ఫ్యూచర్‌ చేతికి ‘వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌’!

27 Jan, 2018 00:57 IST|Sakshi

డీల్‌ విలువ రూ.35 కోట్లు

న్యూఢిల్లీ: కిశోర్‌ బియానీకి చెందిన ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ప్రముఖ ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లేస్‌ స్నాప్‌డీల్‌కు చెందిన లాజిస్టిక్స్‌ విభాగం వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేసింది. పూర్తిగా నగదు చెల్లించి వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ను కొనుగోలు చేశామని, ఈ డీల్‌ విలువ రూ.35 కోట్లని ఫ్యూచర్‌ గ్రూప్‌ చైర్మన్‌ కిశోర్‌ బియానీ తెలిపారు. వల్కన్‌ చేరికతో ఈ కామర్స్, రిటైల్‌ కస్టమర్లకు మరింత మెరుగైన సేవలందించగలమని చెప్పారాయన.

కాగా పూర్తిగా ఈ–కామర్స్‌ వ్యాపారంపైననే దృష్టి సారించే వ్యూహంలో భాగంగా స్నాప్‌డీల్‌ కంపెనీ వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ను విక్రయించిందని స్నాప్‌డీల్‌ చీఫ్‌ స్ట్రాటజీ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌ జేసన్‌ కొఠారి పేర్కొన్నారు.  ఫ్యూచర్‌ సప్లై చెయిన్‌కు దేశవ్యాప్తంగా 44 గిడ్డంగులు, 14 లాజిస్టిక్స్‌ కేంద్రాలు, 106 బ్రాంచ్‌లు ఉన్నాయి.

ఫ్యూచర్‌ జోరు..: ఇటీవల కాలంలో ఫ్యూచర్‌ కంపెనీ జోరుగా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో ఈ కంపెనీ షాపర్స్‌ స్టాప్‌కు చెందిన హైపర్‌ సిటీ రిటైల్‌ను రూ.655 కోట్లకు కొనుగోలు చేసింది. గత వారమే ట్రావెల్‌ న్యూస్‌ సర్వీసెస్‌ ఇండియాను (టీఎన్‌ఎస్‌ఐ) రూ.100 కోట్లకు కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు