గ్యాస్‌ పైపులైన్లు వేయటానికే గెయిల్‌!

10 Jan, 2018 00:59 IST|Sakshi

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ స్పష్టీకరణ  

న్యూఢిల్లీ: సహజ గ్యాసు పైపులైన్ల నిర్మాణంపై గెయిల్‌ దృష్టి సారించాలని, గ్యాస్‌ మార్కెటింగ్‌ ఎవరైనా చేయగలరని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ అన్నారు. గెయిల్‌ నుంచి గ్యాస్‌ మార్కెటింగ్‌ వ్యాపారాన్ని వేరు చేయనున్నట్టు వస్తున్న వార్తలను బలపరిచే విధంగా మంత్రి ప్రకటన ఉండడం గమనార్హం.

అయితే, ప్రభుత్వం గెయిల్‌ను రెండుగా చేయనుందన్న సమాచారాన్ని మంత్రి ధ్రువీకరించడం, ఖండించడం వంటివేమీ చేయలేదు. మౌలిక సదుపాయాల కల్పనను పర్యావరణ అనుకూలమైన సహజ గ్యాసు రూపంలో అనుసంధానం కాని ప్రాంతాలకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రాధాన్యంగా చెప్పారు. దేశాన్ని గ్యాస్‌ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

1984లో ఓఎన్‌జీసీ నుంచి గ్యాస్‌ వ్యాపారాన్ని వేరు చేస్తూ ఏర్పాటు చేసిందే గెయిల్‌. దేశవ్యాప్తంగా 11,000 కిలోమీటర్ల సహజ గ్యాసు పైపులైన్‌ నెట్‌వర్క్‌ ఈ సంస్థ పరిధిలో ఉంది. గెయిల్‌ నుంచి గ్యాస్‌ మార్కెటింగ్‌ వ్యాపారాన్ని వేరు చేయాలన్న అంశంపై ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు సమావేశాలు కూడా నిర్వహించగా, తుది నిర్ణయానికి రాలేదని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు