సీజీ పవర్‌ నుంచి థాపర్‌ అవుట్‌

30 Aug, 2019 10:57 IST|Sakshi

చైర్మన్‌గా తొలగించిన బోర్డు

కొత్త చైర్మన్‌ ఎంపిక కోసం నేడు సమావేశం

ఆర్థిక అవకతవకల నేపథ్యం

న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో సీజీ పవర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ సొల్యూషన్స్‌ సంస్థ చైర్మన్‌ పదవి నుంచి గౌతమ్‌ థాపర్‌ను తప్పిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. థాపర్‌ తొలగింపు తీర్మానానికి మెజారిటీ బోర్డు సభ్యులు ఆమోదం తెలిపినట్లు స్టాక్‌ ఎక్సే్చంజీలకు సీజీ పవర్‌ తెలిపింది. తీర్మానాన్ని థాపర్‌ వ్యతిరేకించగా, సీఈవో.. ఎండీ కేఎన్‌ నీలకంఠ్‌ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. కొత్త చైర్మన్‌ను ఎంపిక చేసేందుకు కంపెనీ బోర్డు శుక్రవారం సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీజీ పవర్‌ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా కొత్త మేనేజ్‌మెంట్‌ టీమ్‌కు అప్పగించాలని ఇన్వెస్టర్లు, రుణదాతలు డిమాండ్‌ చేస్తున్నట్లు వివరించాయి. వేల కోట్ల మేర తీసుకున్న రుణాలు, అనుబంధ సంస్థలకు ఇచ్చిన రుణాల మొత్తాలను తగ్గించి చూపారంటూ సీజీ పవర్‌ ఖాతాల దర్యాప్తులో వెల్లడైన సంగతి తెలిసిందే. రూ. 6,148 కోట్ల మేర అవకతవకల నేపథ్యంలోనే సంపూర్ణ ప్రక్షాళనలో భాగంగా తొలి చర్యగా థాపర్‌పై వేటుపడిందని పేర్కొన్నాయి. విచారణ జరుగుతున్న సందర్భంగా నీలకంఠ్‌ను సంస్థ సెలవుపై పక్కన పెట్టింది. ఆయన్ను  ఇప్పటికీ కీలక బాధ్యతల్లో కొనసాగిస్తుండటంపై ఇన్వెస్టర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.   

మోసం జరగలేదు: థాపర్‌
ఆగస్టు 20న ఆర్థిక అవకతవకలు బైటపడినప్పట్నుంచీ ఇప్పటిదాకా మౌనం వహించిన థాపర్‌ తాజాగా పెదవి విప్పారు. ‘ఈ వ్యవహారంలో ప్రమోటరు గానీ ప్రమోటర్లకు చెందిన ఏ సంస్థ గానీ అనుచితమైన లబ్ధి పొందలేదు.  ఆగస్టు 19 నాటి బోర్డు సమావేశం తర్వాత వచ్చిన వార్తలన్నీ బాధపెట్టేవిగా ఉన్నాయి. వీటిలో ఎలాంటి వాస్తవాలు లేవనే చెప్పాలి. వాటాదారులందరి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చెబుతున్నాను. బ్యాంకు లు ఇచ్చిన రుణాలు గానీ, సీజీ నిధులు కానీ దుర్వినియోగం చేయ డం జరగలేదు. బోర్డు అనుమతులతోనే నిధులను వినియోగించడం జరిగింది. ఇంటర్‌–కార్పొరేట్‌ లావాదేవీలన్నింటికీ కూడా బోర్డు పూర్తి ఆమోదం ఉంది‘ అని ఒక ప్రకటనలో  తెలిపారు. 2015 నాటి నుంచి రూ. 4000 కోట్ల పైగా మొత్తాన్ని రుణదాతలకు తిరిగి చెల్లించిన ప్రమోటర్లకు.. ‘మోసానికి పాల్పడాల్సిన అవసరం లేదు’ అని పేర్కొన్నారు. కంపెనీ చైర్మన్‌ హోదా నుంచి తొలగించినప్పటికీ థాపర్‌ బోర్డులో కొనసాగనున్నారు. స్వల్ప వాటానే ఉన్నప్పటికీ బోర్డు నుంచి కూడా తప్పించాలంటే షేర్‌హోల్డర్ల అనుమతి తీసుకోవాల్సి ఉండటమే ఇందుకు కారణం.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా