భారత మార్కెట్‌లో మారిన ఎఫ్‌పీఐల ప్రాధాన్యతలు

25 Jun, 2020 15:10 IST|Sakshi

టెలికాం, అటో, మీడియా రంగాల్లో కొనుగోళ్లు

బ్యాంకింగ్‌, రియల్‌ ఎస్టేట్‌ టెక్స్‌టైల్స్‌ రంగాల్లో విక్రయాలు 

ఈ జూన్‌లో ఇప్పటివరకు రూ.19,970 కోట్ల పెట్టుబడులు

విదేశీ ఇన్వెసర్లు భారత స్టాక్‌ మార్కెట్లో మే-జూన్‌ మధ్యకాలంలో రూ.35వేల కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఒక్క మే నెలలో రూ.14,569 కోట్ల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేయగా, ఈ జూన్‌లో ఇప్పటి వరకు రూ.19,970 కోట్ల పెట్టుబడులు పెట్టారు.  ఈ నేపథ్యంలో మార్కెట్‌లో ఎఫ్‌పీఐల ప్రాధాన్యతలు మారాయి. 

ఈ రంగాల షేర్లను కొన్నారు
టెలికాం, అటో, కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌, మీడియా రంగాల షేర్లలో అధికంగా కొనుగోళ్లు జరిపారు. అలాగే ఆహార, బేవరీజెస్‌ అండ్‌ టోబాకో, ట్రాన్స్‌పోర్టేషన్‌, హోటల్స్‌, రిస్టారెంట్స్‌ అండ్‌ టూరిజం, ఫార్మా అండ్‌ బయోటెక్నాలజీ, ఇన్సూరెన్స్‌, ఎయిర్‌లైన్స్‌ రంగాలకు చెందిన షేర్లలో పెట్టుబడులను 1శాతం వరకు పెంచుకున్నారు.

 టెలికాం రంగానికి సంబంధించి విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో మే 31నాటికి రూ.89,120 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. అంతకు ముందు ఏప్రిల్‌లో ఇదే రంగానికి చెందిన రూ.75,452 కోట్ల ఈక్విటీ షేర్లతో పోలిస్తే ఇది 18.11శాతం అధికం. కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ రంగానికి చెందిన షేర్లను 9శాతం పెంచుకున్నారు. అటో, అటో విడిభాగాల కంపెనీలకు చెందిన షేర్లను 6.4శాతానికి పెంచుకున్నారు. 

ఈ రంగాల షేర్లను విక్రయించారు
ఇదే సమయంలో వారు బ్యాంకింగ్‌, రోడ్లు, హైవేలు, నౌకాయాన రంగాల షేర్లను విక్రయించారు. టెక్స్‌టైల్స్‌, యూటిలిటీ, కన్జూ‍్యమర్‌ డ్యూరబుల్స్‌, రియల్‌ ఎస్టేట్‌, కెమికల్స్‌ రంగాలకు చెందిన షేర్లలో వాటాలను తగ్గించుకున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగ షేర్లను అధికంగా విక్రయించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

బ్యాంకింగ్‌ రంగానికి సంబంధించి విదేశీ ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో మే 31నాటికి రూ.4,15,061 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నారు. అంతకు ముందు ఏప్రిల్‌లో ఇదే రంగానికి చెందిన రూ.4,65,367 కోట్ల ఈక్విటీ షేర్లతో పోలిస్తే ఇది 10.81 శాతం తక్కువ. 

మన మార్కెట్లోనే కొనుగోళ్లు ఎందుకు..?
భారీ పతనం తర్వాత, ప్రస్తుతం భారత స్టాక్‌ వాల్యూయేషన్లు లాంగ్‌ టర్మ్‌ యావరేజ్‌ల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల విలువలతో పోలిస్తే మరింత తక్కువగా ఉన్నాయి. బహుశా ఈ కారణమే ఎఫ్‌పీఐలకు ఇండియా ఈక్విటీ మార్కెట్ల వైపు నడిపించి ఉండవచ్చు. మార్చి ఏప్రిల్‌లో ఎఫ్‌పీఐలు విక్రయించిన షేర్లలో సగానికి పైగా షేర్లను తిరిగి కొనుగోలు చేశారు. సమీప కాలంలో, లిక్విడిటీ అధికంగా ఉండే రంగాల్లో కొనుగోళ్లు జరపవచ్చు అని నిర్మల్‌ బంగ్‌ ఈక్విటాస్‌ రీసెర్చ్‌ సంస్థ తెలిపింది. 

మరిన్ని వార్తలు