ఆర్‌ఐఎల్‌ కన్ను!- ఫ్యూచర్‌ గ్రూప్‌ అదిరే

26 Jun, 2020 14:51 IST|Sakshi

గ్రూప్‌లోని షేర్లన్నీ 5 శాతం అప్‌

అప్పర్‌ సర్క్యూట్లను తాకిన షేర్లు

ఫ్యూచర్‌ కన్జూమర్, రిటైల్‌, లైఫ్‌స్టైల్‌..

వినియోగ రంగంలో సేవలందిస్తున్న ఫ్యూచర్‌ గ్రూప్‌పై డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కన్నేసినట్లు వెలువడిన వార్తలు ఒక్కసారిగా గ్రూప్‌లోని కౌంటర్లన్నిటికీ జోష్‌నిచ్చాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఫ్యూచర్‌ గ్రూప్‌లోని షేర్లన్నీ 5 శాతం చొప్పున జంప్‌చేశాయి. ఫ్యూచర్‌ గ్రూప్‌లోని కొన్ని యూనిట్లలో పారిశ్రామిక దిగ్గజం ముకేశ్‌ అంబానీ కంపెనీ ఆర్‌ఐఎల్‌ వాటా కొనుగోలు చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో డీల్‌ కుదిరే వీలున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయని మీడియా పేర్కొంది. కాగా.. ఇటీవల నెల రోజులుగా ఫ్యూచర్‌ గ్రూప్‌ కౌంటర్లు ర్యాలీ బాటలో సాగుతుండటం గమనార్హమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

జోరుగా హుషారుగా
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఫ్యూచర్‌ గ్రూప్‌లోని పలు షేర్లు 5 శాతం అప్పర్‌ సర్క్యూట్లను తాకాయి. కొనుగోలుదారులు అధికంకాగా.. అమ్మేవాళ్లు కరవుకావడంతో ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ రూ. 170 సమీపంలో, ఫ్యూచర్‌ మార్కెట్‌ నెట్‌వర్క్స్‌ రూ. 31 వద్ద, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 16.55 వద్ద, ఈ కంపెనీ డీవీఆర్‌ రూ. 18.20 వద్ద, ఫ్యూచర్‌ రిటైల్‌ రూ. 142.4 వద్ద, ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ ఫ్యాషన్స్‌ రూ. 150 సమీపంలో, ఫ్యూచర్‌ కన్జూమర్‌ రూ. 18.4 వద్ద ఫ్రీజయ్యాయి. ఈ షేర్లన్నీ  5 శాతం చొప్పున జంప్‌ చేయడం విశేషం!

నెల రోజుల్లో
గత నెల రోజుల్లో ఫ్యూచర్‌ కన్జూమర్‌ షేరు 141 శాతం దూసుకెళ్లగా.. ఫ్యూచర్‌ మార్కెట్‌ 104 శాతం, ఫ్యూచర్‌ రిటైల్‌ 94 శాతం, ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ 88 శాతం చొప్పున జంప్‌ చేశాయి. ఈ కాలంలో ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ కౌంటర్ మాత్రం 7 శాతమే లాభపడింది.  కాగా.. షేర్ల ర్యాలీకి మార్కెట్‌ శక్తులే కారణమని.. ఈ అంశంపై కంపెనీ తరఫున స్పందించబోమని ఫ్యూచర్‌ గ్రూప్‌ ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు