త్రీడీ ప్రింటింగ్‌దే ఫ్యూచర్...

7 Aug, 2014 01:39 IST|Sakshi
త్రీడీ ప్రింటింగ్‌దే ఫ్యూచర్...

 సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా వెలుస్తున్న  స్టార్టప్ కంపెనీలు...కేవలం టెక్నాలజీ రంగానికే పరిమితం కాలేదు. వైద్య రంగంలోనూ వినూత్న ఆవిష్కరణలతో ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యాప్‌లే కాదు. ఉత్పత్తులనూ ఆవిష్కరిస్తున్నాయి. ముఖ్యంగా దృష్టి లోపంతో బాధపడే వారికి  ఉపయోగపడే కొత్త ఉత్పత్తులకు మార్కెట్ ప్రపంచ వ్యాప్తంగా ఉంటోంది.

దేశంలో తొలి సారిగా అంధుల వినియోగం  కోసం ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ఒక ఇన్నోవేషన్ సెంటర్‌ను సృజన పేరుతో నెలకొల్పింది. ఈ సెంటర్ త్రీడీ ప్రింటింగ్ ఉత్పత్తుల అభివృద్ధి , నవీకరణలపై స్టార్టప్ కంపెనీలకు సాంకేతిక సహాయాన్ని అందిస్తోందని సృజన ప్రాజెక్ట్ డెరైక్టర్ డాక్టర్ ఆంటోనీ విపిన్ దాస్ తెలిపారు. అమెరికాలోని ప్రఖ్యాత మసాచ్యూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన 35 ఏళ్లలోపు 35 మంది ఇన్నోవేటర్స్‌లో డాక్టర్ ఆంటోనీ మన దేశం నుండి అరుదైన గౌరవాన్ని పొందారు. ఇంజనీరింగ్‌కు మెడిసిన్ తోడైతే ...దాన్ని మించిన వ్యాపార మంత్రం ఉండదంటున్న డాక్టర్ ఆంటోనీతో సాక్షి ప్రతినిధి జరిపిన ఇంటర్వ్యూ

వివరాలు ఇవీ...
 మెడికల్ స్టార్టప్ కంపెనీల వ్యాపార అవకాశాలు?
 మెడికల్ టెక్నాలజీలో స్టార్టప్ కంపెనీలకు వృద్ధి అవకాశాలంటే ఆకాశమే హద్దు. హెల్త్‌కేర్ రంగంలో స్మార్ట్‌ఫోన్ ఆధారంగా పలు రకాల రుగ్మతల స్క్రీనింగ్‌కోసం అప్లికేషన్లు డెవలప్ చేస్తున్నారు. ఉదాహరణకు డయాబీటిస్, కేన్సర్, క్యాటరాక్ట్,  చెవి, సర్వికల్ ఇన్‌ఫెక్షన్స్ లాంటి రుగ్మతల స్క్రీనింగ్ కోసం తక్కువ వ్యయంతో కూడిన అప్లికేషన్లకు ఆదరణ ప్రపంచ వ్యాప్తంగా ఉంటోంది. అమెరికాలోని ఎంఐటీతో కలిసి ఎల్‌వీ ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ క్లినికల్ ఫొటోగ్రఫీని  డెవలప్ చేసింది. ఇదొక గొప్ప సంచలనం.

 క్లినికల్ ఫొటోగ్రఫీ గురించి వివరించండి?
 కంటి ఆస్పత్రుల్లో స్లిట్ ల్యాంప్ కెమెరా ద్వారా పరీక్షలు నిర్వహిస్తారు. దీని ఖరీదు రూ. 1.5 లక్షలు. అయితే మా సంస్థలోని ఆప్తాల్మాలజిస్ట్ గణేష్ తన టీంతో కలిసి కేవలం ఐ ఫోన్‌ను ఉపయోగించి స్లిట్ ల్యాంప్ కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ఒక్కో ప్రింట్ ధర ఒక డాలర్ కన్నా తక్కువకే ఇవ్వగలుగుతున్నాం. ఇదొక విప్లవాత్మక ఆవిష్కరణ.

 భవిష్యత్ త్రీ డీ ప్రింటింగ్‌దేనా?
 త్రీ డీ ప్రింటింగ్ విప్లవాత్మక టెక్నాలజీ. ముఖ్యంగా అంధులకు ఇదొక వరం. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది జైన్ విద్యార్థిని తానియా జైన్ మా సంస్థతో కలిసి తొలిసారిగా బ్రెయిలీ బాషలో  రూపొందించిన టాయ్‌పజిల్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపొచ్చింది. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. ఫిటిల్.ఇన్ వెబ్‌సైట్ ద్వారా ఈ స్టార్టప్ తన కార్యకలాపాలు నడుపుతోంది. అంధ విద్యార్థులకు వర్ణమాలలోని  అక్షరాల ఆకృతి, పళ్లు, కూరగాయలు, పక్షులు, జంతువుల ఆకారాలను త్రీ డీ ప్రింటింగ్ ద్వారా అందుబాటులో ఉంచడంతో వారికి వాటిపై చక్కటి అవగాహన కలుగుతోంది.  

అంధుల్లో బ్రెయిలీ భాష నేర్చుకున్న వారు పది శాతానికి మించిలేరు. మిగిలిన 90 శాతం మంది అంధ విద్యార్థులకు బ్రెయిలీపై ఆసక్తిని పెంపొందించేందుకు త్రీడీ ప్రింటింగ్ ఆబ్జెక్టులు వారికి వివిధ రకాల భావనలపై  అవగాహన కల్గిస్తున్నాయి. స్టార్ట్టప్ కంపెనీ ఫిటిల్ అభివృద్ధి చేసిన ఫిష్ టాయ్ పజిల్ ఉత్పత్తి బాగా హిట్టయింది. ప్రపంచ వ్యాప్తంగా అంధుల పాఠశాలలకు, టీచర్లకు ,పేరెంట్స్‌కు ఇంగ్లిష్ ఆల్ఫాబెట్‌లు ఏ నుండి జడ్ వరకు ఈ సంస్థ సప్లయ్ చేయనుంది.

 మెడికల్ స్టార్టప్‌లకు హైదరాబాద్ అనువైందేనా?
 హైదరాబాద్‌లో చక్కటి ఈకో సిస్టమ్ ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, కార్పొరేట్ ఆస్పత్రులు, పరిశోధనా సంస్థలు, మెడికల్ టూరిస్టులు...హెల్త్‌కేర్‌లో ఇన్నొవేషన్స్‌కు ఇది ప్రపంచ వేదిక అయ్యే అవకాశాలు ఎక్కువ. అంతేకాక ఏటా  వేలాది మంది ఇంజనీర్లు, డాక్టర్లు తయారవుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అంతర్జాతీయ స్థాయి సేవలు, ఉత్పత్తుల  ఆవిష్కరణలకు అపారమైన అవకాశాలున్నాయి. సృజన, చొరవ, పట్టుదల ఉంటే యువ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు అపార ఆకాశమే హద్దు.

 కొత్త వారికి మీరిచ్చే సలహా?
 గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులు, యువ ఇంజనీర్లు తమ ఆలోచనలతో సంప్రదిస్తే వారికి సరైన దిశా నిర్దేశం చేస్తాం. ఈ రంగంలో వ్యాపార అవకాశాలు అపారం. గ్లోబల్ ఇంపాక్ట్ (ప్రపంచ వ్యాప్తంగా తమ ముద్ర వేసుకునే అవకాశం) ఈ స్టార్టప్ కంపెనీలకుంటుంది. నిధుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

 కొత్త ఆవిష్కరణల కోసం ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో ‘సృజన’ అనే ఇన్నోవేషన్ కేంద్రాన్ని గతేడాది మాజీ రాష్ర్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా హెల్త్‌కేర్ రంగంలో వ్యాపార అవకాశాలు వెతికే వారికోసం చక్కటి సూచనలు, సలహాలు, మెంటారింగ్ కార్యక్రమాలు చేపడుతున్నాం.

>
మరిన్ని వార్తలు