ఈ-కామర్స్ వ్యాపారంలోకి గతి ప్రమోటర్లు

9 Dec, 2015 01:01 IST|Sakshi
ఈ-కామర్స్ వ్యాపారంలోకి గతి ప్రమోటర్లు

గతి చీఫ్ బ్రాండ్ కస్టోడియన్   మీరా మధుసూధన్ సింగ్
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో:
లాజిస్టిక్, సప్లై చైన్ సంస్థ ‘గతి’ ప్రమోటర్లు ఆన్‌లైన్ ఈ-కామర్స్ వ్యాపారంలోకి అడుగు పెట్టనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆన్‌లైన్ ఈ- కామర్స్ మార్కెట్‌ప్లేస్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు గతి చీఫ్ బ్రాండ్ కస్టోడియన్ మీరా మధుసూధన్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం ఇది ఇంకా ప్రాధమిక దశలోనే ఉందని, 2016లోగా కార్యరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ఈకామర్స్ సంస్థలకు అందిస్తున్న సేవలకు ఇబ్బంది తలెత్తకుండా వేరే ఇన్వెస్టర్లతో కలిసి ప్రత్యేక కంపెనీగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే భౌగోళిక గుర్తింపు కలిగిన హైదరాబాద్ హలీమ్, కరాచీ బిస్కెట్స్, హిమాచల్ యాపిల్స్, ఆల్ఫోన్సా మామిడిపండ్లు, మహారాష్ట్ర వేరుశెనగ చిక్కి వంటివి గతి కనెక్ట్ ద్వారా సప్లై చేస్తున్న సంగతి తెలిసిందే. చేతిలో లాజిస్టిక్, సప్లై మేనేజ్‌మెంట్ ఉండటంతో వేగంగా విస్తరిస్తున్న ఆన్‌లైన్ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి చర్చలు జరుపుతున్నామని, ప్రస్తుత ఆన్‌లైన్ క్లయింట్లకు పోటీ లేకుండా ఈ వెంచర్‌ను తీసుకురానున్నట్లు మీరా తెలిపారు.

 దేశంలోనే తొలిసారిగా ఒక లాజిస్టిక్ కంపెనీ అభివృద్ధి చేసిన మొబైల్ యాప్‌ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఈకామర్స్ సంస్థలకు అందిస్తున్న సేవల ద్వారా గతేడాది రూ. 128 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు తెలిపారు. ఈ ఏడాది విభాగం 100 శాతం వృద్ధిని నమోదు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2014-15లో గతి గ్రూపు మొత్తం రూ. 1,663 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. పెరుగుతున్న ఈ-కామర్స్ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబైల్లో నాలుగు ఫుల్‌ఫిల్‌మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా రోజుకు 30,000 వస్తువులను డెలివరీ చేస్తున్నట్లు తెలిపారు.  మొత్తం గతి గ్రూపు రోజుకు 2.40 లక్షల వస్తువులను డెలివరీ చేస్తోంది.
 

మరిన్ని వార్తలు