‘ఫ్యూచర్‌’ చేతికి స్నాప్‌డీల్‌ ‘వల్కన్‌’!

4 Jan, 2018 00:21 IST|Sakshi

డీల్‌ విలువ రూ.50 కోట్లు

మరి కొన్ని వారాల్లో ఒప్పందం పూర్తి  

ముంబై: ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్‌ విభాగం, వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఫ్యూచర్‌ గ్రూప్‌ కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ డీల్‌ విలువ రూ.50 కోట్లు ఉండొచ్చు. తన సరఫరా చెయిన్‌ వ్యాపారాన్ని మరింత పటిష్టవంతం చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఫ్యూచర్‌గ్రూప్‌ వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేయనున్నదని సంబంధిత వర్గా లు వెల్లడించాయి. ఈ డీల్‌కు సంబంధించి చర్చలు ఆరంభ దశలో ఉన్నాయని, మరికొన్ని వారాల్లో ఖరా రు కావచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఈ డీల్‌లో భాగంగా వల్కన్‌ సిబ్బంది ఫ్యూచర్‌ గ్రూప్‌కు బదిలీ అవుతారు. వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ చేరికతో ఫ్యూచర్‌ గ్రూప్‌ థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ కార్యకలాపాలు మరింత శక్తివంతమవుతాయి. ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి స్నాప్‌డీల్, ఫ్యూచర్‌గ్రూప్‌లు నిరాకరించాయి. 

వంద నగరాల్లో వల్కన్‌ కార్యకలాపాలు...
వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ రిటైల్‌ కంపెనీలకు ముఖ్యంగా ఈ కామర్స్‌ సంస్థలకు సరఫరా సేవలందిస్తోంది. మొత్తం వంద నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక ఫ్యూచర్‌ గ్రూప్‌కు సొంత లాజిస్టిక్స్‌ సంస్థ ఉంది. ఇటీవలే ఈ సంస్థ, ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ ఐపీఓ (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) ద్వారా రూ.650 కోట్లు సమీకరించింది. రిటైల్, ఫ్యాషన్, ఆటోమోటివ్, ఇంజినీరింగ్, ఫుడ్, బేవరేజేస్, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఈ కామర్స్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ రంగాల సంస్థలకు లాజిస్టిక్స్‌ సేవలందిస్తోంది.  కీలకం కాని ఆస్తుల విక్రయంలో భాగంగా స్నాప్‌డీల్‌ సంస్థ వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ను విక్రయిస్తోంది. అత్యంత తీవ్రమైన పోటీ ఉన్న ఈ కామర్స్‌ మార్కెట్లో  ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల నుంచి నిలదొక్కుకోవడానికి కావలసిన నిధులను ఇలాంటి కీలకం కాని ఆస్తుల విక్రయం ద్వారా సమకూర్చుకుంటోంది. గత ఏడాది జూలైలో తన పేమెంట్‌ వాలెట్‌ ఫ్రీచార్జ్‌ను స్నాప్‌డీల్‌ కంపెనీ యాక్సిస్‌ బ్యాంక్‌కు రూ.385 కోట్లకు విక్రయించింది. 

మరిన్ని వార్తలు