ఉబెర్‌ రైడర్లకు ఉచిత ప్రమాద బీమా

26 Sep, 2019 11:43 IST|Sakshi

రూ.5 లక్షల వరకు పరిహారం

న్యూఢిల్లీ: ప్రముఖ ట్యాక్సీ అగ్రిగేటర్‌ ఉబెర్‌ రైడర్లకు ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని తీసుకొచ్చింది. ట్యాక్సీలు, ఆటోలు, మోటారు సైకిళ్లపై ప్రయాణించే సమయంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం బారిన పడితే ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని అందించనున్నట్టు బుధవారం ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన లేక వైకల్యం పాలైతే రూ.5లక్షల పరిహారం, ఆస్పత్రి పాలైతే రూ.2లక్షల వరకు పరిహారం (ఇందులో రూ.50,000 వరకు అవుట్‌ పేషెంట్‌ ప్రయోజనం కూడా ఉంటుంది) లభిస్తుందని తెలిపింది. ఇందుకోసం భారతీ ఆక్సా లైఫ్‌ ఇన్సూరెన్స్, టాటా ఏఐఏ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రమాదాలు చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, రైడర్లకు రక్షణ ఉంటుందన్న భరోసానివ్వడమే ఈ ఆఫర్‌ ఉద్దేశ్యంగా పేర్కొన్నారు. ఓలా సైతం బీమా ఆఫర్‌ను తన రైడర్లకు రూ.2కు ఆఫర్‌ చేస్తోంది. 

ఓలా.. ‘రెలిగేర్‌’ వైద్యబీమా...
రెలిగేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ భాగస్వామ్యంతో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నట్టు ఓలా ప్రకటించింది. రిజిస్టర్‌ యూజర్లు అందరూ ఈ పాలసీకి అర్హులేనని, యాప్‌ నుంచి దీన్ని తీసుకోవచ్చని తెలిపింది. ప్రీమియం రోజుకు కనీసం రూ.3 నుంచి ప్రారంభమవుతుందని పేర్కొంది. వ్యక్తులు విడిగా, తమ కుటుంబం మొత్తానికి కలిపి పాలసీని తీసుకోవచ్చని, నెలకు, సంత్సరం కాల వ్యవధికి తీసుకునే సదుపాయం కూడా ఉన్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు