బ్రోకర్ల నుంచి బాలీవుడ్‌ వరకు

14 Aug, 2017 01:03 IST|Sakshi
బ్రోకర్ల నుంచి బాలీవుడ్‌ వరకు

► షెల్‌ కంపెనీల సాయంతో నల్లధన చలామణీ
► సెబీ, దర్యాప్తు సంస్థల నిఘాలో 500 సంస్థలు


న్యూఢిల్లీ: అనుమానిత షెల్‌ కంపెనీలంటూ 331 లిస్టెడ్‌ సంస్థలపై ఆంక్షలకు ఆదేశించి సంచలనం సృష్టించిన సెబీ, త్వరలో మరింత మందికి షాక్‌ ఇవ్వనుంది. బాలీవుడ్‌ రంగానికి చెందిన వారితోపాటు బ్రోకర్లు, బిల్డర్ల నల్లధన ప్రవాహానికి కొన్ని షెల్‌ కంపెనీలుగా వ్యవహరించినట్టు సమాచారం. అంతేకాదు, మరో 100కుపైగా అన్‌లిస్టెడ్‌ కంపెనీలు అక్రమ ధనంతో షేర్ల ట్రేడింగ్‌కు పాల్పడినట్టు సెబీ వర్గాలు తెలిపాయి. 331 లిస్టెడ్‌ కంపెనీలకు షోకాజు నోటీసుల జారీని సెబీ ప్రారంభించింది.

కొన్ని సంస్థలు సెబీ ఆదేశాలకు వ్యతిరేకంగా శాట్‌కు వెళ్లి స్టే తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆయా సంస్థలపై దర్యాప్తునకు శాట్‌ కూడా అడ్డుచెప్పలేదు. ప్రముఖ కంపెనీలు సైతం నల్లధన చలామణికి వాహకంగా ఉపయోపడ్డాయని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. అనుమానిత షెల్‌ కంపెనీల్లో పలువురు చిన్న బ్రోకర్లు ఉన్నారని, పెద్ద బ్రోకరేజీ సంస్థలతో వీటికున్న సంబంధాలపై సెబీ ఆరా తీస్తోందని ఆ అధికారి వెల్లడించారు.

మరోవైపు 331 కంపెనీలపై సెబీ ఆంక్షల తర్వాత స్టాక్‌ మార్కెట్లో భయానక వాతావరణం కల్పించడం వెనుక కొంత మంది బ్రోకర్ల పాత్రపైనా సెబీ పరిశీలన జరుపుతున్నట్టు ఆయన తెలిపారు. మైనారిటీ వాటాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు తీసుకున్న చర్య అదని, కానీ వీటిల్లో వాటాలున్న బ్రోకర్లు తమ వాటాలను సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారని పేర్కొన్నారు.

దర్యాప్తు సంస్థల విచారణ: సెబీ దర్యాప్తులో ఉన్న ఈ కంపెనీలపై ఆదాయపన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్, ఎస్‌ఎఫ్‌ఐవో కూడా దృష్టి సారించాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత వీటిలో కొన్ని కంపెనీలు భారీ నగదు లావాదేవీలకు పాల్పడినట్టు సైతం సెబీ అనుమానిస్తోంది. దీంతో సెబీ, ఇతర దర్యాప్తు సంస్థలు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నట్టు ఆ అధికారి తెలిపారు. నియంత్రణ, దర్యాప్తు సంస్థలు సుమారు 500 సంస్థలపై దర్యాప్తు చేస్తున్నాయని, సున్నిత అంశం దృష్ట్యా, దర్యాప్తునకు విఘాతం కలగకూడదన్న ఉద్దేశంతో కొన్నింటి పేర్లను బయటపెట్టలేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు