భవిష్యత్తు భాగ్యనగరం!

5 Dec, 2014 23:10 IST|Sakshi
భవిష్యత్తు భాగ్యనగరం!

2022 నాటికి హైదరాబాద్ రియల్ అవసరాలపై జేఎల్‌ఎల్ నివేదిక
1.05 కోట్లకు చేరే నగర జనాభా.. 23 లక్షల ఇళ్ల కొరత
10 మిలియన్ చ.అ. షాపింగ్ మాల్ స్పేస్.. 65 మిలియన్ చ.అ. ఆఫీస్ స్పేస్ అవసరం
3,838 పాఠశాలలు.. 9,100 ఆసుపత్రి పడకలూ అవసరమే
12,600 హెక్టార్లలో పార్కులు, మరో 6 ఆడిటోరియంలు కూడా..

 
400 ఏళ్ల క్రితం భాగ్యనగరాన్ని కేవలం 5 లక్షల జనాభాను దృష్టిలో పెట్టుకొనే నిర్మించారు. కానీ, ఇప్పుడది దాదాపు 20 రెట్లు పెరిగింది. అది జనాభా పరంగానైనా.. విస్తీర్ణం పరంగానైనా..! ప్రస్తుతం హైదరాబాద్ అంటే.. ఇరుకు రోడ్లు, మురికివాడలు, అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, చుక్కలు చూపించే ట్రాఫిక్! అలాంటిది 2022 నాటికి భాగ్యనగరాన్ని తలచుకోవాలంటేనే భయమేస్తుంది కదూ!! ఐరోపా మాదిరిగా ఒక క్రమపద్ధతిలో పట్టణీకరణ జరగకపోవడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అందుకే 2022 నాటికి హైదరాబాద్ జనాభా, అప్పటి గృహ అవసరాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాళ్లు వంటి మౌలిక అవసరాలపై అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెంట్ అయిన జోన్స్ లాంగ్ లాసల్లె (జేఎల్‌ఎల్) ఓ నివేది కను రూపొందించింది. నివేదికలోని పలు అంశాలపై ‘సాక్షి రియల్టీ’ ప్రత్యేక కథనమిది.

- సాక్షి, హైదరాబాద్
 
జనమే జనం...
2014వ సంవత్సరం నాటికి: 86 లక్షలు
2022వ సంవత్సరం నాటికి: 1.05 కోట్లు


1990వ సంవత్సరంలో 42 లక్షలుగా ఉన్న హైదరాబాద్ జనాభా 2014 నాటికి 86 లక్షలకు చేరింది. 2022 సంవత్సరానికి 1.05 కోట్లకు, 2030 నాటికి 1.28 కోట్లుకు చేరుకుంటుందని అంచనా. అయితే జనాభా మాదిరిగా మౌలిక వసతులు, గృహ అవసరాలు మాత్రం వృద్ధి చెందట్లేదు. నగరంలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వలస వస్తున్నారు.
 
ఇళ్ల కొరత..
2014వ సంవత్సరం : 19 లక్షలు
2022వ సంవత్సరం : 23 లక్షలు


హైదరాబాద్‌లోని మొత్తం జనాభాలో ఉద్యోగస్తుల జనాభా 45.5 శాతం. వీరిలో సొంతిల్లు ఉన్న వాళ్లు కేవలం 19 లక్షలే. మరోవైపు నగరంలో దాదాపు 1,474 మురికివాడల్లో 25 లక్షల వరకూ జనాభా ఉంది. వీళ్లకు సొంతిల్లు సంగతి దేవుడెరుగు.. కనీసం తాగునీరు, డ్రైనేజీ, మెరుగైన రవాణా వంటి కనీస వసతులే కరువు. అద్దె ఇళ్లు అగ్గిపెట్టెలను తలపిస్తుంటాయి. చక్కటి పట్టణ ప్రణాళిక లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. 2011 సంవత్సరంలో నగరంలో 16 లక్షలుగా ఉన్న ఇళ్ల కొరత.. 2014 నాటికి 19 లక్షలకు చేరింది. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం మేల్కొని సమగ్ర గృహ నిర్మాణాన్ని చేపట్టకపోతే 2022 నాటికి 23 లక్షలకు పైగానే చేరుకుంటుందని అంచనా.

షాపింగ్ అంటే మోజు..
2014వ సంవత్సరం: 2 మిలియన్ చ.అ.
2022వ సంవత్సరం: 8-10 మిలియన్ చ.అ.


షాపింగ్ అంటే నగరవాసులకు ఎక్కడలేని వ్యామోహం. అందుకే ఎన్ని షాపింగ్ మాల్స్ ఉన్నా ఇంకా కొత్తగా నిర్మించే మాల్స్ వైపు ఆశగా ఎదురుచూసే వారికిక్కడ కొదవలేదు. ఇప్పటికే నగరంలో హైదరాబాద్ సెంట్రల్, ఇన్నార్బిట్ మాల్, జీవీకే వన్, సిటీ సెంటర్.. ఇలా సుమారు వందకు పైగా పెద్ద మాల్స్ 2 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. 2022 నాటికి 8 నుంచి 10 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో షాపింగ్ మాల్ స్పేస్ అవసరం ఉంటుందని అంచనా. ఇప్పటికే 5 మిలియన్ చ.అ. విస్తీర్ణంలో వివిధ కంపెనీల షాపింగ్ మాళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి కూడా.

ఆఫీస్ స్పేస్‌కూ గిరాకే..
2014వ సంవత్సరం: 32 మిలియన్ చ.అ.
2022వ సంవత్సరం: 63-65 మిలియన్ చ.అ.

 
స్థానిక రాజకీయాంశం కారణంగా నగరంలో ఆఫీసు స్పేస్ మార్కెట్ కొంతకాలం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నా.. ఆరేడు నెలలుగా పరిస్థితి సానుకూలంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం రెండిట్లోనూ స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడటమే ఇందుకు కారణం. ప్రస్తుతం హైదరాబాద్‌లో 32 మిలియన్ చ.అ.ల్లో ఆఫీస్ స్పేస్ విస్తరించి ఉంది. 2022 నాటికి ఇది 63 నుంచి 65 మిలియన్ చ.అ.ల్లో ఆఫీస్ స్పేస్ అవసరం ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో కార్యాలయాల స్థలం ఏటా 5 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. రాజకీయాంశంతో సంబంధం లేకుండా ప్రజల అవసరాల్ని తీరుస్తాయి కాబట్టే చిల్లర వర్తక సముదాయాలకూ (రిటైల్ స్పేస్) డిమాండ్ పెరుగుతోంది. 2022 నాటికి నగరంలో 8 మిలియన్ చ.అ.ల్లో రిటైల్ స్పేస్ అవసరముంటుంది. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో గల అతిపెద్ద వీధుల్లో దుకాణాల అద్దెలూ స్వల్పంగా పెరగడానికి ఆస్కారం ఉంది.

పార్కులూ అవసరమే..
2022 నాటికి 12,600 హెక్టార్లలో పార్కులు అవసరం.నగరవాసులకు అభివృద్ధితో పాటు ఆర్యోగం కూడా అవసరమే. పర్యావరణ సమతూకం ఉండాలంటే 33 శాతం విస్తీర్ణంలో అడవులు అవసరం. మన రాష్ట్రంలో అది 21 శాతం ఉండగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సగటు 9.5 శాతమే. అదీ రంగారెడ్డి జిల్లాలో గ్రామీణ ప్రాంతా లను కలుపుకుంటేనే. దాన్ని మినహాయిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో 2-3 శాతం మించదు. ప్రస్తుతం హైదరాబాద్‌లో 142 హెక్టార్లలో, రంగారెడ్డిలో 70,295.87 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి. 2022 నాటికి పెరిగే నగర జనాభాను దృష్టిలో పెట్టుకుంటే మరో 12,600 హెక్టార్లలో పార్కులు అవసరం ఉంటుంది.

స్కూళ్లు, ఆసుపత్రులు కూడా..
2022 నాటికి నగర జనాభా అవసరాల దృష్ట్యా ఇప్పుడున్న వాటి కంటే రెండింతల సంఖ్యలో పాఠశాలలు, ఆసుపత్రులు, ఆడిటోరియంలు అవసరముంటాయి.  2022 నాటికి సుమారు 10.92 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 9,100 ఆసుపత్రి పడకలు అవసరముంటాయి. అలాగే 54 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 3,838 పాఠశాలలు, 27 మిలియన్ చ.అ. బిల్టప్ ఏరియా విస్తీర్ణంలో 6 ఆడిటోరియంలు అవసరముంటాయని జేఎల్‌ఎల్ నివేదిక చెబుతోంది.
 
ఫ్లాట్లు, ప్లాట్లు, లోన్లు, నిర్మాణాలు,న్యాయకోణాలు, పన్నులు, వాస్తు ఇలా స్థిరాస్తులకు సంబంధించి మీ సందేహాలు మాకు రాయండి.
 realty@sakshi.com

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు