వృద్ధి వేగం తగ్గింది...

1 Dec, 2018 00:14 IST|Sakshi

 సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 7.1 శాతం

మూడు త్రైమాసికాల్లో ఇదే అతి తక్కువ వృద్ధి రేటు

విలువలో చూస్తే రూ.33.98 లక్షల కోట్లు

ఆరు నెలల కాలానికి మాత్రం 7.6 శాతం

ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనది మెరుగే

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌) మందగించింది. 7.1 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు త్రైమాసికాల్లో ఇంత తక్కువ వృద్ధి రేటు ఇదే తొలిసారి. రెండవ త్రైమాసిక కాలంలో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, క్రూడ్‌ ధరల తీవ్రత వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయని ఎస్‌బీఐ రిసెర్చ్‌ ఇక్రా వంటి పలు ఆర్థిక సంస్థలు విశ్లేషించాయి. అందుకుతగినట్లుగానే తాజా ఫలితాలు వెలువడ్డాయి. అక్టోబర్‌– డిసెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 7%. ఆ తరువాత జనవరి–మా ర్చి త్రైమాసికంలో వృద్ధిరేటు 7.7 శాతం. ఏప్రిల్‌–జూన్‌ మధ్య ఇది 8.2 శాతంగా ఉంది. శుక్రవారం కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది. 

7.1 శాతం వృద్ధి ఎలా అంటే... 
2011– 2012 సంవత్సరం ప్రాతిపదికన (బేస్‌) కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం వృద్ధి రేటు 6.3 శాతం. విలువల్లో చూస్తే, రూ.31.72 లక్షల కోట్లు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో విలువ రూ.33.98 లక్షల కోట్లు. అంటే ఈ విలువ 7.1 శాతం పెరిగిందన్నమాట. కాగా జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) ప్రకారం విలువ రూ.29.39 లక్షల కోట్ల నుంచి రూ.31.40 లక్షల కోట్లకు పెరిగింది. వృద్ధి రేటు ఇక్కడ 6.9 శాతమే. మొత్తం ఆర్థిక వ్యవస్థను జీడీపీ ప్రతిబింబిస్తే, రంగాల వారీగా దేశవ్యాప్త వినిమయ పరిస్థితులును జీవీఏ ప్రతిబింబిస్తుంది.  

కీలక విభాగాల్లో వృద్ధి ఇలా... 
∙తయారీ: వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగింది.  
∙నిర్మాణం: వృద్ధి3.1% నుంచి 7.8%కి ఎగసింది.  
∙వ్యవసాయం: ఇక వ్యవసాయ రంగం 2.6 శాతం నుంచి 3.8 శాతానికి ఎగసింది.  
∙మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌: జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం(క్యూ2)లో ఈ రంగం అసలు వృద్ధిలేకపోగా –2.4 శాతం క్షీణత నమోదుచేసుకుంది. అయితే గత ఏడాది ఇదే కాలంలో ఈ రంగం 6.9 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది.  వర్షాకాల అడ్డంకుల ప్రభావం దీనిమీద పడిందని భావించవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ట్వీట్‌ చేశారు.  
∙జీఎఫ్‌సీఎఫ్‌: పెట్టుబడులకు సంబంధించి స్థూల స్థిర మూలధనం జీడీపీలో వార్షికంగా 
1.3 శాతం పెరిగింది. 
∙ఎగుమతులు: రెండవ త్రైమాసికంలో ఎగుమతులు 13.4 శాతం ఎగశాయి 
∙ప్రభుత్వ వినియోగం: భారీగా 12.7% పెరిగింది.  

ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో 7.6 శాతం... 
కాగా మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు కొంత సానుకూలంగా నమోదుకావడంతో ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వృద్ధి రేటు
7.6 శాతంగా ఉంది.

ప్రపంచంలో ‘వేగం’ మాత్రం మనమే! 
మరోవంక, ప్రపంచవ్యాప్తంగా జీడీపీ వృద్ధి రేటులో అగ్ర స్థానంలో మాత్రం భారత్‌ కొనసాగుతోంది.  జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో చైనా వృద్ధిరేటు 6.5 శాతమే. దీనితో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్‌ కొనసాగిస్తున్నట్లు అయ్యింది. 

నిరాశ కలిగిస్తోంది: గార్గ్‌
రెండవ త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధి నిరాశ కలిగించిందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ట్వీట్‌ చేశారు. అయితే మొత్తం ఆరు నెలలు కలుపుకుంటే వృద్ధిరేటు (7.6 శాతం) బాగున్నట్లేననీ ఆయన విశ్లేషించారు. ప్రపంచంలోనే ఇది వేగవంతమైన వృద్ధి రేటు అన్న విషయాన్ని గమనించాలన్నారు.  

సమంజసమే:  ఆర్థికశాఖ 
ఈ గణాంకాలు సమంజసమేనని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. అధిక క్రూడ్‌ ధరలు, బలహీన రూపాయి సవాళ్లు విసిరినప్పటికీ తగిన ఆమోదనీయమైన వృద్ధి రేటును దేశం సాధించిందని ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

అక్టోబర్‌లో మౌలిక రంగం మందగమనం
వృద్ధి కేవలం 4.8 శాతం
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ అక్టోబర్‌లో నిరాశపరిచింది. కేవలం 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌ 2017లో ఈ రంగాల వృద్ధి రేటు 5 శాతం. అయితే నెలవారీగా చూస్తే  సెప్టెంబర్‌కన్నా అక్టోబర్‌లో వృద్ధిరేటు పెరిగింది. సెప్టెంబర్‌లో వృద్ధిరేటు 4.3%. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో దాదాపు

40% వాటా ఉన్న ఈ రంగాల ఫలితాలను క్లుప్తంగా చూస్తే... 
∙ఎరువుల పరిశ్రమ ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా 11.5% క్షీణించింది. క్రూడ్‌ ఆయిల్, సహజ వాయువుల రంగం కూడా 5 శాతం, 0.9% చొప్పున క్షీణతను నమోదుచేసుకున్నాయి.  
∙రిఫైనరీ ప్రొడక్టుల క్షీణత రేటు – 7.5 శాతం నుంచి –1.3 శాతానికి తగ్గింది.  
∙స్టీల్‌ రంగం వృద్ధి రేటు 8.6 శాతం నుంచి 2.2 శాతానికి తగ్గింది.  
∙బొగ్గు, సిమెంట్, విద్యుత్‌ రంగాలు వృద్ధిని సాధించాయి. 

ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య 
కాగా, ఈ ఎనిమిది కీలక రంగాల వృద్ధి రేటు ఏప్రిల్‌–అక్టోబర్‌ మధ్య 3.5 శాతం నుంచి 5.4 శాతానికి పెరిగింది. 

మరిన్ని వార్తలు