6.1 నుంచి 6.6 వరకూ...

31 Aug, 2017 01:08 IST|Sakshi
6.1 నుంచి 6.6 వరకూ...

తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధిపై అంచనాలు
నేడే గణాంకాల విడుదల  


న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) జూన్‌ త్రైమాసిక (2017, ఏప్రిల్‌–జూన్‌) గణాంకాలు ఆగస్టు 31వ తేదీన విడుదల అవుతున్న నేపథ్యంలో దీనిపై విభిన్న వర్గాల నుంచి అంచనాలు వెలువడుతున్నాయి. 6.1 శాతం నుంచి 6.6 శాతం శ్రేణిలో ఈ లెక్కలు ఉన్నాయి. జనవరి–మార్చి మధ్య జీడీపీ గణాంకాలు కేవలం 6.1 శాతంగా నమోదుకాగా, గత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 7.1 శాతం వృద్ధి నెలకొంది. ఇక నాల్గవ త్రైమాసికంలో ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్‌ వాల్యూ యాడెడ్‌) 5.6%గా ఉంది. ఈ నేపథ్యంలో రానున్న గణాంకాలపై  వివిధ సంస్థల అంచనాలు చూస్తే...

నొమురా: తొలి త్రైమాసికంలో ఈ వృద్ధి రేటు 6.6% ఉంటుందని జపాన్‌ బ్రోకరేజ్‌ సంస్థ– నొమురా అంచనావేసింది. కాగా, ఆర్థికాభివృద్ధి పరంగా డీమోనిటైజేషన్, జీఎస్‌టీ నుంచి నెలకొన్న ప్రతికూలతలు తొలగిపోతున్నట్లు నొమురా పేర్కొంది.

ఇక్రా: జీడీపీ వృద్ధి రేటు  6.1 శాతంగానే ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. ఇక జీవీఏ  వృద్ధి రేటు 6.3 శాతానికి తగ్గుతుందని ఇక్రా అంచనా వేసింది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రేటు 7.6 శాతం. వస్తు సేవల పన్ను అమలు, రూపాయి బలోపేతం వంటి అంశాలను ఇందుకు కారణంగా చూపింది. ఇక జూన్‌ త్రైమాసికంలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు 7.4% నుంచి 3.9%కి పడిపోతుందని ఇక్రా తన తాజా నివేదికలో పేర్కొంది. తయారీ, విద్యుత్, గ్యాస్, జలవనరుల సరఫరా, నిర్మాణ రంగాల పేలవ పనితీరును ఇందుకు కారణంగా చూపింది.  

జీవీఏ–జీడీపీ... వ్యత్యాసం!
ఉత్పత్తివైపు లేదా సరఫరాలవైపు నుంచి ఆర్థిక క్రియాశీలతను జీవీఏ గణాంకాలు సూచిస్తే, వినియోగపరంగా లేదా డిమాండ్‌ పరంగా ఉన్న పరిస్థితిని జీడీపీ గణాంకాలు సూచిస్తాయి.

లాభాలు...: వివిధ సంస్థల అంచనాల ప్రకారం– జీఎస్‌టీ, డీమోనిటైజేషన్‌ ప్రతికూల ఫలితాలు క్రమంగా వీడిపోతాయి. దేశంలో నెలకొన్న డిమాండ్‌ మొత్తం ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7 శాతం పైన నిలబెట్టే వీలుంది. తన వర్షపాతం గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ పురోగతికి దోహదపుడుతుంది.   

నష్టాలు...: ఇప్పటికీ డీమోనిటేజేషన్‌ ఎఫెక్ట్‌ పూర్తిగా తొలగిపోలేదు. దీనికితోడు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) అమల్లో క్లిష్టత నెలకొంది. సేవలు, కార్పొరేట్‌ ఆదాయాలు, పెట్టుబడులు బలహీనంగానే ఉన్నా యి. ఇక పారిశ్రామిక వృద్ధి పేలవంగానే ఉంది.

జీవీఏ వృద్ధి రేటు 7.3 శాతం: ఆర్‌బీఐ
ముంబై: ఆర్థిక క్రియాశీలతను సూచించే జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7.3%గా ఉంటుందని ఆర్‌బీఐ2016–17 వార్షిక నివేదికలో పేర్కొంది. గతేడాది(2016–17) ఇది 6.6%. ఇక రిటైల్‌ ద్రవ్యోల్బణం 2017–18లో తొలి 6 నెలల్లో 2–3.5% శ్రేణిలో ఉంటుందని పేర్కొంది. ద్వితీయ భాగంలో ఈ రేటు 3.5–4.5% శ్రేణిలో ఉండొచ్చని వివరించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2017–18లో కొంత రికవరీ జరిగే అవకాశం ఉందని నివేదికలో అభిప్రాయపడింది. ఆర్‌బీఐ రుణ రేటు తగ్గింపు ప్రయోజనం బ్యాంకింగ్‌ నుంచి అన్ని రంగాలకూ సమానంగా అందడంలేదన్న ఆందోళన వ్యక్తం చేసింది. 2017–18లో ఇప్పటివరకూ 4 రాష్ట్రాలు వ్యవసాయ రుణ రద్దు ప్రకటన చేశాయని, మరికొన్ని రాష్ట్రాలూ ఇదే బాటలో ఉన్నాయని పేర్కొన్న ఆర్‌బీఐ, ఇది స్వల్ప కాలంలో ద్రవ్య క్రమశిక్షణపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది. బ్యాంకింగ్‌ మొండిబకాయిల భారం ఆందోళనకరమైనదేనని పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు