మోర్ దుకాణాలపై ‘ఫ్యూచర్’ గ్రూప్ కన్ను

24 Aug, 2016 01:08 IST|Sakshi
మోర్ దుకాణాలపై ‘ఫ్యూచర్’ గ్రూప్ కన్ను

కొనుగోలుకు చర్చలు!
న్యూఢిల్లీ : బిగ్‌బజార్, ఫ్యూచర్ బజార్, బ్రాండ్ ఫ్యాక్టరీ, హోమ్‌టౌన్ వంటి రిటైల్ దుకాణాలను నిర్వహించే ఫ్యూచర్ గ్రూపు... ‘మోర్’ పేరుతో మెగా మార్ట్‌లను నిర్వహిస్తున్న ఆదిత్య బిర్లా రిటైల్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నట్టు సమాచారం. ఆఫ్‌లైన్ గొలుసుకట్టు రిటైల్ దుకాణాల్లో ఫ్యూచర్ గ్రూపు అగ్రగామిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ విభాగంలో మరింతగా నిలదొక్కుకోవాలన్న వ్యూహాత్మక ఆలోచనలో భాగంగానే మోర్‌ను సొంతం చేసుకోవాలనుకుంటోంది.

కొనుగోలు లేదా విలీనం ఈ రెండింటిలో ఆదిత్య బిర్లా గ్రూపు దేనికి అంగీకరించినా ఫ్యూచర్ గ్రూపు సమ్మతించే అవకాశం ఉందని ఈ వహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒక ప్రముఖ మీడియా సంస్థ కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇది పూర్తిగా ఊహాగానమేనని, అధికారికంగా వీటిని ఖండిస్తున్నట్టు ఫ్యూచర్‌గ్రూప్ ప్రతినిధి స్పష్టం చేశారు. అదే సమయంలో ఆదిత్య బిర్లా రిటైల్ లిమిటెడ్ దీనిపై స్పందించలేదు.

ఫ్యూచర్ కొనుగోళ్ల క్రమం
రిలయన్స్ రిటైల్ తర్వాత దేశంలో రెండో అతిపెద్ద రిటైల్ సంస్థ ఫ్యూచర్ గ్రూపు. బిగ్ యాపిల్, నీల్‌గిరి, భారతీ రిటైల్ వంటి పలు సంస్థలను ఇప్పటికే తన సొంతం చేసుకుంది. దేశవ్యాప్తంగా 200 పట్టణాల్లో 700 దుకాణాలను ఫ్యూచర్ గ్రూపు నిర్వహిస్తోంది. బిగ్‌బజార్‌డెరైక్ట్.కామ్, ఫ్యూచర్‌బజార్.కామ్ వంటి ఈకామర్స్ పోర్టళ్లు కూడా సంస్థ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఫర్నిచర్ విక్రయించే ఈ కామర్స్ పోర్టల్ ఫ్యాబ్‌ఫర్నిష్.కామ్‌ను సైతం ఇటీవలే కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు