‘మోదీ 2.0’కు ఆ 4 కీలకం...!

27 May, 2019 09:00 IST|Sakshi

త్వరలో జీడీపీ వృద్ధిరేటు, ద్రవ్యలోటు గణాంకాలు

ఆర్‌బీఐ మిగులు నిధులపై జలాన్‌ నివేదిక, ఎన్ పీఏల పరిష్కారంపై ఆదేశాలు కూడా

న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు మందగమనం, బలహీన పెట్టుబడులు, వినియోగం, డిమాండ్‌లతో దేశ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతున్న తరుణంలో మళ్లీ పగ్గాలు చేపట్టనున్న మోదీ సర్కారుకు అనేక ఆర్థిక సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. త్వరలో వెలువడనున్న 2018–19 నాలుగో త్రైమాసికం(క్యూ4), పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలు, ద్రవ్యలోటు లెక్కలు, ఆర్‌బీఐ మిగులు నిధుల వినియోగంపై బిమల్‌ జలాన్ కమిటీ నివేదిక, మొండిబకాయిల పరిష్కారంపై ఆర్‌బీఐ జారీచేయనున్న తాజా ఆదేశాలు... ఈ నాలుగు అంశాలు ‘మోదీ 2.0’ ప్రభుత్వానికి చాలా కీలకమని పరిశీలకులు పేర్కొంటున్నారు.

క్యూ4లో 6.3 శాతమే...!
2018–19 క్యూ4లో జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికి మందగించొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యల్ప వృద్ధిరేటుగా నిలుస్తుంది. అంతేకాదు ఈ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019–20)పైనా పడుతుందని... తొలి త్రైమాసికంలోనూ మందగమనం కొనసాగవచ్చని నిపుణులు లెక్కలేస్తున్నారు. 2018–19 తొలి త్రైమాసికంలో 8 శాతంగా ఉన్న వృద్ధి రేటు రెండో త్రైమాసికంలో 7 శాతానికి.. మూడో త్రైమాసికంలో 6.6 శాతానికి దిగజారిన సంగతి తెలిసిందే. మరోపక్క, ప్రభుత్వం 2018–19లో లక్ష్యంగా పెట్టుకున్న ద్రవ్యలోటు(ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) గణాంకాలు కూడా జీడీపీ డేటాతో పాటు ఈ నెలాఖరు(మే 31)లో వెలువడనున్నాయి. తొలుత ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేస్తామని పేర్కొన్న మోదీ సర్కారు... ఆ తర్వాత 3.4 శాతానికి సవరించిన సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి చివరినాటికే ద్రవ్యలోటు రూ.8,51,499 కోట్లకు చేరింది. ఇది బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే 134 శాతం అధికం. అంటే జీడీపీలో 4.52 శాతానికి సమానం.

ఎన్ పీఏలపై ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు...
మోదీ నేతృత్వంలోని రెండో విడత ఎన్‌డీఏ సర్కారు కొలువుదీరిన తర్వాత మొండిబకాయిల (ఎన్‌ పీఏ) పరిష్కారానికి సంబంధించి ఆర్‌బీఐ సవరించిన ఆదేశాలను జారీచేయనుంది. అయితే, గతానికి భిన్నంగా ఎన్ పీఏల విషయంలో ఆర్‌బీఐ తన కఠిన విధానాన్ని కొంత సడలించే అవకాశం ఉండొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్ పీఏలపై 2018, ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆర్‌బీఐ సర్క్యులర్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల కోడ్‌ తొలగనున్న నేపథ్యంలో కొత్త సర్క్యులర్‌ను ఆర్‌బీఐ మరికొన్ని రోజుల్లో విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతోంది. దీనిప్రకారం ఎన్ పీఏల గుర్తింపు, ఖాతాలను ఎన్ పీఏలుగా వర్గీకరించేందుకు, అదేవిధంగా దీనికి సంబంధించి పరిష్కారం విషయంలో(ఎన్ సీఎల్‌టీని ఆశ్రయించడం) మరింత గడువు ఇచ్చేవిధంగా కొత్త సర్క్యులర్‌ ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంలో భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) సూచనలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. ‘ఫిబ్రవరి 12’ సర్క్యులర్‌ ప్రకారం రుణ బకాయి చెల్లింపు గడువుకు ఒక్కరోజు ఆలస్యమైనా ఆ ఖాతాను ఎన్ పీఏగా వర్గీకరించాల్సి వస్తోంది. అయితే, ఈ గడువును కనీసం 90 రోజులకు పెంచాలనేది బ్యాంకర్ల సూచన. ఆ తర్వాతే పరిష్కార ప్రక్రియను ప్రారంభించాలని వారు కోరుతున్నారు. కాగా, ఆర్‌బీఐ వద్ద ఎంతమేరకు మిగులు నిధులు ఉంచుకోవాలి అనేదానిపై మాజీ ఆర్‌బీఐ గవర్నర్‌ బిమల్‌ జలాన్  నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ తన నివేదికను జూన్ లో సమర్పించనుంది. ఆర్‌బీఐ మిగులు నిధులను ప్రభుత్వానికి బదలాయించే విషయంలో మోదీ సర్కారు ఆర్‌బీఐ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జలాన్  కమిటీ నివేదిక చాలా కీలకం కానుంది.

మరిన్ని వార్తలు