ఏడేళ్ల కనిష్టానికి జీడీపీ వృద్ధి 

29 Feb, 2020 04:20 IST|Sakshi

డిసెంబర్‌ త్రైమాసికంలో 4.7 శాతంగా నమోదు

అంతక్రితం త్రైమాసికంలో 4.5 శాతం

తాజాగా 5.1 శాతానికి సవరణ

పరుగులు తీస్తున్న ద్రవ్యలోటు

బడ్జెట్‌ అంచనాలను దాటి 121 శాతానికి 

న్యూఢిల్లీ: ఇంటా, బయటా ఎన్నో సవాళ్లతో కూడుకున్న పరిస్థితుల్లో, మన స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు డిసెంబర్‌ త్రైమాసికం(క్యూ3)లో ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. 4.7 శాతంగా నమోదైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) జూలై–సెప్టెంబర్‌ కాలంలో వృద్ధి రేటును గతంలో పేర్కొన్న 4.5 శాతం నుంచి 5.1 శాతానికి సవరించినట్టు జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) శుక్రవారం ప్రకటించింది. అలాగే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (2019 ఏప్రిల్‌–జూన్‌)లో వృద్ధి రేటును 5 శాతం నుంచి 5.6 శాతానికి సవరించింది. క్రితం ఆర్థిక సంవత్సరం (2018–19) డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.6 శాతంగా ఉండడం గమనార్హం. తయారీ రంగంలో ఉత్పత్తి క్షీణించడం వృద్ధి రేటు తగ్గేందుకు దారితీసినట్టు ఎన్‌ఎస్‌వో తెలిపింది.

వృద్ధి గణాంకాలు ఇవీ...
►డిసెంబర్‌ త్రైమాసికంలో నమోదైన 4.7 శాతం వృద్ధి రేటు 2012–13 ఆర్థిక సంవత్సరం జనవరి–మార్చి క్వార్టర్‌లో నమోదైన 4.3 శాతం తర్వాత తక్కువ స్థాయి. 
►2019 ఏప్రిల్‌–డిసెంబర్‌ వరకు తొమ్మిది నెలలకు జీడీపీ వృద్ధి 5.1 శాతానికి పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.3 శాతంగా ఉంది. 
►తయారీ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) అంతక్రితం ఏడాది ఇదే కాలంలో 5.2 శాతం వృద్ధి చెందగా, తాజా ఇది 0.2 శాతం మేర తగ్గింది.  
►వ్యవసాయ రంగంలో జీవీఏ క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2 శాతం నుంచి 3.5 శాతానికి పుంజుకుంది. 
►నిర్మాణ రంగంలో జీవీఏ 6.6 శాతం నుంచి 0.3 శాతానికి తగ్గింది. మైనింగ్‌ రంగంలోనూ జీవీఏ 4.4 శాతం నుంచి 3.2 శాతానికి దిగొచ్చింది. 
►విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సేవల విభాగంలోనూ జీవీఏ 0.7 శాతం మేర తగ్గింది. 
►వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్‌ అండ్‌ సర్వీసెస్‌ విభాగంలో జీవీఏ క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 7.8 శాతం నుంచి 5.9 శాతానికి పరిమితమైంది.  
►ప్రస్తుత ధరల ఆధారంగా తలసరి ఆదాయం 2019–20లో రూ.1,34,432గా ఉంటుంది. 2018–19లో ఉన్న తలసరి ఆదాయం రూ.1,26,521తో పోలిస్తే 6.3 శాతం అధికం.

ద్రవ్యలోటు...
2019–20 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో ద్రవ్యలోటును రూ.7,66,846 కోట్లకు పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, జనవరి చివరికే (10 నెలల కాలం) రూ.9,85,472 కోట్లకు ( 128.5 శాతం) చేరింది. ప్రభుత్వ ఖర్చులు, ఆదాయం మధ్య అంతరాన్ని ద్రవ్యలోటుగా పేర్కొంటారు. 

క్షీణత ఇక ముగిసినట్టే: ఆర్థిక శాఖ 
దేశ జీడీపీ వృద్ధి రేటు కనిష్టాన్ని చూసేసిందని (బోటమ్డ్‌ అవుట్‌) కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలోని అకనమిక్‌ అఫైర్స్‌ విభాగం కార్యదర్శి అతాను చక్రవర్తి ప్రకటించారు. కీలక పారిశ్రామిక రంగాల్లో వృద్ధి డిసెంబర్, జనవరి నెలల్లో పుంజుకున్నట్టు చెప్పారు.

>
మరిన్ని వార్తలు