బెయిల్‌–ఇన్‌పై భయాలొద్దు

3 Jan, 2018 00:39 IST|Sakshi

డిపాజిటర్ల ప్రయోజనాలకు పూర్తి రక్షణ

ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లుపై ఆర్థిక శాఖ వివరణ  

న్యూఢిల్లీ: ప్రతిపాదిత ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులో వివాదాస్పదంగా ఉన్న బెయిల్‌–ఇన్‌ అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ వివరణ ఇచ్చింది. దీనిపై ఆందోళన చెందరాదని, సోషల్‌ మీడియా సహా మీడియాలో వస్తున్న వార్తలన్నీ అపోహలతో కూడుకున్నవేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం డిపాజిటర్ల ప్రయోజనాలకి ఉన్న రక్షణకు భంగం కలిగించే అంశాలేవీ ఈ బిల్లులో లేవని పేర్కొంది. పైగా మరింత పారదర్శకమైన విధానంలో ఖాతాదారుల డిపాజిట్లకు అదనపు భద్రత కల్పించేదిగా ఫైనాన్షియల్‌ రిజల్యూషన్‌ అండ్‌ డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ బిల్లు ఉంటుందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. బ్యాంకులు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పక్షంలో గట్టెక్కేందుకు... డిపాజిటర్ల సొమ్మును కూడా ఉపయోగించుకునేలా ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లులో నిబంధనలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆర్థిక శాఖ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

బెయిల్‌–ఇన్‌ అనేది ఒకానొక పరిష్కార మార్గం మాత్రమేనని, ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో దీన్ని ప్రయోగించాల్సిన పరిస్థితి దాదాపు ఉండనే ఉండదని ఆర్థిక శాఖ పేర్కొనటం గమనార్హం. బెయిల్‌–ఇన్‌ నిబంధనను ఉపయోగించుకున్న సందర్భాల్లో బీమా రక్షణ ఉన్న డిపాజిట్లను బ్యాంకులు తాకటానికి వీల్లేదని పేర్కొంది. ఇటు బీమా రక్షణ ఉన్న డిపాజిటర్లు, లేని డిపాజిటర్ల ప్రయోజనాలనూ పరిరక్షించేదిగానే ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ఉంటుందని వివరించింది. దీనిపై పార్లమెంటు సంయుక్త కమిటీ సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్నామని, వాటి సూచనలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం రూ.లక్ష దాకా డిపాజిట్లకు ఉన్న బీమా ప్రయోజనం ఇకపై కూడా కొనసాగుతూనే ఉంటుందని, అవసరమైతే దీన్ని మరింత పెంచే అంశాన్నీ పరిశీలిస్తమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అటు రాజ్యసభకి తెలిపారు.  

మరిన్ని వార్తలు