ఆర్థిక సహకారంపై చిగురించిన విశ్వాసం

28 Jun, 2017 00:55 IST|Sakshi
ఆర్థిక సహకారంపై చిగురించిన విశ్వాసం

ట్రంప్, మోదీ భేటీపై పరిశ్రమ వర్గాల సంతోషం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ప్రధాని మోదీ మధ్య జరిగిన తొలి భేటీలో ఇరు దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని పెంపొందించుకోవాలన్న నిర్ణయానికి రావడం పట్ల దేశీయ పరిశ్రమ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. రెండు దేశాల ద్వైపాక్షిక బంధంపై తిరిగి విశ్వాసం నెలకొన్నట్టు పేర్కొన్నాయి. ట్రంప్, మోదీ భేటీ అనంతరం విడుదలైన సంయుక్త ప్రకటనను అసోచామ్‌ స్వాగతించింది. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీకి సంబంధించి మార్కెట్‌ అవకాశాలను పెంపొందించుకోవాలని నిర్ణయించడం 150 బిలియన్‌ డాలర్ల భారత ఐటీ పరిశ్రమకు అత్యంత సానుకూలమని వ్యాఖ్యానించింది. పారిశ్రామిక రంగాల్లో అదనపు ఉత్పత్తి విషయమై రెండు దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని అంగీకరించడం మరో సానుకూలమైన చర్యగా అసోచామ్‌ సెక్రటరీ జనరల్‌ డీఎస్‌ రావత్‌ పేర్కొన్నారు.

నియంత్రణ పరమైన అంశాల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించుకోవడం భారత ఫార్మా పరిశ్రమకు సానుకూలమన్నారు. దేశీయ ఫార్మా కంపెనీలు యూఎస్‌ఫ్‌డీఏ నుంచి తనిఖీలు, అభ్యంతరాల పేరుతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో మోదీ సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై విశ్వాసం వ్యక్తం కావడం, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, స్వేచ్ఛా వాణిజ్య విధానాలను ముందుకు తీసుకెళ్లాలని అంగీకారం కుదరడం సంతోషకరమని ఫిక్కీ ప్రెసిడెంట్‌ పంకజ్‌ పటేల్‌ అన్నారు. రక్షణ, ఇంధన రంగాల్లో కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇరు దేశాలూ కలసి పనిచేయాలని అభిలషించారు.

మరిన్ని వార్తలు