జీడీపీపై ఫిక్కీ తీవ్ర ఆందోళన

31 Aug, 2019 16:23 IST|Sakshi

ప్రైవేటు పెట్టుబడులు, వినియోగ డిమాండ్‌లో గణనీయమైన క్షీణతకు సూచన - ఫిక్కీ

 కేంద్రం, ఆర్‌బీఐ చేపట్టిన దిద్దుబాటు చర్యలతో రానున్న త్రైమాసికాల్లో మెరుగుపడవచ్చు

సాక్షి, న్యూఢిల్లీ:  భారతదేశ ఆర్థిక వృద్ధి (ఏప్రిల్-జూన్ 2019) ఆరేళ్ల కనిష్టానికి  పడిపోవడంపై  పరిశ్రమ సంస్థ ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. పెట్టుబడులు, వినియోగదారులు డిమాండ్‌లో గణనీయమైన క్షీణతను ఇది సూచిస్తుందని వ్యాఖ్యానించింది.  అయితే  ఈ పరిస్థితిని  ఎదుర్కొంనేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ  తీసుకుంటున్నచర్యలు తరువాతి  త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి సహాయపడతాయని ఫిక్కీ శనివారం విడుదల చేసిన ఒక  ప్రకటనలో అభిప్రాయపడింది. ఆర్థికవృద్ధి వేగం మందగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమనీ తాజా జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి బలహీనంగా వున్నాయన్నారు. అయితే విస్తృత చర్యలు, ఆయా రంగాల్లో నిర్దిష్ట జోక్యాల మేళవింపుతో భారత ఆర్థిక వ్యవస్థ ఈ  సంక్షోభం నుంచి త్వరలో బయటకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  ఇటీవల ప్రభుత్వం మరియు ఆర్‌బిఐ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలో జీడీపీ వృద్ధి రేటును పునరుజ్జీవింపజేస్తాయని చెప్పారు. మెగా బ్యాంకుల విలీనం, ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ, బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీ లాంటివి కీలకమన్నారు. 

సీహెచ్‌డీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ.  "ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులపై మెరుగైన సర్‌చార్జిని రోల్‌బ్యాక్ చేయడం, పెండింగ్‌లో ఉన్న అన్ని  జీఎస్‌టీ రిఫండ్స్‌ను ఎంఎస్‌ఎంఇలకు చెల్లించడం లాంటివి వృద్ధిని స్థిరపరుస్తాయన్నారు. అలాగే  స్థిరకాల ఉపాధి, నియామకాలలో వెసులుబాట్లులాంటి కార్మిక చట్టాల సంస్కరణలతో పాటు, చిన్న,మధ్య తరహా వ్యాపారాలలో సంస్కరణలు కీలకమని తద్వారా ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. 

కాగా భారత ఆర్థిక వృద్ధి వరుసగా ఐదవ త్రైమాసికంలో క్షీణించి, జూన్ నెలతో ముగిసినమొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టం వద్ద 5 శాతానికి పడిపోయింది. ప్రపంచ ప్రతికూల సంకేతాలకు తోడు  ప్రైవేటు పెట్టుబడులు, వినియోగదారుల డిమాండ్‌ మందగించడం ఈ పరిణామానికి దారితీసింది. కాగా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను ఈ ఏడాది ప్రారంభంలోనే కోల్పోయిన భారత  జీడీపీ వృద్ధి ఏప్రిల్-జూన్‌లో చైనా 6.2 శాతంతో పోలిస్తే  బాగా వెనుకబడి ఉంది. గత  27  సంవత్సరాలలో ఇదే బలహీనం.

మరిన్ని వార్తలు