అకస్మాత్తుగా బైక్‌ చెడిపోయిందా...

9 Nov, 2019 10:23 IST|Sakshi

‘గాడీ 360’తో బైక్‌ సర్వీసింగ్‌

అనుకూలమైన సమయంలో సర్వీసింగ్‌

హైదరాబాద్‌ కేంద్రంగా స్టార్టప్‌ ఆవిర్భావం  

సాక్షి, సిటీబ్యూరో: అకస్మాత్తుగా బైక్‌ చెడిపోయిందా...చాలా రోజులుగా సర్వీసింగ్‌కు ఇవ్వాలనుకొని  ఇవ్వలేకపోతున్నారా..పని ఒత్తిడి కారణంగా తీరిక లేకుండా ఉందా.. మరేం ఫరవాలేదు. ఇప్పుడు మీరు ఎక్కడుంటే అక్కడి నుంచే  బైక్‌ సర్వీసింగ్‌ సేవలు లభిస్తాయి. మీరు కోరుకున్న సమయంలో  వాహనానికి కావలసిన మరమ్మతులు చేసి అందజేస్తారు.  సర్వీసింగ్‌ స్టేషన్లకు పరుగెత్తవలసిన అవసరం లేదు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంటి నుంచి వాహనాన్ని తీసుకెళ్లి  సర్వీసింగ్‌ చేసి ఆ తరువాత తిరిగి ఇంటి దగ్గరే అప్పగిస్తారు. ఇందుకోసం చేయాల్సిందల్లా  ఒక్కటే .. గాడీ–360 మొబైల్‌ అప్లికేషన్‌లో  మీ  బైక్‌ మరమ్మతు  అవసరాన్ని నమోదు చేయడం. అంతే. ఆ తరువాత నిశ్చింతగా ఉండొచ్చు. హైదరాబాద్‌ కేంద్రంగా  పని చేస్తున్న  ‘గాడీ –360 ’ స్టార్టప్‌ సంస్థ ఈ వినూత్నమైన సదుపాయాన్ని నగరవాసులకు అందుబాటులోకి తెచ్చింది.

సేవలు ప్రామాణికం
సాధారణంగా చాలామంది వాహనదారులు పని ఒత్తిడి కారణంగా, నిర్లక్ష్యం వల్ల  బైక్‌ సర్వీసింగ్‌ను వాయిదా వేస్తూంటారు. దీంతో  బండి బాగా చెడిపోయి, విడిభాగాలు దెబ్బతింటాయి. అప్పుడు  మరింత నష్టం వాటిల్లుతుంది. కానీ క్రమం తప్పకుండా  వాహనాన్ని సర్వీసింగ్‌ చేయడం వల్ల ఎక్కువ కాలం  వినియోగించుకొనే అవకాశం లభిస్తుంది. మరోవైపు  బైక్‌ను  సర్వీసింగ్‌కు ఇవ్వాలని భావించినప్పటికీ  ప్రామాణికమైన, నమ్మకమైన మెకానిక్‌ను ఎంపిక చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతారు. ఈ పరిస్థితుల్లో  అలాంటి ఇబ్బందులేమీ లేకుండా నాణ్యమైన, నమ్మకమైన, ప్రామాణికమైన బైక్‌ సర్వీసింగ్‌ సదుపాయం కల్పించనున్నట్లు హామీ  ఇస్తోంది గాడీ–360. ప్రస్తుతం మాదాపూర్, హైటెక్‌సిటీ, కొండాపూర్, తదితర ప్రాంతాల్లో    సేవలు కొనసాగుతున్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాలకు తమ సర్వీసులను విస్తరిస్తున్నట్లు  చెప్పారు సంస్థ సీఈఓ అనిల్‌. వాహన వినియోగదారులు  మొబైల్‌ ఫోన్‌లలో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని  తమ బైక్‌  రిజిస్ట్రేషన్‌ నెంబర్, అడ్రస్, తదితర వివరాలను నమోదు చేస్తే చాలు. ప్రతినిధులు  నేరుగా వచ్చి బైక్‌ను పరిశీలించి లోపాలను  గుర్తిస్తారు. మరమ్మతులకు అంగీకరిస్తే తమతో పాటు తీసుకెళ్తారు. మరమ్మతులు పూర్తయిన తరువాత  ఫైనల్‌ బిల్లు మొబైల్‌ ఫోన్‌కు అందుతుంది. ఆ తరువాత ప్రతినిధులు తిరిగి వాహనాన్ని అప్పగిస్తారు. ఈ పిక్‌ అండ్‌ డ్రాప్‌ సేవలు పూర్తిగా ఉచితం. సర్వీసింగ్‌ చార్జీలు మాత్రం రూ.799 చెల్లిస్తే సరిపోతుందని అనిల్‌ వివరించారు. ఒకవేళ విడిభాగాలు ఏవైనా వినియోగిస్తే  వాటికి సంబంధించిన ఇన్‌వాయిస్‌ ప్రకారం డబ్బులు చెల్లిస్తే సరిపోతుంది. పని చేసే ఆఫీస్‌ నుంచి లేదా ఇంటి దగ్గర నుంచి ఈ  సర్వీసులను పొందవచ్చు.

పారదర్శకమైన సేవలు
మా సేవలు పూర్తిగా పారదర్శకంగా ఉంటాయి. ఎక్కడా ఎలాంటి దాపరికం ఉండదు. బ్రాండెడ్‌ విడిభాగాలను వినియోగిస్తాం. నాణ్యమైన సేవలను అందజేస్తాం. వాహనదారులు తమ బైక్‌ మోడల్, బ్రాండ్, రిజిస్ట్రేషన్‌ నెంబర్, బుకింగ్‌ డేట్‌ వంటి వివరాలను యాప్‌ ద్వారా నమోదు చేసి  మాకు చేరవేస్తే చాలు. ఆ తరువాత అన్నీ మేమే చూసుకుంటాం.  – అనిల్, సీఈవో

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా