భవిష్యత్తు ‘ఎలక్ట్రిక్‌’ సవారీదే!

4 Jun, 2019 08:02 IST|Sakshi

టయోటా డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సేల్స్‌ అండ్‌ సర్వీస్‌) ఎన్‌. రాజా

ఈ నెల నుంచి మళ్లీ అమ్మకాలు బాగుంటాయ్‌

ఎన్నికలు, అధిక బీమా వ్యయాల వల్లే డిమాండ్‌ తగ్గింది

2050కల్లా జీరో సీఓ2 వాహనాల ఉత్పత్తే మా లక్ష్యం

2020 ఏప్రిల్‌ నుంచి బీఎస్‌–6  వాహనాల విడుదల

భారత్‌లోకి టెస్లా రాక పరిశ్రమకు మంచిదే..

ఇతర రాష్ట్రాల్లోకి ప్లాంట్‌ విస్తరణ ప్రణాళికల్లేవు

సుజుకీతో భాగస్వామ్యం ఇరు కంపెనీలకూ మేలు

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగాన్ని అధ్యయనం చేస్తున్నాం

ఆటోమొబైల్‌ రంగంలో భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్‌ వాహనాలదేనని జపాన్‌ కార్ల దిగ్గజం టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌(టీకేఎం) చెబుతోంది. భారత్‌లోనే కాక... ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్‌ ఉంటుందని సంస్థ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.రాజా అంచనా వేశారు. దేశీయంగా వాహన అమ్మకాల్లో కొనసాగుతున్న డౌన్‌ట్రెండ్‌కు ఇకపై అడ్డుకట్టపడొచ్చని... త్వరలోనే మళ్లీ విక్రయాలు పుంజుకుంటాయని చెప్పారాయన. భారత్‌లో టీకేఎం ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభించి ఈ ఏడాదితో 20 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ కీలకమైన మైలురాయిని చేరుకోవడంతో మీడియా ప్రతినిధులను బెంగళూరు సమీపంలోని బిడది వద్దనున్న ప్లాంట్‌ సందర్శనకు టీకేఎం ఆహ్వానించింది. ఈ సందర్భంగా ‘సాక్షి బిజినెస్‌ ప్రతినిధి’తో ఎన్‌.రాజా ప్రత్యేకంగా మాట్లాడారు. కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలు, పర్యావరణ పరిరక్షణకు చేస్తున్న ప్రయత్నాలు, బీఎస్‌–6 వాహనాల విషయంలో సన్నద్ధత ఇలా పలు అంశాలకు సమాధానాలిచ్చారు.ఆ వివరాలు సాక్షి పాఠకులకు ప్రత్యేకం...

బిడది(కర్ణాటక) నుంచి ఎం. శివరామకృష్ణకొద్ది నెలలుగా దేశీ ఆటోమొబైల్‌ పరిశ్రమ తీవ్రమైన కుదుపులకు గురవుతోంది. టయోటాతో పాటు ఇతరత్రా చాలా దిగ్గజ కంపెనీల అమ్మకాలు భారీగా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణాలేంటి? ఈ ధోరణి ఇంకా ఎన్నాళ్లుండొచ్చు?
డిమాండ్‌ క్షీణతకు చాలా కారణాలున్నాయి. ప్రధానంగా జీడీపీ వృద్ధి మందగమనం, అధిక బీమా వ్యయాలు, వ్యవస్థలో లిక్విడిటీ తగినంత లేకపోవడంతో పాటు సార్వత్రిక ఎన్నికల సీజన్‌ కూడా కూడా దీనికి తోడైంది. వాస్తవానికి ఎన్నికల కారణంగా వాహన కొనుగోళ్లు పెరుగుతాయనే వాదనలు నిజం కాదు. ఎందుకంటే ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు వాహనాల వినియోగాలపై పరిమితులుంటాయి. దీనివల్ల ఎన్నికల ముందు నెలల్లో అమ్మకాలపై గణనీయమైన ప్రతికూల ప్రభావం ఉంది. గత మూడు నాలుగు ఎన్నికల సందర్భంగా కూడా ఇదే ధోరణిని మేం చూశాం. ఎన్నికలు పూర్తయి కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం కొలువుదీరడంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతో పాటు వాహన పరిశ్రమకు కూడా మంచిరోజులు వస్తాయని భావిస్తున్నాం. కోడ్‌ ముగియడంతో ప్రభుత్వపరంగా కొనుగోళ్లు మళ్లీ మొదలవుతాయి. దీనికి తోడు వడ్డీరేట్లు తగ్గుముఖం పడుతుండటం కూడా కలిసొచ్చే అంశం. ఇవన్నీ చూస్తే వాహన అమ్మకాలు ఈ నెల (జూన్‌) నుంచి మళ్లీ జోరందుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కస్టమర్ల నుంచి ఎంక్వైరీలు భారీగా పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా వాహన పరిశ్రమ వృద్ధి బాటలోనే ఉంటుంది. అయితే, అమ్మకాల వృద్ధి లోయర్‌ సింగిల్‌ డిజిట్‌కే (1–5%) పరిమితం అవుతుందనేది మా అంచనా.

బీఎస్‌–6 కాలుష్య ప్రమాణాల అమలుకు గడువు దగ్గరపడుతోంది? దీనికి మీరు ఎలా సన్నద్ధమవుతున్నారు?
2020 ఏప్రిల్‌ 1 నుంచి బీఎస్‌ (భారత్‌ స్టేజ్‌)–6 ప్రమాణాలతో వాహనాలు విడుదల చేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో నెలకొన్న అనిశ్చితికి సుప్రీం కోర్టు తీర్పు తెరదించడంతో వాహన కంపెనీలన్నీ ఈ సన్నాహాల్లో తలమునకలై ఉన్నాయి. మేం కూడా ఈ డెడ్‌లైన్‌కు సిద్ధంగానే ఉన్నాం. బీఎస్‌–4 వాహనాల ఉత్పత్తిని క్రమంగా నిలిపివేసి.. వాటి స్థానంలో బీఎస్‌–6 వాహనాలను ప్రవేశపెట్టేందుకు చర్యలు చేపడుతున్నాం. మార్కెట్లో బీఎస్‌–6 ఇంధన లభ్యతకు అనుగుణంగా మేం వ్యూహాలు రూపొందించుకుంటున్నాం.

కాంపాక్ట్‌ ఎస్‌యూవీ విభాగంలో ప్రస్తుతం పోటీ పెరిగింది. భారత్‌లోని చాలా కార్ల కంపెనీలు ఈ సెగ్మెంట్‌లోకి వస్తున్నాయి. ప్రపంచ దిగ్గజం టయోటా మాత్రం ఈ రేసులో ఇప్పటిదాకా అడుగుపెట్టలేదు? ఎందుకిలా?
ప్రస్తుతం మేం ఈ మొత్తం మార్కెట్‌ను అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కేవలం భారత్‌ మార్కెట్‌ కోసమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తుల విడుదలపైనే టయోటా ఎప్పుడూ దృష్టిపెడుతుంది. గ్లోబల్‌ బ్రాండ్స్‌ను తీసుకురావాలన్నదే మా ఆకాంక్ష. దీనిపై మా అధ్యయనం కొనసాగుతుంది.

దీనివల్ల వాహనాల రేట్లు కూడా పెరుగుతాయి కదా, అసలే అమ్మ కాలు పడిపోతున్న తరుణంలో దీన్నెలా ఎదుర్కొంటారు?
అవును, కచ్చితంగా రేట్లు పెరుగుతాయి. సాంకేతిక పరిజ్ఞానం పెంచాల్సి వచ్చినప్పుడు ఉత్పాదక వ్యయం కూడా తదనుగుణంగా పెరుగుతుంది. ఈ భారాన్ని మేం కస్టమర్లపైనే వేయాల్సి వస్తుంది కూడా. బీఎస్‌–6 కారణంగా పెట్రోలు వాహనాలతో పోలిస్తే డీజిల్‌ వాహనాల రేట్లు మరికొంత అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలం చెల్లిన వాహనాలను నిర్మూలించేందుకు ప్రభుత్వం వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీని తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. దీనిపై ప్రభుత్వానికి మీరేమైనా సూచనలు చేస్తున్నారా?
వాహన తయారీ సంస్థల సంఘం (సియామ్‌) ద్వారా ప్రభుత్వం సంబంధిత ముసాయిదా పాలసీపై మా అభిప్రాయాలను కోరింది. దీనిపై మేం మా సూచనలు తెలిపాం. కచ్చితంగా ఈ పాలసీ వల్ల అటు పర్యావరణంతో పాటు వాహన పరిశ్రమకూ ప్రయోజనం చేకూరుతుంది. పూర్తిస్థాయి పాలసీ, మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించిన వెంటనే దానికి అనుగుణంగా మేం చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం.

ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాల విషయంలో చాలా ఆసక్తిగా ఉంది. భారత్‌లో వీటికి ఎంతమేరకు ఆదరణ లభిస్తోంది. ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి టయోటా లక్ష్యాలేంటి?
ఎలక్ట్రిక్‌ వాహన విభాగంపై మేం నిర్దిష్టమైన ఆలోచనలతో ముందుకెళ్తున్నాం. భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆటోమొబైల్‌ పరిశ్రమ భవిష్యత్తు కచ్చితంగా ఎలక్ట్రిక్‌ వాహనాలదే. ఈ ప్రస్థానంలో క్రమంగా హైబ్రిడ్‌ వాహనాల నుంచి పూర్తిగా ఎలక్ట్రిక్‌కు మారడం మంచిదనేది మా అభిప్రాయం. ఎందుకంటే ముందుగా చార్జింగ్‌ స్టేషన్లు, అధిక సామర్థ్యంగల బ్యాటరీల (ఫ్యూయల్‌ సెల్స్‌) లభ్యత వంటి మౌలికాంశాలపై   దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇక సంప్రదాయ వాహనాలతో పోలిస్తే వీటి ధర కూడా అధికంగా ఉంటుంది. అందుకే ఒకేసారి ఎలక్ట్రిక్‌లోకి మారడం అసాధ్యం. ప్రభుత్వ తాజా అధ్యయనం కూడా ఇదే చెబుతోంది. 2030 నాటికి దేశంలో ఏటా కోటి కొత్త కార్ల అమ్మకాలు జరుగుతాయనేది పరిశ్రమ అంచనా. దీనిలో 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్‌వి ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించింది. మరోపక్క, ఎలక్ట్రిక్‌ వాహనాలతో సమానంగా హైబ్రిడ్‌ వాహనాలకు కూడా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది మా డిమాండ్‌. ప్రధానంగా వీటిపై పన్నులు తగ్గించడంవల్ల కస్టమర్లకు ప్రయోజనం లభిస్తుంది. రానున్న కాలంలో జీఎస్‌టీ మండలి ఈ దిశగా చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నాం.

ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ప్రపంచ దిగ్గజంగా ఉన్న టెస్లా కూడా భారత్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది కదా, ఆ పోటీని తట్టుకోవడానికి మీరెలాంటి వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు?
మేం కూడా ఇప్పటికే హైబ్రిడ్‌తో పాటు ఎలక్ట్రిక్‌ వాహనాలను భారత్‌లోకి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నాం. టెస్లా ప్రవేశం వల్ల మాకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. వాస్తవానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు దేశంలోకి అడుగుపెట్టడం పరిశ్రమకు మంచిదే. దీన్ని మేం స్వాగతిస్తున్నాం కూడా. అయితే, భారత్‌ వంటి మార్కెట్లలో కస్టమర్ల కొనుగోళ్లను నిర్ణయించేది అంతిమంగా ధరే. ప్రస్తుతం భారత్‌లో 70 శాతం కార్ల విక్రయాలకు సంబంధించి సగటు ధర రూ.9 లక్షల లోపే ఉంటుంది. అదే ప్రపంచవాప్తంగా లేదా యూఎస్‌లో టెస్లా ఎలక్ట్రిక్‌ కార్ల ధరలను అన్వయించుకుంటే.. భారత్‌లో వీటి రేట్లు రూ.60 లక్షల కంటే తక్కువకు లభించే అవకాశం లేదు. వాస్తవానికి 2050 నాటికి పూర్తిగా సీఓ2 ఉద్గార రహిత వాహనాలను మాత్రమే ఉత్పత్తి చేయాలనే స్వీయ సవాలుకు అనుగుణంగా టయోటా అడుగులు వేస్తోంది. దీనిలో ఎంతమేరకు విజయం సాధిస్తామనేది ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే ఎలక్ట్రిక్‌ పాలసీ(ప్రోత్సాహకాలు ఇతరత్రా), మౌలిక సదుపాయాల కల్పనపై ఆధారపడి ఉంటుంది. 

ఇటీవలే సుజుకీతో టయోటా భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది కదా... దీని ద్వారా భారత్‌లో టయోటా ఎలాంటి వ్యాపార ప్రణాళికలను రూపొందిస్తోంది?
ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా మా మాతృ సంస్థ టయోటా, మారుతీ మాతృ సంస్థ సుజుకీతో జట్టుకట్టింది. దీనివల్ల అటు సాంకేతికంగా, ఇటు ఉత్పాదక సామర్థ్యం పరంగా ఇరు కంపెనీలకూ ఉభయతారకంగా ఉంటుంది. వ్యయాలను కూడా తగ్గించుకోవడానికి వీలవుతుంది. ఇందులో భాగంగా మేం మారుతీ బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ను కొన్ని మార్పులతో మా సొంత బ్రాండ్‌తో ముందుగా ప్రవేశపెట్టనున్నాం(గ్లాంజా ఈ నెల 6న విడుదల కానుంది). దశలవారీగా బ్రెజా, సియాజ్, ఎర్టిగాలను మేం మా బ్రాండ్‌తో ప్రవేశపెట్టనున్నాం. తదుపరి దశల్లో వీటిని మా ప్లాంట్లలోనే తయారు చేసే ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇంకా సాంకేతికత బదిలీ ఒప్పందంలో భాగంగా మా హైబ్రిడ్‌ టెక్నాలజీని సుజుకీకి కూడా అందిస్తాం. అదేవిధంగా సుజుకీ కూడా తన చిన్న పెట్రోలు ఇంజిన్లను టయోటా కాంపాక్ట్‌ కార్ల కోసం సరఫరా చేస్తుంది.

ఒకవైపు వడ్డీరేట్లు క్రమంగా దిగొస్తున్నాయి. మరోపక్క ఇంధన ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే, వాహన కంపెనీలు మాత్రం రేట్లు పెంచుకుంటూపోతున్నాయి. దీనికి కారణమేంటి?
ఇంధన ధరలు ఇటీవల కొంత దిగొచ్చినమాట వాస్తవమే. అయితే, ఇరాన్‌పై ఆంక్షల కారణంగా మళ్లీ క్రూడ్‌ ధరలకు రెక్కలొచ్చే అవకాశం కనబడుతోంది. దీనిపైనే మా ఆందోళన అంతా. అంతేకాకుండా వాహన ధరల పెంపునకు చాలా కారణాలున్నాయి. ముందుగా చెప్పుకోవాల్సినది ముడివస్తువుల రేట్లు పెరగడం. దీనివల్ల ఉత్పాదక వ్యయం గణనీయంగా పెరిగింది. ఇంకా రవాణా, విద్యుత్‌ ఖర్చు ఇలా చాలా పెరిగాయి కూడా. అయినాసరే మేం ఈ భారాన్ని పూర్తిగా కస్టమర్లకు బదలాయించడం లేదు. చాలావరకూ మేం భరించి, ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే కొంతమేరకు రేట్లు పెంచాల్సి వస్తోంది. ఒకసారి రేటు పెంపు ప్రతిపాదన వస్తే.. కనీసం 6 నెలలపాటు పరిశీలన జరిపాకే అమలు చేస్తున్నాం. ఇక తాజాగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బీఎస్‌–6 ఇంధనాల ధరలను పెంచబోమంటూ చేసిన ప్రకటన అటు వినియోగదారులతో పాటు వాహన పరిశ్రమకు కూడా తీపి కబురే. 

భారత్‌లో టయోటా కర్ణాటక రాష్ట్రానికే పరిమితమైంది. భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలో కొత్త తయారీ యూనిట్‌ను పెట్టాల్సి వస్తే ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించే ప్రణాళికలు ఏవైనా ఉన్నాయా?
మీరు మా ప్లాంట్‌ మొత్తం చూశారు కదా. ఎంత భారీస్థాయిలో ఉందో. 432 ఎకరాల స్థలం ఉంది. ఇందులో ఇంకా మేం వినియోగించకుండా ఉన్నది 150 ఎకరాలకు పైనే. అయినా, ప్రస్తుతానికి మేం ఇక్కడ చాలా సౌకర్యవంతంగా ఉన్నాం. అన్నీ ఒకే చోట ఉంటే నిర్వహణ కూడా సులువుగా ఉంటుంది. సమీపకాలంలో ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రణాకలేవీ లేవు.

మరిన్ని వార్తలు