రాణా కపూర్‌పై కొత్తగా మరో కేసు..

18 Mar, 2020 10:53 IST|Sakshi

యస్‌ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు రాణా కపూర్, ఆయన భార్యపై ఈడీ కొత్తగా మరో కేసు నమోదు చేసింది. అవంతా రియల్టీ గ్రూప్‌ సంస్థలకు యస్‌ బ్యాంక్‌ ద్వారా రూ. 1,900 కోట్ల రుణాలిచ్చినందుకు గాను .. వారు రూ. 307 కోట్ల మేర ముడుపులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఢిల్లీలో ఒక బంగ్లాను మార్కెట్‌ రేటులో సగం ధరకే దక్కించుకోవడం ద్వారా వారు లబ్ధి పొందినట్లు ఈసీఐఆర్‌లో  ఈడీ పేర్కొంది. మొండిబాకీల వసూలు విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించినందుకు గాను కొన్ని బడా కార్పొరేట్ల నుంచి కపూర్‌కు ముడుపులు ముట్టాయంటూ ఈడీ ఇప్పటికే ఒక కేసు నమోదు చేసింది. 

ఈడీ విచారణకు హాజరు కాని వాధ్వాన్‌ సోదరులు..
యస్‌ బ్యాంక్‌ ప్రమోటరు రాణా కపూర్‌పై మనీలాండరింగ్‌ కేసు విచారణకు సంబంధించి ప్రశ్నించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సమన్లు జారీ చేసినప్పటికీ.. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లయిన వాధ్వాన్‌ సోదరులు (కపిల్, ధీరజ్‌) మాత్రం హాజరు కాలేదు. దీంతో కొత్తగా సమన్లు జారీ చేయడంతో పాటు, మరో కేసులో కపిల్‌ వాధ్వాన్‌కి ఇచ్చిన బెయిల్‌ను కూడా రద్దు చేయాలంటూ కోర్టును ఈడీ కోరనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యస్‌ బ్యాంక్‌ నుంచి డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తీసుకున్న రూ. 3,700 కోట్లు ప్రస్తుతం మొండిబాకీలుగా మారాయి. కార్పొరేట్లకు యస్‌ బ్యాంకు నుంచి రుణాలిప్పించినందుకు గాను రాణా కపూర్‌ రూ. 4,300 కోట్ల మేర ముడుపులు అందుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు