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే, స్పెయిన్‌, ఇటలీలలో 3 కోట్ల మంది ప్రజలు ప్రభుత్వ సహాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది(2020) తొలి త్రైమాసికం(జవనరి-మార్చి)లో యూరోజోన్‌ ఆర్థిక వ్యవస్థ 3.8 శాతం క్షీణించినట్లు గణాంకాలు వెలువడ్డాయి. 1995 తదుపరి ఒక త్రైమాసికంలో ఇది అత్యధిక క్షీణతకాగా.. క్యూ1లో యూఎస్‌ జీడీపీ 4.8 శాతం వెనకడుగు వేసింది. 2008లో తలెత్తిన ఆర్థిక సంక్షోభం తరువాత మళ్లీ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్య పరిస్థితులను ఎదుర్కొంటోంది. దీంతో ప్రభుత్వాలు, కేంద్ర బ్యాంకులు ఆర్థిక వ్యవస్థకు దన్నునివ్వడంతోపాటు.. క్రెడిట్‌ మార్కెట్లకు మద్దతుగా పలు సహాయక చర్యలు చేపట్టవలసి వచ్చింది. అంతేకాకుండా ప్రజల ప్రాణ పరిరక్షణకు వ్యాక్సిన్ల అభివృద్ధి తదితర కార్యకలాపాలపై దృష్టిసారించాయి.

మూడు దేశాలు మినహా
కోవిడ్‌-19 కారణంగా చైనా, ఇండియా, ఇండొనేసియా ఆర్థిక వ్యవస్థలు మాత్రమే 2020లో అతితక్కువగా ప్రభావితం కావచ్చు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలు కలిగిన మిగిలిన దేశాల జీడీపీలు నీరసిస్తున్నాయి. కోవిడ్‌-19 సవాళ్లను ఎదుర్కొనేందుకు వివిధ దేశాలు విభిన్న పాలసీలను అమలు చేస్తున్నాయి. దీంతో అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. భాగస్వామ్యాలు, భవిష్యత్‌పట్ల సందేహాలు వంటివి ఎదురవుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి, లాక్‌డవున్‌ అమలు, బిజినెస్‌ల మూసివేత వంటి ప్రతికూలతల కారణంగా గ్లోబల్‌ ఎకానమీ ఊహించినదానికంటే అధికంగా బలహీనపడవచ్చని ఇటీవల ఐఎంఎఫ్‌ అంచనా వేసింది. ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లమంది పిల్లల చదువులు అనిశ్చితిలోపడగా.. విమానయాన రంగం 2020లో 113 బిలియన్‌ డాలర్లను కోల్పోనున్నట్లు అంచనా.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా