వచ్చే రెండేళ్లలో  జీడీపీ 8 శాతం 

11 Jun, 2018 02:33 IST|Sakshi

సంస్కరణలతో బలమైన పునాది: సీఐఐ 

న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్ల పాటు దేశ జీడీపీ వృద్ధి రేటు 8 శాతానికి సమీపంలో నమోదవుతుందని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) పేర్కొంది. బలమైన సంస్కరణలు, ద్రవ్య క్రమశిక్షణ వృద్ధికి గట్టి పునాదులు వేశాయని సీఐఐ అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘‘ఆర్థిక వ్యవస్థ మంచి దశలో ఉందిప్పుడు. గత కొన్ని సంవత్సరాల్లో చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు చాలావరకూ సర్దుబాటు జరిగింది. సామర్థ్య వినియోగం పుంజుకుంటే దేశీయ పరిశ్రమలు తాజా పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయి’’ అని సీఐఐ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ భారతి మిట్టల్‌ తెలిపారు.

రూ.50 వేల కోట్ల పెట్టుబడుల ప్రణాళికలను సీఐఐ ఇటీవలే ప్రకటించడం గమనార్హం. ‘‘వచ్చే కొన్ని సంవత్సరాల పాటు జీడీపీ 8 శాతం సమీపానికి పుంజుకుంటుందని పరిశ్రమలు భావిస్తున్నాయి. ద్రవ్య క్రమశిక్షణ, స్థూల ఆర్థిక నిర్వహణ, బలమైన సంస్కరణల ప్రక్రియ వృద్ధికి గట్టి పునాది వేశాయి’’ అని రాకేశ్‌ పేర్కొన్నారు. సీఈవోల అభిప్రాయాలపై సీఐఐ నిర్వహించిన పోల్‌లో, 82 శాతం మంది జీడీపీ 2018–19 సంవత్సరానికి 7 శాతానికి పైనే నమోదవుతుందని తెలియజేయగా, మరో 10 శాతం మంది సీఈవోలు 7.5 శాతంపైనే ఉండొచ్చని అభిప్రాయం తెలిపారు. 

మరిన్ని వార్తలు