ఇక మైక్రోమాక్స్‌ ఫ్రిజ్‌లు, వాషింగ్‌మెషిన్లు!

17 Oct, 2017 08:18 IST|Sakshi

రూ.300 కోట్లతో విస్తరణ ప్రణాళిక..

పూర్తిస్థాయి కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌గా..

కంపెనీ కో–ఫౌండర్‌ రాజేశ్‌ అగర్వాల్‌ వెల్లడి

న్యూఢిల్లీ: మొబైల్‌ హ్యాండ్‌సెట్స్‌ తయారీ కంపెనీ ‘మైక్రోమాక్స్‌’ పూర్తిస్థాయి కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌గా మారటానికి వాషింగ్‌ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు (ఫ్రిజ్‌లు), మైక్రోవేవ్‌ వంటి విభాగాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇందుకోసం మ్యాన్యుఫాక్చరింగ్‌పై రూ.300 కోట్లు ఇన్వెస్ట్‌ చేసి, ఈ ఆర్థిక సంవత్సరంలో టీవీ ప్యానెల్‌ మార్కెట్‌లో 8 లక్షల యూనిట్ల విక్రయాలతో 7–8 శాతం వాటాను సాధించాలని ప్రణాళికలు వేస్తోంది.

మైక్రోమాక్స్‌ గతేడాది ఏసీల విభాగంలోకి ప్రవేశించడం తెలిసిందే. ‘వచ్చే ఏడాది కాలంలో కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కేటగిరీలో 70–80 శాతం ప్రొడక్ట్‌ లైనప్‌ కలిగి ఉంటాం. ఇందులో ఏసీ, ఎయిర్‌ కూలర్స్, వాషింగ్‌ మెషీన్లు వంటివి ఉంటాయి’ అని మైక్రోమాక్స్‌ ఇన్ఫర్‌మాటిక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాజేశ్‌ అగర్వాల్‌ చెప్పారు. మైక్రోవేవ్, రిఫ్రిజిరేటర్లను రెండేళ్ల కాలంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారాయన.

సంస్థ మొత్తం ఆదాయంలో కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ విభాగం వాటా వచ్చే మూడేళ్లలో దాదాపు 40 శాతానికి చేరొచ్చని అంచనా వేశారు. రానున్న 2–3 ఏళ్లలో రూ.200–300 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తామని తెలిపారు. ‘పూర్తిస్థాయి కన్సూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ బ్రాండ్‌గా ఎదగాలనేది కంపెనీ లక్ష్యం. ఏసీ, ఎల్‌ఈడీ టీవీ కేటగిరీల్లో సముచితమైన వాటాను కలిగి ఉన్నాం. వచ్చే ఏడాది కాలంలో మార్కెట్‌లోకి మరిన్ని ప్రొడక్టులను తెస్తాం. దీంతో ఆయా విభాగాల్లో మా స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటాం. అదేసమయంలో కొత్త కేటగిరీల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాం’ అని చెప్పారాయన.

మరిన్ని వార్తలు