ఇన్వెస్టర్ల సొమ్ము పూర్తిగా చెల్లిస్తాం

28 Apr, 2020 03:48 IST|Sakshi

ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ హామీ

న్యూఢిల్లీ: సాధ్యమైనంత త్వరగా ఇన్వెస్టర్ల సొమ్మును పూర్తిగా చెల్లిస్తామని ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తెలిపింది. స్కీములను  మూసివేసినంత మాత్రాన పెట్టుబడులు పోయినట్లుగా భావించరాదని పేర్కొంది. ‘స్కీముల్లో పెట్టుబడులు పెట్టిన వారందరికీ సాధ్యమైనంత త్వరగా చెల్లింపులు జరిపేందుకు, మా బ్రాండ్‌పై విశ్వసనీయతను నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉన్నాం‘ అని ఇన్వెస్టర్లకు రాసిన నోట్‌లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఏఎంసీ(ఇండియా) ప్రెసిడెంట్‌ సంజయ్‌ సప్రే తెలిపారు.

కరోనా వైరస్‌పరమైన సంక్షోభం కారణంగా రిడెంప్షన్‌ ఒత్తిళ్లు పెరిగిపోయి, బాండ్‌ మార్కెట్లలో లిక్విడిటీ పడిపోవడంతో ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ ఆరు డెట్‌ స్కీములను మూసివేసిన సంగతి తెలిసిందే. వీటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ. 25,000 కోట్లు ఉంటుంది. మూసివేత నిర్ణయం చాలా కష్టతరమైనదని, కానీ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తప్పలేదని సప్రే తెలిపారు. ట్రిపుల్‌ ఎ రేటింగ్‌ నుంచి ఎ రేటింగ్‌ దాకా ఉన్న బాండ్లలో తాము ఇన్వెస్ట్‌ చేశామని .. ఈ వ్యూహం ఇటీవలి దాకా మంచి ఫలితాలనే ఇచ్చిందని పేర్కొన్నారు.

ఫండ్‌ను ప్రభుత్వం టేకోవర్‌ చేయాలి: బ్రోకింగ్‌ సంస్థల డిమాండ్‌
‘ఫ్రాంక్లిన్‌’ ఉదంతంలో ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం, మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రోకింగ్‌ సంస్థల సమాఖ్య ఏఎన్‌ఎంఐ పేర్కొంది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మేనేజ్‌మెంట్‌ను టేకోవర్‌ చేసేందుకు, పెట్టుబడుల తీరును సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖకు ఏప్రిల్‌ 26న ఏఎన్‌ఎంఐ ఈ మేరకు లేఖ రాసింది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్ట్‌ చేయడంతో పాటు అంతగా రేటింగ్‌ లేనివి, ఊరూ పేరూ లేని పలు సంస్థల్లో టెంపుల్టన్‌ ఫండ్‌ పెట్టుబడులు పెట్టడం సందేహాలు రేకెత్తిస్తోందని పేర్కొంది.

మరిన్ని వార్తలు