ఐపీఓ నిధులు అంతంతే!

27 Dec, 2019 02:21 IST|Sakshi

మందగమనం ప్రభావం

ఈ ఏడాది 60 శాతం తగ్గుదల

మెరుగుపడ్డ ఓఎఫ్‌ఎస్‌; డిజిన్వెస్ట్‌మెంట్‌ డీలా

ప్రైమ్‌ డేటాబేస్‌ గణాంకాల్లో వెల్లడి

ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రంగానే ఉన్న ప్రభావం కంపెనీల ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) నిధుల సమీకరణపై పడింది. ఈ ఏడాది కంపెనీలు ఐపీఓల ద్వారా సమీకరించిన నిధులు 60 శాతం మేర తగ్గాయి. గత ఏడాది ఐపీఓల ద్వారా రూ.30,959 కోట్లుగా ఉన్న ఐపీఓల ద్వారా నిధుల సమీకరణ ఈ ఏడాది రూ.12,362 కోట్లకు తగ్గింది. గత ఏడాది 24 కంపెనీలు ఐపీఓకు రాగా, ఈ ఏడాది 16 కంపెనీలే ఐపీఓకు వచ్చాయి. ఈ వివరాలను క్యాపిటల్‌ మార్కెట్‌ గణాంకాలను అందించే ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. మరిన్ని వివరాలు....

► ఈ ఏడాది క్యూ2 జీడీపీ ఏడేళ్ల కనిష్ట స్థాయి, 4.5 శాతానికి పడిపోయింది. జీడీపీ మెరుగుపడుతున్న సూచనలు ఏమీ లేవు. రూ.51,000 కోట్ల సమీకరణ నిమిత్తం సెబీ ఆమోదం పొందిన 47 కంపెనీల ఐపీఓల గడువు తీరిపోవడం ఈ విషయాన్ని మరింత ప్రతిబింబిస్తోంది.  
► ఐపీఓ ద్వారా నిధుల సమీకరణ 60 శాతం తగ్గినా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌), క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ప్లేస్‌మెంట్‌(క్యూఐపీ)ల ద్వారా నిధుల సమీకరణ మాత్రం మెరుగ్గానే ఉంది. ఈ రెండు మార్గాల ద్వారా గత ఏడాది వివిధ కంపెనీలు రూ.63,651 కోట్లు సమీకరించాయి. ఇది ఈ ఏడాది రూ.81,174 కోట్లకు పెరిగింది. 2017తో పోల్చితే(రూ.1,60,032 కోట్లు) ఇది 49% తక్కువ.  
► ఈ ఏడాది అతి పెద్ద ఐపీఓగా స్టెర్లింగ్‌  అండ్‌ విల్సన్‌ సోలార్‌ నిలిచింది. ఈ కంపెనీ ఐపీఓ సైజు రూ.2,850 కోట్లు.  
► ఈ ఏడాది వచ్చిన మొత్తం 16 ఐపీఓల్లో ఏడు కంపెనీల ఐపీఓలకు అనూహ్యమైన స్పందన లభించింది. ఈ ఐపీఓలు 10 రెట్లకు పైగా సబ్‌స్క్రైబయ్యాయి.  
► ఐఆర్‌సీటీసీ ఐపీఓ 109 రెట్లు, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌బ్యాంక్‌ వంద రెట్లకు మించి సబ్‌స్క్రైబయ్యాయి.  
► లిస్టింగ్‌ లాభాల్లో ఈ ఏడాది ఐపీఓలు అదరగొట్టాయి.  
► ఐపీఓకు వచ్చిన కంపెనీల షేర్లు వాటి ఇష్యూ ధరల కంటే దిగువకు పడిపోవడం గత కొన్నేళ్లలో పరిపాటిగా ఉండేది. ఈ ఏడాది దీనికి భిన్నంగా ఉంది. ఈ ఏడాది ఐపీఓకు వచ్చిన కంపెనీల్లో 3 కంపెనీల షేర్లు మాత్రమే ఇష్యూ ధర కంటే దిగువకు పడిపోయాయి. మిగిలిన 13 కంపెనీల షేర్లు 21–170 శాతం రేంజ్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి.  
► ఈ ఏడాది ఐపీఓ నిధుల సమీకరణ అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రమోటర్లు బాగానే లాభపడ్డారు.  2018లో ఓఎఫ్‌ఎస్‌ ద్వారా రూ.10,672 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.25,811 కోట్లు వచ్చాయి.  
► ఈ ఏడాది ప్రభుత్వ వాటాల విక్రయం(డిజిన్వెస్ట్‌మెంట్‌)కు  కలిసిరాలేదు. డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ.1,05,000 కోట్లు సమీకరించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కానీ ఇప్పటిదాకా రూ.17,744 కోట్లు (17 శాతం మాత్రమే) సమీకరించింది.  
► వచ్చే ఏడాది ఐపీఓలు ఆశావహంగానే ఉండే అవకాశాలున్నాయి. ఇప్పటివరకూ 21 కంపెనీలు ఐపీఓల కోసం  సెబీ ఆమోదం పొందాయి. ఈ కంపెనీలు రూ.18,700 కోట్లు సమీకరించనున్నాయి. మరో 13 కంపెనీలు సెబీ ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. ఇవి రూ.18,000 కోట్ల సమీకరించడం కోసం సెబీకి దరఖాస్తు చేశాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా