రోజుకు రూ. 46 వేల సంపాదన!!

13 Aug, 2016 08:14 IST|Sakshi
రోజుకు రూ. 46 వేల సంపాదన!!

ఉద్యోగాలు చేసుకుంటే ఏమొస్తుంది.. హాయిగా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే మేలు కదా అంటున్నారు చాలామంది. బుద్ధి పుట్టినప్పుడు పని చేయొచ్చు.. లేదంటే ఎక్కడికైనా వారం పదిరోజుల పాటు అలా తిరిగి రావచ్చు, ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు.. ఒకళ్ల గురించి భయపడనక్కర్లేదు.. దానికితోడు పారితోషికం కూడా జీతం కంటే బాగానే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలా ఫ్రీలాన్సింగ్ చేసుకునేవాళ్లు రోజుకు ఏకంగా రూ. 46 వేల వరకు కూడా సంపాదిస్తున్నారట. 'ఫ్లెక్సింగ్ ఇట్' అనే సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తెలిసింది. ఐదేళ్లలోపు అనుభవం ఉన్నవాళ్లయితే రోజుకు రూ. 8వేలు, 5 నుంచి 10 ఏళ్ల వరకు అనుభవం ఉన్నవాళ్లయితే రోజుకు రూ. 19వేలు, 20 ఏళ్లకుపైగా అనుభవం ఉన్నవాళ్లు రోజుకు రూ. 46 వేల వరకు ఫ్రీలాన్సింగ్‌లో సంపాదిస్తున్నారట.

ఫ్రీలాన్సింగ్‌లో అవకాశాల కోసం ఎదురుచూసే ప్రొఫెషనల్స్‌కు, వాళ్లతో పని చేయించుకోవాలని చూసే సంస్థలకు మధ్య వారధిగా 'ఫ్లెక్సింగ్ ఇట్' సంస్థ పనిచేస్తుంది. దాదాపు 2,500 మంది ప్రొఫెషనల్స్‌ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పై వివరాలను ఈ సంస్థ ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఆరు నెలల పాటు ఈ డేటా సేకరించారు. ఐదేళ్ల వరకు అనుభవం ఉన్నవారిలో ఉత్పాదక రంగం, ఆర్థిక రంగం, సేల్స్ లాంటి రంగాల్లో ఫ్రీలాన్సర్లకు అత్యధికంగా చెల్లిస్తున్నారు. 20 ఏళ్ల అనుభవం ఉన్నవారిలో ఎక్కువగా ఫైనాన్స్, జనరల్ మేనేజ్‌మెంట్, స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ లాంటి రంగాలలో ఎక్కువ చెల్లింపులు వస్తున్నాయి. ఐటీ సేవలు, ప్రొఫెషనల్ సేవలు, ఈ కామర్స్ లాంటి రంగాలలో ఫ్రీలాన్సర్లకు అవకాశాలు బాగున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు