దేశ ఆర్థికాభివృద్ధి 6.8%: ఫిక్కీ

31 Jan, 2017 00:58 IST|Sakshi
దేశ ఆర్థికాభివృద్ధి 6.8%: ఫిక్కీ

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థికవృద్ధి (జీడీపీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 6.8 శాతంగా నమోదవుతుందని పారిశ్రామిక మండలి ఫిక్కీ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ సర్వే పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు అనంతరం సేవలు, మౌలిక రంగాల వృద్ధిలో మందగమనం జీడీపీ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని సర్వే పేర్కొంది. సర్వేకు సంబంధించి కొన్ని  ముఖ్యాంశాలు చూస్తే...

2016 డిసెంబర్‌ 2017 జనవరిలో పరిశ్రమలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సేవలు, ఆర్థిక రంగాలకు చెందిన పలువురు నిపుణుల అంచనాల ప్రాతిపదికన ఫిక్కీ తాజా సర్వే వెలువరించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ 7.1 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల కార్యాలయం చెబుతున్నదానికన్నా ఫిక్కీ అంచనా తక్కువ కావడం గమనార్హం.

2016–17లో వ్యవసాయ రంగం కొంత మెరుగ్గా ఉండే వీలుంది. అయితే సేవలు, పారిశ్రామిక రంగాలు మాత్రం మందగించే వీలుంది. ఈ రంగాల వృద్ధి వరుసగా 8.5 శాతం, 5.7 శాతంగా నమోదయ్యే వీలుంది.

నగదు ఆధారిత అసంఘటిత రంగంపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడింది.

పెద్ద నోట్ల రద్దు వల్ల జరిగిన ప్రతికూల ప్రభావాలు మార్చి 2017తో ముగుస్తాయని కొందరు ఆర్థికవేత్తలు అభిప్రాయపడితే,  కొందరు జూన్‌ వరకూ సమయం పడుతుందని మరికొందరు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు