‘లోటు’ పెరిగినా.. వృద్ధికే ఓటు!

1 Feb, 2020 04:58 IST|Sakshi
బడ్జెట్‌కు తుదిరూపు అనంతరం ఉన్నతాధికారులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఆర్థిక సర్వే: 2019–20 చెబుతోంది ఇదే...ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే ప్రథమ కర్తవ్యం

భారత్‌ను తయారీ కేంద్రంగా చేయాలి

దాంతో పెద్ద ఎత్తున ఉపాధి

ప్రభుత్వరంగ బ్యాంకులను పటిష్టం చేయాలి

ఆహార సబ్సిడీలను తగ్గించుకోవాలి

మౌలికంపై భారీ పెట్టుబడులు అవసరం

వృద్ధి క్షీణత ముగిసినట్టే...

2020–21లో వృద్ధి రేటు 6–6.5 శాతం మధ్య ఉండొచ్చని అంచనా

న్యూఢిల్లీ: దేశ జీడీపీ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరం 2020–21లో 6–6.5 శాతానికి పుంజుకోవచ్చని 2019–20 ఆర్థిక సర్వే అంచనా వేసింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్యాల విషయంలో పట్టువిడుపుగా వెళ్లాలని.. ప్రజలు ఓటుతో ఇచ్చిన బలమైన తీర్పును సంస్కరణలను వేగంగా అమలు చేసేందుకు వినియోగించుకోవాలని.. భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా (అసెంబుల్‌ ఇన్‌ ఇండియా ఫర్‌ వరల్డ్‌) మార్చాలని.. ఆహార సబ్సిడీలను తగ్గించుకోవాలని.. నాణ్యమైన మౌలిక సదుపాయాలకు భారీగా పెట్టుబడులు అవసరమని.. సంపద, ఉద్యోగ సృష్టికర్తలు అయిన వ్యాపారస్తులను గౌరవంగా చూడాలనే సూచనలు కేంద్ర ప్రభుత్వానికి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020–21 ఆర్థిక బడ్జెట్‌ను శనివారం పార్లమెంట్‌చు సమర్పించనున్న విషయం తెలిసిందే. దీనికి ఒక రోజు ముందు శుక్రవారం ఆర్థిక సర్వే నివేదికను ఆమె పార్లమెంటు ముందుంచారు.  
ద్రవ్యలోటు పరంగా..
2019–20 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటు 3.3 శాతానికి పరిమితం చేస్తామని గత బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. కానీ, కార్పొరేట్‌ పన్ను కోత, ఇతర పన్నుల వసూళ్లు తక్కువగా ఉండడం వంటి పరిస్థితుల నేపథ్యంలో ద్రవ్యలోటు 3.8 శాతానికి చేరుతుందన్నది నిపుణుల అంచనాగా ఉంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో వృద్ధి రేటును బలంగా పైకి తీసుకురావడమే ప్రాధాన్యమైన అంశంగా ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇందుకోసం ద్రవ్యలోటు లక్ష్య సవరణను పరిశీలించొచ్చని సూచించింది. రూ.1.84 లక్షల కోట్ల మేర ఉన్న ఆహార సబ్సిడీలను  తగ్గించుకోగలిగితే ద్రవ్యలోటు విషయంలో ప్రభుత్వానికి ఎంతో వెసులుబాటు లభిస్తుందని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నాక ప్రభుత్వం తన  ఖర్చులను స్థీరీకరించుకోవచ్చని, పలు దేశాలు గతంలో ఇదే మార్గాన్ని అనుసరించాయని పేర్కొంది.  
మౌలిక సదుపాయాలపై భారీ పెట్టుబడులు..
రెవెన్యూ వ్యయాలను తగ్గించుకోవడంతోపాటు మూలధన వ్యయాలను పెంచుకోవడం ద్వారా ఆస్తులను సృష్టించుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది. పెద్ద ఎత్తున పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల పునరుద్ధరణకు సాయంగా నిలవడం ద్వారా పెట్టుబడుల ఆధారిత వృద్ధి సాధ్యపడుతుందని అంచనా వేసింది. వ్యాపార నిర్వహణను సులభంగా చేసేందుకు వీలుగా.. పోర్టుల్లో ఎగుమతులు పెంచేందుకు రెడ్‌ టేపిజం (అధిక నియంత్రణలతో కూడిన విధానాలు)ను తొలగించాలని సూచించింది. 2024–25 నాటికి 5 ట్రిలియన్‌ డాలర్ల (సుమారు రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థ స్థాయికి చేరేందుకు మౌలిక రంగంలో కనీసం 1.4 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు అవసరమని తెలిపింది. ‘‘మౌలిక రంగంలో పెట్టుబడులు ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. విద్యుత్‌ కోతలు, చాలీ చాలని రవాణా సదుపాయాలు అధిక వృద్ధి సాధన దిశగ అవరోధంగా నిలుస్తాయి. సాఫీగా, వేగవంతమైన వృద్ధి కోసం భారత్‌ నాణ్యమైన సదుపాయాల కల్పనకు సకాలంలో తగినన్ని పెట్టుబడులు పెట్టాలి’’ అని ఆర్థిక సర్వే తెలియజేసింది.

ప్రభుత్వరంగ బ్యాంకులు పటిష్టం కావాలి..
అధిక మార్కెట్‌ వాటా కలిగిన ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) దేశ ఆర్థిక వ్యవస్థలో పరిణామ పరంగా చిన్నగా ఉండడాన్ని సర్వే ప్రస్తావించింది. దేశ ఆర్థిక వ్యవస్థ స్థాయికి వాటిని పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది. పీఎస్‌బీలు మరింత సమర్థవంతంగా మారడం ద్వారా ఆర్థిక వృద్ధికి చేయూతగా నిలవాల్సిన అవసరాన్ని తెలియజేసింది. ప్రభుత్వరంగ బ్యాంకులు సమర్థంగా లేకపోతే అది ఆర్థిక వ్యవస్థను వినూత్నమైన అవకాశాలను అందుకోలేని వైకల్యంగా మార్చేస్తుందని హెచ్చరించింది.

బ్యాంకుల్లో అన్ని కార్యకలాపాలకు ఫైనాన్షియల్‌ టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించింది. అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్‌ ఆప్షన్లు (ఈసాప్‌) ఇవ్వడం ద్వారా సమర్థతను పెంచొచ్చని అభిప్రాయపడింది. ‘‘రుణాలకు సంబంధించి నిర్ణయాల్లో, ముఖ్యంగా పెద్ద రుణాల జారీలో బిగ్‌ డేటా, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, మెషిన్‌ లర్నింగ్‌ను వినియోగించుకునేందుకు జీఎస్‌టీఎన్‌ తరహా సంస్థను ఏర్పాటు చేయాలి. రుణ గ్రహీతలను సమగ్రంగా తెలుసుకునేందుకు పీఎస్‌బీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలి’’ అని సర్వే సిఫారసు చేసింది.

ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో మెరుగైన ఫలితాలు..
కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈలు) పెట్టుబడుల ఉపసంహరణను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరాన్ని కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. గతంలో ప్రైవటీకరించిన సీపీఎస్‌ఈల పనితీరు ఆదాయం, లాభాలు, నికర విలువ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన విషయాన్ని గుర్తు చేసింది. గతంలో ప్రైవేటీకరించిన సీపీఎస్‌ఈల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు ముందు పదేళ్లు, ఆ తర్వాత పదేళ్ల కాలంలో వాటి పనితీరును సర్వే అధ్యయనం చేసింది.

హిందుస్తాన్‌ టెలీ ప్రింటర్స్, ఎంఎఫ్‌ఐఎల్, టాటా కమ్యూనికేషన్స్‌ వంటి కొన్ని కంపెనీలు మినహా మిగిలిన వాటి నికర విలువ, స్థూల ఆదాయం, నికర లాభాల మార్జిన్, ఆదాయాల వృద్ధి అన్నది ప్రైవేటీకరణకు ముందు నాటి కాలంలో పోలిస్తే ప్రైవేటీకరణ అనంతరం కాలంలో ఎంతో మెరుగుపడినట్టు సర్వే వెల్లడించింది. పెట్టుబడుల ఉపసంహరణ అన్నది మొత్తానికి వాటి పనితీరు, ఉత్పాదకతను గణనీయంగా మార్చేసినట్టు తెలిపింది.  అధిక లాభదాయకత, సమర్థత పెంపు, మరింత పోటీతత్వం కోసం వేగంగా వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంరహరణను చేపట్టాలని సూచించింది.

పన్ను కోతతో లాభం పెద్ద కంపెనీలకే..
కార్పొరేట్‌ పన్నులో గణనీయమైన తగ్గింపుతో ఎక్కువ ప్రయోజనం పెద్ద కంపెనీలకేనని, చిన్న కంపెనీలు అప్పటికే తక్కువ పన్ను రేటు చెల్లిస్తున్న విషయాన్ని ఆర్థిక సర్వే పేర్కొంది. కార్పొరేట్‌ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం గతేడాది సెప్టెంబర్‌లో నిర్ణయం తీసుకున్న విషయం గమనార్హం.

ఈ నిర్ణయం తీసుకునే నాటికే రూ.400 కోట్ల వరకు టర్నోవర్‌ ఉన్న కంపెనీలు (దేశంలో 99.1 శాతం ఈ పరిధిలోనివే) 25 శాతం కార్పొరేట్‌ పన్ను పరిధిలో ఉన్న విషయాన్ని సర్వే ప్రస్తావించింది. అంటే కేవలం 0.9 శాతం కంపెనీలు (4,698 కంపెనీలు) రూ.400 కోట్ల టర్నోవర్‌ పైగా ఉన్నవి. ఇవి చెల్లించే రేటు 30.9 నుంచి 34.61 శాతం మధ్య (సెస్సులు కూడా కలుపుకుని) ఉంది. దీంతో కార్పొరేట్‌ పన్ను తగ్గింపు చిన్న కంపెనీలకు 3.2 శాతం నుంచి 13.5 శాతం మేర ప్రయోజనం కలిగిస్తే, పెద్ద కంపెనీలకు 18.5 శాతం నుంచి 27.3 శాతం మధ్య లాభం చేకూర్చినట్టు ఆర్థిక సర్వే వివరించింది.

ఇళ్ల ధరలను తగ్గించడం పరిష్కారం!
అమ్ముడుపోని ఇళ్లు అధిక సంఖ్యలో ఉండడంతో వీటిని తగ్గించుకునేందుకు నిర్మాణదారులు కొంత మేర ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే సూచించింది. రియల్‌ఎస్టేట్‌ డెవలపర్లు కొంత మేర హేర్‌కట్‌ (నష్టం) భరించి ధరలను తగ్గిస్తే త్వరగా అమ్ముడుపోతాయని పేర్కొంది.

బిల్డర్లు ఈ విధంగా చేసినట్టయితే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల బ్యాలెన్స్‌ షీట్లు సానుకూలంగా మారతాయని తెలిపింది. 2015–16 నుంచి వృద్ధి నిలిచిపోయినప్పటికీ, ఇళ్ల ధరలు అధిక స్థాయిల్లోనే ఉన్నట్లు పేర్కొంది.

సంపద సృష్టి ద్వారానే..
సంపదను సృష్టించినప్పుడే దాన్ని పంచడం సాధ్యపడుతుందని ఆర్థిక సర్వే రూపకల్పన బృందానికి నేతృత్వం వహించిన కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అన్నారు. అనుమానంగా చూడడం, సంపద సృష్టికర్తలను (వ్యాపారవేత్తలు) అమర్యాదగా చూడడం మంచిది కాదన్నారు. జీడీపీ వృద్ధి నిదానించడాన్ని వృద్ధి సైకిల్‌లో భాగంగానే చూడా లన్నారు. 2011 తర్వాత జీడీపీ రేటును 2.7 శాతం అధికం చేసి చూపిస్తున్నారన్న మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణియన్‌ ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు.  

బలమైన సంస్కరణలు కావాలి
2019–20లో జీడీపీ అంచనా వృద్ధి రేటు 5 శాతం నుంచి 2020–21లో 6–6.5 శాతానికి బలంగా పుంజకుంటుందని తాజా ఆర్థిక సర్వే అంచనా వేసింది. సరైన మోతాదులో సంస్కరణలు, ప్రభుత్వ పెట్టుబడులతో ఈ లక్ష్యం సాధించతగినదే. ఆర్థిక సర్వే అన్నది యూనియన్‌బడ్జెట్‌కు ముందస్తు సూచిక. కనుక బలమైన సంస్కరణల చర్యలను ఈసారి బడ్జెట్‌లో అంచనా వేస్తున్నాం.  
– చంద్రజిత్‌ బెనర్జీ, సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌
 
6–6.5 శాతం వృద్ధి రేటు సవాలే...
డిమాండ్‌ సైకిల్‌ ఇంకా పుంజుకోవాల్సి ఉంది. కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌ సహా అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపిస్తుంది. ఇందుకు గతంలో సార్స్‌ వైరస్‌ ప్రభావాలను పరిగణనలోకి తీసుకుని చూడాలి.
– రణేన్‌ బెనర్జీ, పీడబ్ల్యూసీ ఇండియా  

రికవరీ ఆవశ్యకతను చెప్పింది..
బలమైన ఆర్థిక మందగమనం నుంచి వ్యవస్థ రికవరీ అయ్యేందుకు బలమైన సంస్కరణలను ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరాన్ని సర్వే ప్రస్తావించింది.  
–నిరంజన్‌ హిరనందాని, అసోచామ్‌ ప్రెసిడెంట్‌

>
మరిన్ని వార్తలు