ఈ ఏడాదీ ‘షేర్ల’ పండుగే!

22 Feb, 2020 02:26 IST|Sakshi

2020లో ఐపీఓల జోష్‌...

లిస్టింగ్‌ బాటలో కనీసం 30 కంపెనీలు

రూ.50,000 కోట్లకు పైగా నిధుల సమీకరణ

గత ఏడాదితో పోల్చితే నాలుగు రెట్లు అప్‌...

ఎల్‌ఐసీ ఇష్యూ కూడా ఉంటే రూ. 1.50 లక్షల కోట్లకు చేరే చాన్స్‌

సాక్షి, బిజినెస్‌ విభాగం: ఈ ఏడాది కూడా ఐపీఓ మార్కెట్‌ జోరుగా ఉండనున్నది. రూ.50,000 కోట్లకు మించి ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)లు రానున్నాయి. తాజాగా ప్రకటించిన ఎల్‌ఐసీ ఐపీఓ కూడా ఈ ఏడాదే వస్తే... నిధుల సమీకరణ  మొత్తం రూ. 1.5 లక్షల కోట్ల కు ఎగబాకే అవకాశం ఉంటుంది. ఎస్‌బీఐ కార్డ్స్, యూటీఐ ఏఎమ్‌సీ వంటి దిగ్గజ కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకు వస్తాయని, గత ఏడాది కంటే ఈ ఏడాదే ఐపీఓల జోరు బాగా ఉండగలదని నిపుణులంటున్నారు. 2019లో 16 కంపెనీలు ఐపీఓకు వచ్చాయి. రూ.12,300 కోట్ల మేర సమీకరించాయి.. ఇక ఈ ఏడాది కనీసం 20–30 కంపెనీలు ఐపీఓకు వస్తాయని, నిధుల సమీకరణ నాలుగు రెట్లకు పెరగవచ్చని విశ్లేషకులంటున్నారు.

ఐపీఓ జోరు కొనసాగుతుందా ? 
గత ఏడాది స్టాక్‌ మార్కెట్‌ రికార్డ్‌ల మీద రికార్డ్‌లు సృష్టించింది. ఐపీఓకు వచ్చిన కంపెనీలు అదరగొట్టే లాభాలనివ్వడం, ప్రతి ఐపీఓ కూడా అనేక రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌ కావడంతో ఈ ఏడాది కూడా ఐపీఓ జోరు కొనసాగుతుందన్న అంచనాలున్నాయి. ఈ ఏడాది కనీసం 40 కంపెనీల ఐపీఓలు మార్కెట్‌ను ముంచెత్తుతాయని అంచనా. అంతర్జాతీయంగా వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు ఉదార ద్రవ్య విధానాన్ని అనుసరించే అవకాశాలుండటంతో గ్లోబల్‌ లిక్విడిటీ మన మార్కెట్‌ను ముంచెత్తుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  ఐఆర్‌సీటీసీ, సీఎస్‌బీ బ్యాంక్‌ వంటి ఐపీఓలు గత ఏడాది ఊహించనంతగా విజయం కావడంతో కార్పొరేట్లలో విశ్వాసం పెరిగింది. ఇక గత ఏడాది ఐపీఓకు వచ్చిన షేర్లు ఇన్వెస్టర్లకు లిస్టింగ్‌లో  మంచి లాభాలనే ఇచ్చాయి. సగటున ఐపీఓ షేర్ల రాబడి 40 శాతానికి పైగానే ఉండటం విశేషం. ఐఆర్‌సీటీసీ, ఆఫిల్‌ ఇండియా, ఇండియామార్ట్‌ ఇంటర్‌మెష్‌ షేర్లు ఇష్యూ ధర కంటే రెట్టింపునకు పైగా పెరిగాయి.

30కి పైగా కంపెనీలు... 
ఈ ఏడాది ఇప్పటివరకూ 10 కంపెనీలకు పైగా  ఐపీఓలకు సెబీ అనుమతిచ్చింది. వీటి విలువ రూ.16,000 కోట్ల మేర ఉంది. సెబీ ఆమోదం తెలిపిన ఐపీఓల సంఖ్య గత ఏడాది 28 ఉండగా, 2018లో 72, 2,017లో 46గా ఉన్నాయి. ఇక సెబీ ఆమోదం కోసం మరో 11 కంపెనీల ఐపీఓలు  ఎదురు చూస్తున్నాయి. వీటి విలువ రూ.21,200 కోట్లమేర ఉంటుంది. సెబీ ఆమోదం పొందిన ఐపీఓల జాబితాలో ఎస్‌బీఐ కార్డ్స్‌ అండ్‌ పేమెంట్‌ సర్వీసెస్‌ (రూ.9,000 కోట్లు) మజగావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్, రూట్‌ మొబైల్‌(ఇష్యూ సైజు–రూ.600 కోట్లు), సంహి హోటల్స్‌ (రూ.2,000 కోట్లు), ఐఆర్‌ఈడీఏ(రూ.750 కోట్లు), శ్యామ్‌ స్టీల్, బజాజ్‌ ఎనర్జీ(రూ.5,450 కోట్లు), సత్యశ్రీ ప్రెజర్, అన్నై ఇన్‌ఫ్రా డెవలపర్స్, బర్గర్‌ కింగ్‌ ఇండియా(రూ.1,000 కోట్లు), పురానిక్‌ బిల్డర్స్‌(రూ.1,000 కోట్లు), ఈజీ ట్రిప్‌ ప్లానర్స్‌(రూ.510 కోట్లు), మోంటొకార్లో ఉన్నాయి.  ఈ కంపెనీలన్నీ కలిసి కనీసం రూ. 40,000–50,000 కోట్ల రేంజ్‌లో నిధులు సమీకరించనున్నాయి.

నిధుల సమీకరణ... ఐపీఓనే మేలు మార్గం 
గత ఐదేళ్లలో  రానన్ని కంపెనీలు ఈ ఏడాది ఐపీఓకు వస్తాయని శామ్‌కో సెక్యూరిటీస్‌ ఎనలిస్ట్‌ ఉమేశ్‌ మెహతా అంచనా వేస్తున్నారు. నిధుల సమీకరణ విషయంలో కూడా ఈ ఏడాది అదరగొడుతుందని పేర్కొన్నారు. భారత్‌లో మూలధనానికి కొరత తీవ్రంగా ఉందని, దీర్ఘకాలిక మూలధన నిధుల సమీకరణకు ఐపీఓ మంచి మార్గమని వివరించారు. హెచ్‌డీబీ ఫైనాన్షియల్, ఎస్‌బీఐ కార్డ్స్, బర్గర్‌ కింగ్‌ తదితర ఐపీఓకు మంచి స్పందన లభించే అవకాశాలున్నాయన్నారు.  కాగా ఇన్వెస్టర్లకు ప్రీమి యమ్‌ షేర్లు సమంజసమైన ధరలకే లభించే ఏకైక మార్గం ఐపీఓనే కావడం కంపెనీలకు కలసివచ్చే అంశం.

ఎల్‌ఐసీ మెగా ఐపీఓ..
ఎవ్వరూ ఊహించని విధంగా ఎల్‌ఐసీని స్టాక్‌మార్కెట్లో లిస్ట్‌ చేస్తామని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఈ ఐపీఓ వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఉంటుందని అంచనా. ఈ ఏడాది సెప్టెంబర్‌ తర్వాత ఐపీఓకు వస్తామని ఎల్‌ఐసీ వర్గాలు వెల్లడించాయి. ఇష్యూ సైజు, ఎంత వాటా విక్రయిస్తారు అనేదానిపై ఇప్పటివరకూ స్పష్టత లేదు. అయితే ఎల్‌ఐసీలో కనీసం 10% వాటాను ఐపీఓ ద్వారా విక్రయిస్తారనే వార్తలు వస్తున్నాయి. ఇష్యూ సైజు రూ.90,000 కోట్ల నుంచి లక్ష కోట్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. భారత్‌లో ఇప్పటివరకూ అతిపెద్ద ఐపీఓ (రూ.15,000 కోట్లు)గా కోల్‌ ఇండియా రికార్డ్‌ను ఎల్‌ఐసీ బ్రేక్‌ చేయనుంది.

ఈ ఏడాది రానున్న మరికొన్ని ఇష్యూలు  
శ్రీ భజరంగ్‌ పవర్, ఎన్‌సీడీఈఎక్స్, హిందుజా లేలాండ్‌ ఫైనాన్స్, టవర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ట్రస్ట్‌ (రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధం), హెచ్‌డీబీ ఫైనాన్షియల్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఏఎమ్‌సీ, పీఎన్‌బీ మెట్‌లైఫ్, యాక్సిస్‌ బ్యాంక్‌ ఏఎమ్‌సీ, ఆదిత్య బిర్లా ఏఎమ్‌సీ, ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్‌.

ఇష్యూ ధర కీలకం...
మార్కెట్‌ బలహీనంగా ఉంటే, ఐపీఓల జోరు తగ్గుతుందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ పతన బాటలో ఉంటే ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ దెబ్బతింటుందని, దీంతో కంపెనీలు ఐపీఓలు వాయిదా వేసే అవకాశాలు అధికంగా ఉంటాయని వారంటున్నారు. ఐపీఓ సక్సెస్‌ కావడానికి ఇష్యూ ధర కీలకమని షేర్‌ఖాన్‌  అనలిస్ట్‌ హేమంగ్‌ జని వ్యాఖ్యానించారు. మార్కెట్‌ స్థితిగతులూ కీలకమేనని, ఈ రెండూ బావుంటే గత ఏడాది కంటే అధికంగానే ఈ ఏడాది ఐపీఓలు వస్తాయని వివరించారు.

మరిన్ని వార్తలు